పాదయాత్రలో అంతగా బాధపడ్డ Jaganకు అసలు ఇది గుర్తుందా?

ABN , First Publish Date - 2021-11-30T04:09:36+05:30 IST

పాదయాత్రలో అంతగా బాధపడ్డ Jaganకు అసలు ఇది గుర్తుందా?

పాదయాత్రలో అంతగా బాధపడ్డ Jaganకు అసలు ఇది గుర్తుందా?
రేగులపాడు గ్రామం వద్ద ఆగిపోయిన ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌, ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ శిలాఫలకం ఆవిష్కరిస్తున్న రాజశేఖర్‌రెడ్డి(ఫైల్‌ఫోటో)

(పలాస/రూరల్‌)


రెండేళ్లలో ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ను పూర్తి చేసి ప్రజలకు నీరందిస్తాం.

- వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (2008 ఏప్రిల్‌ 4న ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ శంకుస్థాపన సందర్భంలో..) 


వైఎస్‌ కలను ఆఫ్‌షోర్‌ ద్వారా నెరవేరుస్తాం. 

 - కిరణ్‌కుమార్‌రెడ్డి (2013లో ఈ ప్రాంతంలో బస్సు యాత్ర సందర్భంగా..)


నాటి ప్రభుత్వం ఆఫ్‌షోర్‌ను నిర్మించలేకపోయింది. జలయజ్ఞాన్ని  ధనయజ్ఞంగా మార్చింది. ఆఫ్‌షోర్‌ను మేమే పూర్తి చేస్తాం.

- నారా చంద్రబాబునాయుడు (2016లో జిల్లా పర్యటన సమయంలో..)


నాన్న వేసిన శిలాఫలకం చూస్తే బాధగా ఉంది. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ను తొందరలోనే పూర్తిచేసి రైతులకు సాగు నీరందిస్తాం.

- వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి (2019లో పాదయాత్ర సందర్భంగా..) 


...ఇవీ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌పై ముఖ్యమంత్రులు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు. కానీ ఏళ్ల తరబడి ఈ హామీలు కార్యరూపం దాల్చడం లేదు. దీంతో తాగునీటికి, సాగునీటికి తమకు ఇబ్బందులు తప్పడం లేదని ఈ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జలయజ్ఞంలో భాగంగా పలాస మండలం రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌కు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2008లో శంకుస్థాపన చేశారు. రేగులపాడు వద్ద వృథాగా పోతున్న మహేంద్ర తనయ నది నీటిని మళ్లించేందుకు రిజర్వాయర్‌ నిర్మించాలని అప్పటి ఎమ్మెల్యే, దివంగత నేత హనుమంతు అప్పయ్యదొర భావించారు. రిజర్వాయర్‌ నిర్మిస్తే పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం, టెక్కలి, మెళియాపుట్టి మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. దీంతోపాటు పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు శాశ్వత తాగునీటి పథకం పూర్తవుతుందని అప్పట్లో వైఎస్‌కు అప్పయ్యదొర విజ్ఞప్తి చేశారు. దీనిపై వైఎస్‌ సానుకూలంగా స్పందించి వెంటనే శంకుస్థాపన చేశారు. రూ.123.50 కోట్ల వ్యయంతో పనులు చేపట్టి.. రెండేళ్లలో రిజర్వాయర్‌ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం తర్వాత కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా ఈ ప్రాంతంలో 2013లో బస్సు యాత్ర చేపట్టి.. ఆఫ్‌షోర్‌ పూర్తి చేసి వైఎస్‌ కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కానీ హామీ నెరవేరలేదు. తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. రెండున్నరేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడంతో అప్పటి ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ గెడ్డం పెంచుతూ.. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో అప్పట్లో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రిజర్వాయర్‌ను పరిశీలించి.. గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కానీ అప్పటికే వ్యయం పెరగడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో బడ్జెట్‌ను సవరించి రూ.550 కోట్లకు పెంచారు. పనులు మళ్లీ ప్రారంభించారు. 20 శాతం పనులు జరుగుతున్న సమయంలో నిర్వాసితుల సమస్యలు బయటకు వచ్చాయి. వారికి స్థలాలు కేటాయించడంలో తాత్సారం చేయడంతో పనులు నిలిచిపోయాయి. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్‌రెడ్డి 2019లో ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసిన సమయంలో రిజర్వాయర్‌ను చూసి చలించిపోయారు. ‘నాన్న వేసిన శిలాఫలకం ఉత్సవ విగ్రహంగా ఉండడానికి వీల్లేదు. దీన్ని నేనే పూర్తి చేస్తా’నన్నారు. కానీ ఇప్పటివరకు పనుల ఊసే లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు అర్థాంతరంగా పనులు నిలిపేశారు. ప్రస్తుతం గట్టంతా మట్టి కొట్టుకుపోగా, గేట్లు వేసే చోట గుంతల్లో భారీ స్థాయిలో నీరు చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అందులో పడిపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పూర్తి చేయకపోగా, నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కరించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. రిజర్వాయర్‌ ఎప్పటికి పూర్తవుతుందోనని ఎదురుచూస్తున్నారు. 


బకాయిలు చెల్లించండి

- వంశధార ఈఈ కార్యాలయం వద్ద ఆఫ్‌షోర్‌ సబ్‌ కాంట్రాక్టర్ల ఆందోళన

టెక్కలి, నవంబరు 29: ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులకు సంబంధించి రూ.9 కోట్ల మేర పేరుకుపోయిన బకాయిలను తక్షణమే చెల్లించాలని సబ్‌ కాంట్రాక్టర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం టెక్కలిలో వంశధార ఈఈ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. 2018 మార్చి నుంచి ఇప్పటివరకు రాక్‌స్టోన్‌ పనులు, బ్లాస్టింగ్‌, కెనాల్‌, బండ్‌ ఎర్త్‌ వర్క్‌, మిషనరీ పనులు చేపట్టినా బిల్లులను చెల్లించడంలో ఈఈ నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. బిల్లులు ఇవ్వకపోవడంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. బిల్లులు చెల్లించేవరకు ఆందోళన చేపడతామన్నారు. బకాయిలపై అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కోట్లాది రూపాయలు అప్పు తెచ్చి పనులు చేస్తే అధికారులు కొర్రీలు వేస్తున్నారని విమర్శించారు. ఇలాగే కొనసాగితే తాము ఇక్కడే ఆత్మహత్యలు చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ధర్నాలో కామాక్షి కనస్ట్రక్షన్స్‌, కేఎస్‌ఎన్‌ రాజు మిషనరీ సప్లయర్స్‌, ఎస్‌ఆర్‌జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎస్‌ఎన్‌ అసోసియేట్‌, రఘురామరాజు, కంచరాన కుసుమ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T04:09:36+05:30 IST