ఫుల్ కిక్
ABN , First Publish Date - 2022-01-01T04:50:19+05:30 IST
ఫుల్ కిక్

- జిల్లాలో పెరిగిన మద్యం విక్రయాలు
- రోజుకు రూ.3 కోట్ల లిఫ్టింగ్
- ధరలు తగ్గడమే కారణం
- పాత బ్రాండ్ల కోసం ఎదురుచూపు
ఎచ్చెర్ల, డిసెంబరు 31 : జిల్లాలో మద్యం విక్రయాలు మళ్లీ పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మద్యం ధరలను తగ్గించడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. జిల్లాలోని వైన్‌షాపులకు ఎచ్చెర్లలోని బేవరేజస్ కార్పొరేషన్ డిపో ద్వారా మద్యం, బీర్ కేసుల లిఫ్టింగ్ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలు వెలిశాయి. ఈ దుకాణాలను ఏటా తగ్గిస్తున్నప్పటికీ వ్యాపారం మాత్రం యథావిధిగానే సాగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. సర్కారు తీసుకువచ్చిన సరికొత్త బ్రాండ్లకు మద్యం ప్రియులు అలవాటు పడ్డారు. ఇదిలాఉండగా, రెండు వారాల కిందట ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడంతో లిక్కర్ వ్యాపారం గణనీయంగా పుంజుకుంది. ధరలు తగ్గించక ముందు రోజుకు 2.50 కోట్ల రూపాయల మేరకు ఎచ్చెర్ల బాట్లింగ్ యూనిట్ నుంచి జిల్లాలోని వైన్‌షాపులకు లిఫ్టింగ్ జరిగేది. ధరలు తగ్గించిన తర్వాత రోజుకు రూ.3 కోట్ల వరకు లిఫ్టింగ్ జరుగుతుంది.
జిల్లాలో షాపుల పరిస్థితి..
జిల్లాలో ప్రస్తుతం మొత్తం 177 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో ఎక్సైజ్ శాఖ పరిధిలో 158, పర్యాటక శాఖ అధీనంలో 19 షాపులు నడుస్తున్నాయి. గత ప్రభుత్వంలో జిల్లాలో 238 వైన్‌షాపులు ఉండేవి. అయితే, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సంపూర్ణ మద్య నిషేధంలో భాగంగా ప్రతి ఏడాదీ 20 శాతం షాపులను తగ్గిస్తున్నారు.
త్వరలో పాత బ్రాండ్లు..
వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పాత బ్రాండ్లను పక్కన పెట్టేసింది. ఎక్కడా లేని కొత్త బ్రాండ్లను మద్యం ప్రియులకు పరిచయం చేసింది. రేట్లను అమాంతంగా పెంచడం, ఒక్కసారిగా బ్రాండ్లను మార్చడంతో మందుబాబులకు కిక్కు ఎక్కలేదు. పాత బ్రాండ్లను తిరిగి తెస్తామని ప్రభుత్వం ఇటీవల సూచనప్రాయంగా ప్రకటించడంతో మద్యం ప్రియులు వాటి కోసం ఎదురుచూస్తున్నారు.