క్రైమ్‌ రేటు పైపైకి..

ABN , First Publish Date - 2021-12-31T05:39:33+05:30 IST

జిల్లాలో నేరాలు, రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. గత ఏడాదితో పోల్చుకుంటే క్రైమ్‌ రేటు అధికంగా ఉంది. 2021 నేర నివేదికను గురువారం సాయంత్రం ఎస్పీ అమిత్‌బర్దర్‌ వెల్లడించారు. నేరాల నమోదు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. గత ఏడాదితో పోల్చుతూ గణాంకాలతో సహా వివరించారు. ఆ వివరాలు ఎస్పీ మాటల్లో... ‘జనవరి నుంచి డిసెంబరు 29 వరకూ 842 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 269 మంది దుర్మరణం పాలయ్యారు. 578 ప్రమాదాల్లో 100 మంది క్షతగాత్రులయ్యారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 2,

క్రైమ్‌ రేటు పైపైకి..


జిల్లాలో పెరిగిన నేరాలు

రోడ్డు ప్రమాదాలదీ అదే తీరు

281 మంది మృత్యువాత, క్షతగాత్రులుగా 100 మంది

మహిళలపై దాడులూ అధికమే

2021 నేర నివేదికను వెల్లడించిన ఎస్పీ అమిత్‌బర్దర్‌

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, డిసెంబరు 30: జిల్లాలో నేరాలు, రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. గత ఏడాదితో పోల్చుకుంటే క్రైమ్‌ రేటు అధికంగా ఉంది. 2021 నేర నివేదికను గురువారం సాయంత్రం ఎస్పీ అమిత్‌బర్దర్‌ వెల్లడించారు. నేరాల నమోదు,  నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. గత ఏడాదితో పోల్చుతూ గణాంకాలతో సహా వివరించారు. ఆ వివరాలు ఎస్పీ మాటల్లో... ‘జనవరి నుంచి డిసెంబరు 29 వరకూ 842 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 269 మంది దుర్మరణం పాలయ్యారు. 578 ప్రమాదాల్లో 100 మంది క్షతగాత్రులయ్యారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 2,28,372 కేసులు నమోదయ్యాయి. వీరి నుంచి ఈ-చలానా ద్వారా రూ.6,30,71,335 జరిమానా విధించాం. మహిళలపై అకృత్యాలకు సంబంధించి 556 కేసులు నమోదయ్యాయి. హత్యలు 3, వరకట్న మరణాలు 6, ఆత్మహత్యకు ఉసిగొల్పే ఘటనలు 19, వేధింపులు 285, మహిళా హత్యలు 5, అత్యాచారాలు 29, కిడ్నాప్‌ 1, ర్యాగింగ్‌ కేసులు 204, పెళ్లి చేసుకుంటామని నమ్మించి మోసం చేసిన కేసులు 4 నమోదయ్యాయి. గత ఏడాది కంటే 214 కేసులు అధికమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 317 మంది అదృశ్యమైనట్టు ఫిర్యాదులు వచ్చాయి. 275 మందిని గుర్తించి పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించాం. జిల్లా వ్యాప్తంగా కొత్తగా 177 మందిపై రౌడీషీట్‌లను తెరిచాం. సత్ప్రవర్తన వల్ల ఏడుగురిపై సస్పెక్ట్‌ షీట్‌లను, ముగ్గురిపై రౌడీషీట్లను తొలగించాం. 468 మందిని వివిధ కేసుల్లో అనుమానితులుగా గుర్తించాం. జిల్లా వ్యాప్తంగా 4,118 అక్రమ మద్యం కేసులు నమోదయ్యాయి. 3,398 మందిని అరెస్ట్‌ చేశాం. 511 వాహనాలను సీజ్‌ చేశాం. 59,482 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నాం. 8,22,916 లీటర్ల బెల్లంఊటలను ధ్వంసం చేశాం. ఇతర రాష్ట్రాలకు చెందిన 4,761 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశాం’ అని ఎస్పీ అమిత్‌బర్దర్‌ వివరించారు. ప్రధానంగా మహిళా భద్రతపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. డయల్‌ 100, ఏపీ పోలీస్‌ సేవ యాప్‌ ద్వారా సమాచారం అందగానే రక్షణ కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది 1,42,985 మంది దిశ యాప్‌ను వినియోగించుకున్నారని చెప్పారు. డయల్‌ 100కు 7,342 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని తెలిపారు. సీసీ టీవీ కమ్యూనిటీ ప్రాజెక్టులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 2,700 కెమెరాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. గూగుల్‌ మ్యాప్‌తో అనుసంధానం చేశామని చెప్పారు. సైబర్‌ నేరాల నియంత్రణలో భాగంగా ఫాల్కన్‌, బాడీవార్న్‌, డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తున్నామని చెప్పారు. మొబైల్‌ ఫోన్‌ చోరీలకు సంబంధించి...  368 సెల్‌ఫోన్లను రికవరీ చేయగలిగామని చెప్పారు. హైవే పెట్రోలింగ్‌ వ్యవస్థను పెంచి.. రోడ్డు ప్రమాదాలను నియంత్రిస్తున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. కరోనా సమయంలో పోలీసులు ఫ్రంట్‌లైన్‌ వారియర్లగా సేవలు అందించారని ఎస్పీ అమిత్‌బర్దర్‌ గుర్తుచేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన డీఎస్పీలు శ్రీనివాసరావు, శివరామిరెడ్డిలకు ప్రశంసా పత్రాలను ఎస్పీ అందజేశారు. సమావేశంలో ఏఎస్పీలు సోమశేఖర్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

రహదారులపై నూతన వేడుకలొద్దు

కొత్త సంవత్సరం వేడుకలను యువత ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ సూచించారు. కరోనా దృష్ట్యా గుమిగూడి ఉండొద్దన్నారు. రహదారులపై వేడుకలు నిర్వహించవద్దని సూచించారు. ప్రభుత్వం అనుమతిచ్చిన సమయం వరకే బార్లు, రెస్టారెంట్లు తెరవాలని ఎస్పీ స్పష్టం చేశారు. బైక్‌లపై బయటకు వెళ్లే పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని సూచించారు. 



Updated Date - 2021-12-31T05:39:33+05:30 IST