ఇంటి పన్నులు.. ఇక ఆన్‌లైన్‌లో..!

ABN , First Publish Date - 2021-08-11T04:49:40+05:30 IST

నగరాలు, పట్టణాల తరహాలో పంచాయతీల్లోనూ ఇంటిపన్ను వసూళ్లకు రంగం సిద్ధమవుతోంది. బకాయిల వివరాలు, పన్నుల చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌ విధానంలోనే కొనసాగనున్నాయి. ఇప్పటివరకు ఇళ్లు, కుళాయిలు...ఇతర పన్నుల కోసం సిబ్బంది డిమాండ్‌ నోటీసులు అందిస్తున్నారు. గృహ యజమానులు పంచాయతీ కార్యాలయాల్లో నగదు రూపేణా చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు ఇంటి కొలతల ప్రకారం పన్ను వేసేవారు. ఇప్పుడు చదరపు అడుగులకు నిర్దేశించిన విలువ ఆధారంగా పన్ను వేస్తారు. దీంతో గ్రామాల్లో కూడా ఇంటి పన్నులు భారీగా ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇంటి పన్నులు.. ఇక ఆన్‌లైన్‌లో..!
ఇంటి పన్నులను ఆన్‌లైన్‌ చేస్తున్న సచివాలయ సిబ్బంది

- పంచాయతీల్లోనూ డిజిటల్‌ విధానంలో వసూలుకు చర్యలు
(ఇచ్ఛాపురం రూరల్‌)

నగరాలు, పట్టణాల తరహాలో పంచాయతీల్లోనూ ఇంటిపన్ను వసూళ్లకు రంగం సిద్ధమవుతోంది. బకాయిల వివరాలు, పన్నుల చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌ విధానంలోనే కొనసాగనున్నాయి. ఇప్పటివరకు ఇళ్లు, కుళాయిలు...ఇతర పన్నుల కోసం సిబ్బంది డిమాండ్‌ నోటీసులు అందిస్తున్నారు. గృహ యజమానులు పంచాయతీ కార్యాలయాల్లో నగదు రూపేణా చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు ఇంటి కొలతల ప్రకారం పన్ను వేసేవారు. ఇప్పుడు చదరపు అడుగులకు నిర్దేశించిన విలువ ఆధారంగా పన్ను వేస్తారు. దీంతో గ్రామాల్లో కూడా ఇంటి పన్నులు భారీగా ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 1194 పంచాయతీలు ఉన్నాయి. అందులో 6,18,752 గృహాలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో అన్ని పంచాయతీల్లో ఆన్‌లైన్‌ ప్రక్రియ ప్రారంభించారు. ఇళ్ల కొలతలు వేసి.. పన్నుల వివరాలను సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ చేస్తున్నారు. అనంతరం ప్రభుత్వం నిర్దేశించిన విధానాల మేరకు పన్ను విధిస్తారు. ఇందులో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 85 వేల ఇళ్లు ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. సర్వర్‌ మొరాయించడం, ఆన్‌లైన్‌ చేయడానికి జిల్లాల వారీగా సమయాలు కేటాయించడం, సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడం తదితర కారణాల వల్ల నమోదులో జాప్యమవుతోంది. వచ్చే నెల రెండో వారానికి ఈ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
- పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామాలో ఐదేళ్లకోసారి ఇంటి పన్ను సవరించాలి. అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ జరగకపోతే పన్ను మొత్తానికి 5 శాతం కలిపి వేస్తారు. ప్రస్తుతం అన్ని పంచాయతీల్లో ఇంటి పన్ను సవరణ ప్రక్రియ జరుగుతోంది..
- పాత ఇళ్లకు పన్నుల సవరణతోపాటు కొత్త గృహాలకు పన్ను నిర్ణయించేందుకు పంచాయతీ సిబ్బంది, వలంటీర్లు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఇంటి సరిహద్దు, కొలతలు లెక్కించి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇంటి రకం, వార్డు, బ్లాక్‌, భూమి కొలతలు, విలువ తదితర 16 అంశాల్ని సేకరిస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ డిజిటల్‌ అసిస్టెంట్లు ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు.

చురుగ్గా ప్రక్రియ
ఇంటి పన్ను ఆన్‌లైన్‌ చేయడం వల్ల పారదర్శకత ఉంటుంది. ఆన్‌లైన్‌లో ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. పన్నులు యఽథావిధిగానే ఉంటాయి. పెరిగే అవకాశం ఉండదు. యజమాని తమ ఇంటి పన్నులు, కొలతలు తదితర వివరాలు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
- హరిహరరావు, డీఎల్‌పీవో, టెక్కలి

Updated Date - 2021-08-11T04:49:40+05:30 IST