కొత్త మెలిక!

ABN , First Publish Date - 2021-11-01T03:56:54+05:30 IST

కొత్త మెలిక!

కొత్త మెలిక!

- జగనన్న విద్యాదీవెనకు కోత

- బోధన రుసుం చెల్లించని వారిపై వేటు

- సచివాలయాలకు అనర్హుల జాబితా

- ఆరు అంచెల విధానంలో పరిశీలన

- 17న అర్హుల తుది జాబితా

(రణస్థలం) 

పేద విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ‘జగనన్న విద్యాదీవెన’ పథకంలోనూ కోతకు రంగం సిద్ధమవుతోంది. పింఛన్లు, బియ్యం కార్డుల విషయంలో ఆరు అంచెల విధానాన్ని అమలు చేసిన ప్రభుత్వం భారీగా కోత విధించింది. సాంకేతిక కారణాల సాకు చెబుతున్నా.. జిల్లాలో వేలాది మందికి పింఛన్లు నిలిచిపోయాయి. రేషన్‌ సరుకులు అందకుండా పోయాయి. తాజాగా విద్యాదీవెన పథకంలో కూడా ఆరు అంచెల విధానంతో కోత విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 


జగనన్న విద్యాదీవెన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా బోధన రుసుములను నేరుగా తల్లుల ఖాతాలో జమ చేస్తోంది. విద్యాసంవత్సరంలో ప్రతి ముడు నెలలకోసారి నగదు అందిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఏప్రిల్‌ 19న తొలివిడతలో 67,567 మంది విద్యార్థులకు రూ.31.86కోట్లు అందించింది. జూలై 29న రెండో విడతలో 67,749 మంది విద్యార్థులకు రూ.32.81 కోట్లు కేటాయించింది. ఈ నగదును కళాశాలలకు ఫీజుగా చెల్లించాలి. కానీ చాలామంది ఖాతాల్లో నగదు జమయినా కళాశాలలకు ఫీజులు చెల్లించడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ పథకానికి సంబంధించి ఆరు అంచెల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజులు చెల్లించని విద్యార్థులకు మూడో విడత చెల్లింపులు నిలిపివేయనున్నట్టు ప్రకటించింది.  ఈ పథకం కింద ఎంతమంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఎంతమంది ఫీజులు చెల్లించాల్సి ఉంది అనే వివరాల నమోదుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించింది. దీని ఆధారంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయం పర్యవేక్షించనుంది. ఆరు అంచెల విధానంలో భాగంగా వ్యవసాయ భూములు, నాలుగు చక్రాల వాహనం, ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండడం, ఆదాయపు పన్ను చెల్లించడం, అధిక విద్యుత్‌ వినియోగం, బియ్యం కార్డు లేని వారిని అనర్హులుగా గుర్తించనుంది. అనర్హుల జాబితాపై సచివాలయాల్లో సహాయకులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడతారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు జాబితాలను సచివాలయాల లాగిన్‌కు పంపించారు. 


ఇదీ వరుస

- నవంబరు 4 వరకు ఆరు అంచెల విధానంపై సర్వే చేస్తారు. 

- 5న గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాలను ప్రదర్శిస్తారు.

- 5 నుంచి అభ్యంతరాలు స్వీకరించి క్షేత్రస్థాయిలో మరోసారి సామాజిక తనిఖీ చేస్తారు. 

- 6న అనర్హులకు నోటీసులు జారీచేస్తారు.

- 11 నుంచి 16 వరకు క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు పరిశీలిస్తారు.

- 17న అర్హుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారులు షెడ్యూల్‌ ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 


 ఆందోళనలో సచివాలయ ఉద్యోగులు

వరుస పరిణామాలతో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాల అమలు భాద్యతను క్షేత్రస్థాయిలో సచివాలయాలకు అప్పగిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై గ్రామాల్లో ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు కొన్నిచోట్ల సచివాలయ సిబ్బందిని నిలదీస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం గృహ నిర్మాణ పథకం రుణాల వసూలుకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకాన్ని అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఇళ్ల కొలతలు తీసి లబ్ధిదారులకు నోటీసులు అందించడంలో వీఆర్వోలకు సహకరించాలని స్పష్టమైన ఆదేశాలు జరీచేసింది. ఇలా కొలతలు తీయడానికి వెళ్తున్నవారు నిలదీతలకు గురవుతున్నారు. తాజాగా, విద్యాదీవెన పథకం పరిశీలనకు వెళ్లాలని చెబుతుండడంతో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయోనని మల్లగుల్లాలు పడుతున్నారు.  

Updated Date - 2021-11-01T03:56:54+05:30 IST