పలాసలో ఘరానా మోసం!

ABN , First Publish Date - 2021-11-03T05:12:48+05:30 IST

చిట్‌ఫండ్‌ సంస్థలు, ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థల మోసాలు వెలుగు చూస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. మాయ మాటలను నమ్మి భారీ మొత్తంలో పోగొట్టుకుంటున్నారు. ఆరేళ్లలో రెట్టింపు నగదు ఇస్తామని నమ్మబలకడంతో ఏకంగా 700 మంది రూ.5 కోట్లకుపైగా డిపాజిట్‌ చేశారు.

పలాసలో ఘరానా మోసం!
బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న సీఐడీ అధికారులు

- బోర్డు తిప్పేసిన కేఎంజే సంస్థ

- రూ.5 కోట్ల డిపాజిట్లు సేకరణ

- 700 మంది బాధితులకు మూడేళ్ల కిందట కుచ్చుటోపి

-తాజాగా సీబీసీఐడీ విచారణతో వెలుగులోకి..

పలాస, నవంబరు 2: చిట్‌ఫండ్‌ సంస్థలు, ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థల మోసాలు వెలుగు చూస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. మాయ మాటలను నమ్మి భారీ మొత్తంలో పోగొట్టుకుంటున్నారు. ఆరేళ్లలో రెట్టింపు నగదు ఇస్తామని నమ్మబలకడంతో  ఏకంగా 700 మంది రూ.5 కోట్లకుపైగా డిపాజిట్‌ చేశారు. తీరా గడువు ముగుస్తుందనగా ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. పలాసలో కేఎంజే ల్యాండ్‌ డెవలపర్స్‌ పేరిట వెలుగుచూసిన మోసం ఇది. మంగళవారం సీబీసీఐడీ దర్యాప్తుతో బాధితులు, ఏజెంట్లు ఒక్కొక్కరూ బయటకు వచ్చారు. ఇందుకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. న్యూఢిల్లీ కేంద్రంగా నడిచే కేఎంజే ల్యాండ్‌ డెవలపర్స్‌ ఇండియా లిమిటెడ్‌ అనే సంస్థ దేశంలోని పది రాష్ట్రాల్లో వ్యాపార లావాదేవీలు విస్తరించింది. అందులో భాగంగా 2012లో పలాసలో కార్యాలయం ప్రారంభించింది. ఏజెంట్లను నియమించుకొని ఖాతాదారులను ఆకర్షించింది. ఐదు, ఆరు సంవత్సరాల్లో పొదుపు చేసుకున్న నగదుకు రెట్టింపు మొత్తాన్ని అందిస్తామని నమ్మబలికింది. దీంతో   గ్రామీణ ప్రాంత ప్రజలు ఖాతాదారులుగా మారారు. ఫిక్స్‌డ్‌, రికరింగ్‌, నెలవారి ఇన్వెస్ట్‌మెంట్‌ డిపాజిట్ల రూపంలో సేకరించారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంతిల్లు, భవిష్యత్‌ అవసరాల కోసం దాచుకున్న నగదును ఆ సంస్థలో డిపాజిట్‌ చేశారు. స్వల్పకాలంలో ఖాతాదారుల సంఖ్య 700కు పెరిగింది.  బాండ్ల మెచ్యూరిటీ గడువు సమీపిస్తుందనగా 2018లో ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తినా   సంస్థ ప్రతినిధులు పట్టించుకోలేదు. మూడేళ్లుగా బాధితులు నగదు కోసం వేచిచూశారు.  అటు నుంచి స్పందన లేకపోగా..తిరిగి బాధితులకు హెచ్చరికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాధితులు మంత్రి సీదిరి అప్పలరాజును ఆశ్రయించారు. దీనికి ఆయన స్పందిస్తూ బాధితులతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించడంతో పాటు డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విశాఖపట్నం సీబీసీఐడీ సీఐ బుచ్చిరాజు, ఎస్‌ఐ రాజగోపాల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మంగళవారం దర్యాప్తు చేపట్టింది. బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి ఎంతమంది ఈ సంస్థ బారిన పడ్డారు? ఎంత మేరకు డబ్బులు పోగొట్టుకున్నారు? ఏజెంట్ల వివరాలను ఆరా తీసి నమోదు చేసుకున్నారు. తప్పకుండా న్యాయం చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. 

 పేరు మార్చి..

వాస్తవానికి మూడేళ్ల కిందటే ఈ సంస్థపై బాధితులు కోర్టులో కేసు వేశారు. కానీ సంస్థ దురాలోచనతో కేఎంజే పేరును లోహిత్‌ భారతి క్రెడిట్‌ కోపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌గా మార్చి మొత్తం నిధులన్నీ ఆ సంస్థకు బదలాయించింది. రెండు సంస్థలు చేతులు మారినా ఖాతాదారులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకపోవడంతో పాటు ఏకంగా కంపెనీ బోర్డు తిప్పేసింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థ ఉత్తరప్రదేశ్‌, మద్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఒడిశా, గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక శాఖలు విస్తరించింది. కేవలం ఐదు, ఆరేళ్లులో కట్టిన నగదుకు రెట్టింపు ఇస్తామని నమ్మబలకడంతో వేలాదిమంది ఈ సంస్థలో పెట్టుబడి పెట్టారు. దీనీకి ఏజెంట్లు, బ్రోకర్లను నియమించుకొని వారికి కోరినంత డబ్బులు చెల్లించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయనగరం, బొబ్బిలి, పలాస కేంద్రాల్లో 6వేల మంది ఖాతాదారులు ఈ సంస్థకు ఉన్నారు.

రూ.70 లక్షలు కట్టించాను

ఈ సంస్థలో ఏజెంటుగా చేరి ఖాతాదారుల నుంచి రూ.70 లక్షల వరకు కట్టించాను. నా కుమార్తె వివాహానికి రూ.7 లక్షలు డిపాజిట్‌ చేశాను. కంపెనీ ఎత్తివేసిన తరువాత ఖాతాదారుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. వ్యక్తిగతంగా చాలా నష్టపోయాను. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. 

-ఎ.సరోజినమ్మ, బాధితురాలు, ఏజెంట్‌, మంచినీళ్లపేట 


Updated Date - 2021-11-03T05:12:48+05:30 IST