దొరకనని.. ‘భ్రమ’పడి

ABN , First Publish Date - 2021-09-03T05:22:05+05:30 IST

సుమారు ఐదు మండలాలకు సంబంధించి వ్యవసాయ శాఖ కీలక అధికారి ఆమె. సాగులో సలహాలు, సూచనలందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు బాధ్యత చూస్తుంటారు. ఎరువుల దుకాణాలను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. దుకాణాలకు లైసెన్సుల మంజూరు నుంచి.. రెన్యువల్స్‌ వరకు అన్నీ ఆమె ఆధీనం చేయాల్సిందే. ఇదే అదునుగా ఆమె ఎరువుల వ్యాపారులను వేధింపులకు గురిచేశారు. చీటికి మాటికి తనిఖీల పేరుతో హడావుడి చేస్తూ.. లంచం డిమాండ్‌ చేసేవారు. లేదంటే లైసెన్సులు రద్దు చేస్తామని బెదిరించేవారు. ఈ చర్యలకు విసిగివేసారిన బాధిత వ్యాపారులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రూ.25 వేలు లంచం ఇస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా ఆమెను పట్టించారు.

దొరకనని.. ‘భ్రమ’పడి
ఏసీబీకి పట్టుబడిన వ్యవసాయ శాఖ ఏడీ భ్రమరాంబ

- ఏసీబీ వలలో కొత్తూరు వ్యవసాయ శాఖ ఏడీ

- రూ.25 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన భ్రమరాంబ

- వేధింపులు తాళలేక పట్టించిన ఎరువుల దుకాణదారులు

కొత్తూరు, సెప్టెంబరు 2: సుమారు ఐదు మండలాలకు సంబంధించి వ్యవసాయ శాఖ కీలక అధికారి ఆమె. సాగులో సలహాలు, సూచనలందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు బాధ్యత చూస్తుంటారు. ఎరువుల దుకాణాలను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. దుకాణాలకు లైసెన్సుల మంజూరు నుంచి.. రెన్యువల్స్‌ వరకు అన్నీ ఆమె ఆధీనం చేయాల్సిందే.  ఇదే అదునుగా ఆమె ఎరువుల వ్యాపారులను వేధింపులకు గురిచేశారు. చీటికి మాటికి తనిఖీల పేరుతో హడావుడి చేస్తూ.. లంచం డిమాండ్‌ చేసేవారు. లేదంటే లైసెన్సులు రద్దు చేస్తామని బెదిరించేవారు. ఈ చర్యలకు విసిగివేసారిన బాధిత వ్యాపారులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రూ.25 వేలు లంచం ఇస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా ఆమెను పట్టించారు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ డీవీవీ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

కొత్తూరు వ్యవసాయ శాఖ ఏడీ వేదుల భ్రమరాంబ గురువారం రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆమె కొత్తూరు, భామిని, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి మండలాల పరిధిలో ఎరువుల దుకాణాల లైసెన్స్‌ మంజూరు వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. హిరమండలానికి ప్రత్యేకాధికారిగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఐదు మండలాల్లో ఉన్న వివిధ ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. నిబంధనలు సాకుగా చూపి దుకాణదారుల నుంచి నగదు డిమాండ్‌ చేసేవారు. చెల్లిస్తే డీలర్‌షిప్‌ కొనసాగుతుందని.. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించేవారు. భామిని మండలం సింగిడి గ్రామానికి చెందిన అన్నపూర్ణ ఆగ్రోస్‌ యజమాని తాలాసు మధు, జీఎస్‌ఎన్‌ ట్రేడర్స్‌ యజమాని గుడ్ల షణ్ముఖరావులకు ఇదే పరిస్థితి ఎదురైంది. రూ.50 వేలు ఇవ్వకుంటే లైసెన్స్‌ రద్దుచేస్తామని హెచ్చరించడంతో వారిద్దరూ  మనస్తాపానికి గురయ్యారు. చివరకు రూ.25వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత శ్రీకాకుళంలోని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తిని ఆశ్రయించారు. ఆయన సూచనల మేరకు గురువారం సాయంత్రం కొత్తూరు కార్యాలయం వద్ద రూ.25 వేలు ఆమెకు అందజేశారు. అదే సమయంలో అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా ఆమెను పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాడిలో ఏసీబీ సీఐ భాస్కరరావు, హరి, సత్యారావు తదితరులు పాల్గొన్నారు. ఏడీ భ్రమరాంబను అరెస్ట్‌ చేసి విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. షాపుల లైసెన్స్‌, ఎరువుల ఇండెంట్‌, ఎటువంటి పనికైనా ఏడీ భ్రమరాంబ డబ్బులు డిమాండ్‌ చేసేవారని..అందుకే విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించినట్టు బాధిత వ్యాపారులు మధు, షణ్ముఖరావులు తెలిపారు.

Updated Date - 2021-09-03T05:22:05+05:30 IST