శ్రీకూర్మనాథునికి కోటి తులసీదళార్చన

ABN , First Publish Date - 2021-11-01T03:54:24+05:30 IST

శ్రీకూర్మనాథునికి కోటి తులసీదళార్చన

శ్రీకూర్మనాథునికి కోటి తులసీదళార్చన
శ్రీకూర్మక్షేత్రంలో కోటితులసీదళార్చన దృశ్యాలు

- గోవిందనామ ప్రచార సేవాసంఘం ఆధ్వర్యంలో నిర్వహణ

- అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు  

శ్రీకూర్మం (గార), అక్టోబరు 31: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. వేలాది మంది భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఏకాదశి పర్వదినాన ఆదివారం లక్ష్మీసమేత శ్రీకూర్మనాథునికి కోటి తులసీ దళార్చన నిర్వహించారు. విజయవాడకు చెందిన శ్రీగోవిందనామ ప్రచార సేవాసంఘం, విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో వేదికపై అలంకరించారు.  ప్రత్యేక పూజల అనంతరం కోటి తులసీ దళార్చన ప్రారంభించారు. గోవిందనామ ప్రచార సేవాసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సునీతామధుసూదన్‌ దంపతులు, వీహెచ్‌పీ జిల్లాకార్యదర్శి శ్రీరంగం మధుసూదనరావులు స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. వీరితో పాటు వేలాది మంది భక్తులు గోవిందనామస్మరణతో పాదయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. తులసీ దళాల బుట్టలను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈవో ఎస్‌.విజయకుమార్‌, ప్రధాన అర్చకులు సీతారామనర్సింహాచార్యులు, ఇతర అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. చిన్నారులు వస్త్రధారణ, నృత్య ప్రదర్శనలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సునీతామధుసూదన్‌ దంపతులు మాట్లాడుతూ ‘ద్వారకా తిరుమల, మంగళగిరిలలో కోటీ తులసీ దళార్చన నిర్వహించాం. ఇప్పుడు శ్రీకూర్మంలో చేపట్టాం. భక్తుల సహకారంతో మరిన్ని శ్రీవైష్ణవ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామ’ని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ధర్మాన రామమనోహర్‌నాయుడు, ఎంపీపీ గొండు రఘురాం, వైస్‌ ఎంపీపీ బరాటం రామశేషు, బరాటం నాగేశ్వరరావు, కైబాడి రాజుతోపాటు స్థానిక పెద్దలు పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-01T03:54:24+05:30 IST