పైడిభీమవరంలో భూబాగోతం!

ABN , First Publish Date - 2021-12-31T05:37:32+05:30 IST

తొలుత డీ పట్టా భూమిని కొనుగోలు చేశారు. తరువాత పక్కనే ఉన్న చెరువు భూమిని కలిపేసుకున్నారు. సాగునీటి వాగును సైతం ఆక్రమించుకున్నారు. ఎంచక్కా భారీ భవంతులు నిర్మించేస్తున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే ఆ భూమి హక్కుదారులం తామేనని బదులిస్తున్నారు. రాజకీయ, అధికారుల అండదండలున్నాయని చెప్పుకొస్తున్నారు’...రణస్థలం మండలం పైడిభీమవరం సమీపంలో జాతీయ రహదారి పక్కనే జరుగుతున్న అ

పైడిభీమవరంలో భూబాగోతం!
డీ పట్టా భూముల్లో బహుళ అంతస్తులు నిర్మిస్తున్న దృశ్యం


రూ.4 కోట్ల భూమి హంఫట్‌!

డీ పట్టా స్థలాల్లో బహుళ అంతస్తులు

చెరువు ఆక్రమించి నిర్మాణాలు

 అనుమతులు లేవు

పట్టించుకోని అధికారులు

బరితెగిస్తున్న అక్రమార్కులు

(రణస్థలం)

తొలుత డీ పట్టా భూమిని కొనుగోలు చేశారు. తరువాత పక్కనే ఉన్న చెరువు భూమిని కలిపేసుకున్నారు. సాగునీటి వాగును సైతం ఆక్రమించుకున్నారు. ఎంచక్కా భారీ భవంతులు నిర్మించేస్తున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే ఆ భూమి హక్కుదారులం తామేనని బదులిస్తున్నారు. రాజకీయ, అధికారుల అండదండలున్నాయని చెప్పుకొస్తున్నారు’...రణస్థలం మండలం పైడిభీమవరం సమీపంలో జాతీయ రహదారి పక్కనే జరుగుతున్న అక్రమ బాగోతమిది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వరిశాం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 48-2లో 59 సెంట్ల డీ పట్టా భూములు ఉన్నాయి. గతంలో కొందమంది దళితులకు ప్రభుత్వం ఈ భూములు మంజూరు చేసింది. ఆ భూములతో సంబంధం లేని ముగ్గురు వ్యక్తులు ఇప్పుడు అక్కడ రెండు బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. షాపులతో పాటు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. చెంతనే ఉన్న ఎర్ర చెరువు స్థలాన్ని సైతం కలిపేసుకున్నారు. వాగును మట్టితో కప్పేశారు. వీటికి సంబంధించి పంచాయతీ, ఉడా అనుమతులు లేవని తెలుస్తొంది. సామాన్యుల విషయంలో హడావుడి చేసే అధికారులు ఇక్కడి నిర్మాణాల విషయం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తొంది. కొన్నేళ్లుగా బాగోతం నడుస్తున్నప్పటికీ అటువైపుగా రెవెన్యూ అధికారులు చూడడం లేదు. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమికి రెక్కలు వచ్చాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆక్రమణల బారిన ఎర్ర చెరువు

సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఎర్ర చెరువు ఉండేది. రైతులకు సాగునీటితో పాటు గ్రామ అవసరాలను తీర్చేది. కాలక్రమేణా నీటి లభ్యత లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. పారిశ్రామికవాడకు దగ్గరగా ఉండడం, హైవేకు ఆనుకొని ఉండడంతో ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగాయి. సెంటు రూ.10 లక్షలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి చెరువుపై అక్రమార్కుల కన్నుపడింది. ప్రస్తుతం చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. చెరువు వాగు సైతం అక్రమార్కుల పరమైంది. ఏకంగా మట్టి వేయడంతో నీరు వచ్చే మార్గం మూసుకుపోయింది. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినా రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులు పట్టించుకోలేదు.  ప్రతిరోజూ ఇదే మార్గం గుండా రెవెన్యూ అధికారులు, సిబ్బంది వెళ్తుంటారు. అక్రమ నిర్మాణాలు అని తెలిసినా ఏ ఒక్కరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో అక్రమార్కులు దర్జాగా నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులకు మామూళ్లు ముట్టడం వల్లనే పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తుంటే మాకు పత్రాలు ఉన్నాయని.. అధికార, రాజకీయ బలముందంటూ నిర్మాణదారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలకు చెక్‌ చెప్పాలని స్థానికులు కోరుతున్నారు. 

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వ స్థలాలు ఆక్రమించడం నేరం. సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. డీ పట్టా భూములు, చెరువు స్థలాల్లో నిర్మాణాలను పరిశీలిస్తాం. అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఫిర్యాదు చేయాలి. వెంటనే చర్యలు తీసుకుంటాం.

-సుధారాణి, తహసీల్దారు, రణస్థలం




Updated Date - 2021-12-31T05:37:32+05:30 IST