ధాన్యం కదిలేదెలా?
ABN , First Publish Date - 2022-01-01T04:47:44+05:30 IST
ధాన్యం కదిలేదెలా?

- సక్రమంగా పంపిణీ కాని గోనె సంచులు
- విక్రయాలకు రైతుల ఇక్కట్లు
(టెక్కలి)
‘రైతుకు మద్దతు ధర అందాలి.. మిల్లర్ల చేతుల్లో రైతు మోసపోకూడదు... రైతుభరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలి..’ ఇదీ ప్రభుత్వ నిర్ణయం. అంతవరకు బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం రైతులకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. పూర్తిస్థాయిలో గోనె సంచులు లేక కళ్లాల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించలేకపోతున్నారు. పీఏసీఎస్, డీసీఎంఎస్, జీసీసీ, జీఈసీ, సీసీ స్టోర్స్ తదితర సొసైటీల ద్వారా రైతుభరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ యంత్రాంగం ముందువిడతగా 50కిలోల గోనెసంచులను అందజేసింది. ఆ గోనెసంచులు రైతులకు సరిపడా ఇచ్చే పరిస్థితి రైతుభరోసా కేంద్రాల వద్ద లేదు. వీటి కోసం రైతులంతా ఆర్‌బీకేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇ-క్రాప్‌లో నమోదైన వారి దగ్గరే ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు గోనెసంచుల సమస్య వెంటాడుతూనే ఉంది. కళ్లాల్లో నూర్చిన ఽధాన్యం ఉంచుకోలేక, ఽగోనెసంచులు లేక ధాన్యం అమ్మకాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా వచ్చే గోనె సంచులతో ధాన్యం అమ్మకాలు చేస్తే రైతుకు పూర్తి మద్దతు ధర లభిస్తుంది. గోనెసంచుల కొరత మూలంగా రైతులు మిల్లర్లు, దళారీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏర్పాట్లు చేస్తున్నాం..
ఇప్పటికే 15లక్షలకుపైగా గోనెసంచులు 798 రైతుభరోసా కేంద్రాలకు పంపిణీ చేశాం. ఎఫ్‌సీఐ ద్వారా వచ్చిన గోనెసంచులు సేకరించి అందజేస్తున్నాం. జిల్లాలో 350 మిల్లుల ద్వారా కోటి వరకు గోనెసంచులు సేకరించేలా మ్యాపింగ్ చేశాం. ఇంకా అత్యవసరమైతే 40కేజీల గోనెసంచికి మూడు రూపాయల 35పైసలు చెల్లిస్తాం. దీనిపై రైతుభరోసా కేంద్రాల్లో ఉన్న గ్రామీణ వ్యవసాయ సహాయకులకు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి సూచనలు ఇచ్చాం.
- మీనాక్షి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్
ఆర్‌బీకేలతో దళారీ వ్యవస్థకు చెక్
- జేసీ విజయసునీత
రేగిడి/పాలకొండ, డిసెంబరు 31: దళారీ వ్యవస్థకు చెక్ చెప్పేందుకే రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు జేసీ విజయసునీత అన్నారు. కానీ కొందరు మిల్లర్లు ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారని..అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లులను సీజ్ చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. శుక్రవారం రేగిడి మండలం సోమరాజుపేట రైతుభరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌లతో కలిసి జేసీ ప్రారంభించారు. జిల్లాలో 792 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ధాన్యం విక్రయించిన మూడు వారాల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. ఎమ్మెల్సీ విక్రాంత్ మాట్లాడుతూ పీడీఎస్ బియ్యం రీ సైక్లింగ్‌ను అడ్డుకోవాలని అధికారులను కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి మిల్లులకు వచ్చే ధాన్యాన్ని అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు. ఏడీఏ సీహెచ్ వెంకటరావు, మార్క్‌ఫెడ్ డీఎం రమణి, ఎంపీపీ ధార అప్పలనరసమ్మ, ఉపాధ్యక్షుడు టెంకాల అచ్చంనాయుడు, తహసీల్దార్ బి.సత్యం, ఏవో మురళీకృష్ణ, సర్పంచ్ సవలాపురపు ముద్దలమ్మ పాల్గొన్నారు.
నిబంధనలు పాటించండి
రైతుభరోసా కేంద్రాల ద్వారా వచ్చిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని మిల్లర్లకు జేసీ విజయసునీత ఆదేశించారు. శుక్రవారం పాలకొండలో సత్యనారాయణ రైస్‌మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఖాళీ సంచులు లేవని కొందరు మిల్లర్లు ధాన్యం తిప్పిపంపుతున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. అనంతరం పాలకొండలో మిల్లు యజమానులతో సమీక్షించారు. ఆర్బీకేల నుంచి వచ్చిన ధాన్యాన్నే కొనుగోలు చేస్తామని వారి వద్ద నుంచి అంగీకారపత్రాలు తీసుకున్నారు. ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్, తహసీల్దార్ సోమేశ్వరరావు, సీఎస్ డీటీ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.