అక్షరాలా..లక్ష!
ABN , First Publish Date - 2021-05-22T04:01:45+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు లక్ష దాటేశాయ్. గత ఏడాది మార్చి నుంచి కరోనా విజృంభణ మొదలైంది. ఈ వైరస్‌ను ‘లాక్‌డౌన్’తో కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్ తగ్గుముఖం పట్టడానికి దాదాపు ఏడు.. ఎనిమిది నెలలు పట్టింది. మళ్లీ గత మూడు నెలలుగా రెండో దశ వైరస్ వ్యాప్తి.. జిల్లా

ఇదీ ఏడాదిలో కరోనా కేసుల సంఖ్య
మొత్తంగా 1,00,812 మందికి పాజిటివ్
కోలుకున్న అనేక మంది బాధితులు
ప్రస్తుతం 12,672 యాక్టివ్ కేసులు
వైరస్ నియంత్రణ చర్యల్లో నిమగ్నమైన అధికారులు
(కలెక్టరేట్)
జిల్లాలో కరోనా కేసులు లక్ష దాటేశాయ్. గత ఏడాది మార్చి నుంచి కరోనా విజృంభణ మొదలైంది. ఈ వైరస్‌ను ‘లాక్‌డౌన్’తో కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్ తగ్గుముఖం పట్టడానికి దాదాపు ఏడు.. ఎనిమిది నెలలు పట్టింది. మళ్లీ గత మూడు నెలలుగా రెండో దశ వైరస్ వ్యాప్తి.. జిల్లావాసులకు వణుకు పుట్టిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో భయాందోళన వ్యక్తమవుతోంది. వైరస్ నియంత్రణ కోసం అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పకడ్బందీగా ఈ నెల 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాహన తనిఖీలు నిర్వహించి.. రహదారులపై మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల ఎవరూ తిరగకుండా చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కేసులు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టకపోవడంతో అధికారులు సైతం సతమతమవుతున్నారు.
వైరస్ వ్యాప్తి ఇలా..
జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ 23న పాతపట్నం మండల కేంద్రంలో తొలి కరోనా కేసు బయటపడింది. అలా క్రమేపీ బాధితుల సంఖ్య పెరిగింది. ఆరు నెలలపాటు తీవ్ర ప్రభావం చూపింది. వైరస్ నియంత్రణకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది మార్చి చివరి వారం నుంచి రెండో దశ వైరస్ వ్యాప్తి మొదలైంది. ఫిబ్రవరి నాటికి జిల్లాలో 45వేల కరోనా కేసులు బయటపడ్డాయి. మార్చి 31 నాటికి బాధితుల సంఖ్య 47,016కి చేరింది. ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 21,350 మందిలో వైరస్ బయటపడగా.. బాధితుల సంఖ్య 68,366కు చేరింది. ఈ (మే) నెలలో వైరస్ మరింత విజృంభించింది. ఇప్పటి వరకూ కేవలం 21 రోజుల్లో 32,446 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా జిల్లాలో శుక్రవారం నాటికి 12,04,648 నమూనాలు సేకరించగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,812కి చేరింది. పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నా.. చాలా మంది బాధితులు కోలుకున్నారు. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,672 ఉంది. హోం ఐసోలేషన్‌లో 10,028 మంది, కొవిడ్ కేర్ సెంటర్లలో 915 మంది, కొవిడ్ ఆస్పత్రుల్లో 1,729 మంది చికిత్స పొందుతున్నారు.
నివారణకు కృషి
కరోనా నివారణకు అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. పట్టణాలతో పాటు పల్లెలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటింటా ఫీవర్ సర్వే చురుగ్గా చేస్తున్నారు. ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, వలంటీర్లతో కలిసి ఇంటింటా సర్వే చేపడుతున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారి వివరాలను వలంటీర్లు యాప్ ద్వారా అధికారులకు నివేదిక అందజేస్తున్నారు. ఈ క్రమంలో పరీక్షలు వేగవంతం చేస్తున్నారు. బాధితులకు సక్రమంగా చికిత్స అందజేసేలా చర్యలు చేపడుతున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు కిట్లు అందజేస్తున్నారు. మరోవైపు పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ పనులు ముమ్మరం చేస్తున్నారు. కరోనా కట్టడికి గ్రామస్థాయిలో కొవిడ్ యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీలకు సర్పంచులు అధ్యక్షులుగా, ఏఎన్‌ఎంలు సమన్వయకర్తలుగా, ఆశావర్కర్లు, వలంటీర్లు, వార్డు సభ్యులు, పారిశుధ్య సిబ్బంది సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కమిటీ సభ్యులు కొవిడ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి.. వైరస్ నివారణ చర్యలు చేపట్టనున్నారు. కరోనా కేసులు లేని గ్రామాలకు ప్రోత్సాహకం కింద రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్టు అధికారులు ప్రకటించారు.