రేపటి నుంచి దసరా వేడుకలు
ABN , First Publish Date - 2021-10-06T05:03:36+05:30 IST
నగరంలో స్టోన్‌హౌస్‌పేటలో గల వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి వైభవంగా జరుగుతాయని నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. మంగ ళవారం ఆలయంలో దేవస్థానం పాలక మండలితో కలిసి దేవీ నవరాత్రుల బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు.
నెల్లూరు (సాంస్కృతికం), అక్టోబరు 5 : నగరంలో స్టోన్‌హౌస్‌పేటలో గల వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి వైభవంగా జరుగుతాయని నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. మంగ ళవారం ఆలయంలో దేవస్థానం పాలక మండలితో కలిసి దేవీ నవరాత్రుల బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను అమ్మవారి ఉత్సవాలలో భాగస్వాములను చేయాలని ఈ ఏడాది వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. గురువారం ఉదయం పెన్నానది నుంచి తీర్థ సంగ్రహణం, ప్రాణప్రతిష్ఠ, కళాన్యాసం జరుగుతాయన్నారు. రాత్రికి బాలత్రిపుర సుందరి అలంకారం, సహస్ర దీపాలంకరణ, మూలవర్లకు పసుపు, కుంకుమతో అలంకారం జరుగుతాయని తెలిపారు. అమ్మవారు రోజుకొక అలంకరణలో దర్శనమిస్తుందన్నారు. 15వతేదీ సాయంత్రం విజయదశమి సందర్భంగా శమీ పూజ, రాత్రికి నగరోత్సవం జరుగుతాయన్నారు. 16వతేదీ వసంతోత్సవం, దర్బారు అలంకారం జరుగుతాయని, భక్తులందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు సుంకు మనోహర్, కార్యదర్శి అయితా రామచంద్రరావు, కోశాధికారి పబ్బిశెట్టి శ్రీనివాసులు, కోట సూర్యనారాయణ, షరాబు సుబ్రహ్మణ్యం, పీర్ల సీతారామారావు, శ్రీరామ్‌సురేష్, సీతారామమందిరం చైర్మన్ కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
రంగడి ఆలయంలో నేటి నుంచి...
తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో బుధవారం నుంచి 14వతేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో డీ వెంకటేశ్వర్లు, చైర్మన్ ఇలపాక శివకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ ఉదయం రంగనాయకి అమ్మవారికి తిరుమంజనం, రాత్రి శ్రీదేవి భూదేవి, రంగనాయకమ్మ, రంగనాథస్వామికి ప్రాకారోత్సవం, ఊంజల్ సేవ జరుగుతాయని, భక్తులందరూ పాల్గొనాలని కోరారు.
పప్పుల వీధి మహాలక్ష్మికి...
పప్పులవీధి మహాలక్ష్మి ఆలయంలో గురువారం నుంచి 15వతేదీ వరకు శరన్నవ రాత్రి వేడుకలు జరుగుతాయని ఆలయ ఈవో కామేశ్వరరావు, ప్రధాన అర్చకుడు వేదం సుబ్రహ్మణ్యంశాస్త్రి తెలిపారు. తొలిరోజు అమ్మవారికి విశ్వరూపం అలంకారం జరుగుతుందని, భక్తులందరూ తరలిరావాలని కోరారు.