అక్రమార్కుల.. అడ్డా!
ABN , First Publish Date - 2021-12-16T04:39:38+05:30 IST
ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పోలీసు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) అధికారులు నిత్యం తనిఖీలు చేస్తున్నా, ఒడిశా నుంచి మద్యం అక్రమంగా సరిహద్దులు దాటిపోతోంది.

- ఒడిశా సరిహద్దుల్లో జోరుగా మద్యం అక్రమ రవాణా
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)
ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పోలీసు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) అధికారులు నిత్యం తనిఖీలు చేస్తున్నా, ఒడిశా నుంచి మద్యం అక్రమంగా సరిహద్దులు దాటిపోతోంది. జిల్లా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన మెళియాపుట్టి మండలం వసుంధర, పట్టుపురం, రంపకాన, మందస మండలం లోసిపి, పాతపట్నం, కొత్తూరు మండలం మాతల, మాకవరం, కడుము, భామిని మండలం బత్తిలి, ఇచ్ఛాపురంలోని పురుషోత్తపురంలో చెక్‌పోస్టులు ఉన్నాయి. ఈ చెక్‌పోస్టుల వద్ద తనిఖీల్లో మద్యం బాటిళ్లు అధికంగా పట్టుబడుడుతున్నాయి. గత ఏడాది మద్యం అక్రమ రవాణాపై 1,272 కేసులు నమోదయ్యాయి. 1,945 మందిని అరెస్టు చేశారు. సుమారు 230 వాహనాలను సీజ్ చేశారు. ఈ ఏడాది మరింత అదనంగా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఒడిశాలో తక్కువ ధరకు లభ్యమయ్యే కొన్ని బ్రాండ్‌ల మద్యాన్ని కొందరు వ్యాపారులు గుట్టుగా రవాణా చేస్తున్నారు. జిల్లాలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒడిశాలో రూ.180 ఉన్న మద్యం బాటిల్‌ను రూ.260కి, రూ.150 ఉన్న బీరుబాటిల్‌ను రూ.260కి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం అక్రమ వ్యాపారులపై అధికారులు మొక్కుబడిగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులు నేతల సిఫారసుతో కేసులు లేకుండా తప్పించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీ అధికారులకు మామూళ్లు చెల్లించి.. అక్రమాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు మద్యం అక్రమ రవాణా నియంత్రణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ప్రత్యేక దృష్టి
మద్యం అక్రమ రవాణా వ్యాపారులపై ప్రత్యేక దృష్టి సారించాం. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నాం. అరెస్టుల విషయంలో ఎటువంటి ఒత్తిళ్లు లేవు. వ్యాపారులతో సిబ్బంది ఒప్పందాలు జరిగే అవకాశం లేదు.
- శ్రీనివాసరావు, జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారి