హై అలర్ట్!
ABN , First Publish Date - 2021-05-25T04:17:19+05:30 IST
అతి తీవ్ర తుఫాన్ యాస్ ముప్పు ముంచుకొస్తోంది. అల్పపీడనం తుఫాన్‌గా మారింది. గురువారం ఒడిశా-పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటే అవకాశముంది. దాని ప్రభావం సిక్కోలుపై కూడా ఉండనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా టెక్కలి డివిజన్‌పై దృష్టి సారించింది. జిల్లాలో ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం తీర ప్రాంత మండలాలున్నాయి.

ముంచుకొస్తున్న ‘యాస్’ తుఫాన్
రేపు తీరం దాటే అవకాశం
జిల్లాపై పెను ప్రభావం
టెక్కలి డివిజన్‌పైనే అధికం
యంత్రాంగం అప్రమత్తం
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, మే 24 : అతి తీవ్ర తుఫాన్ యాస్ ముప్పు ముంచుకొస్తోంది. అల్పపీడనం తుఫాన్‌గా మారింది. గురువారం ఒడిశా-పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటే అవకాశముంది. దాని ప్రభావం సిక్కోలుపై కూడా ఉండనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా టెక్కలి డివిజన్‌పై దృష్టి సారించింది. జిల్లాలో ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం తీర ప్రాంత మండలాలున్నాయి. తుపాను ప్రభావంతో ఇప్పటికే తీరంలో అలల ఉధృతి అధికంగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని గ్రామాల్లో దండోరా వేయించారు. అత్యవసర సమయాల్లో బాధితులను తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంతో పాటు టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
నదీ పరీవాహక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు
తుఫాన్ గురువారం తీరం దాటే అవకాశముంది. దాని ప్రభావంతో ఒడిశాతో పాటు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీరం దాటినప్పుడు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ సహాయక బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలినా యుద్ధ ప్రాతిపదికన చర్యలకు వాహనాలు, యంత్రాలు, పరికరాలను సిద్ధం చేశారు. మండలాల వారీగా అత్యవసర సేవల సిబ్బందిని సైతం కేటాయించారు. ఒడిశాతో పాటు మన జిల్లాలో భారీ వర్షాలు నమోదైతే వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదులు పొంగి ప్రవహించే అవకాశముంది. అందుకే నదుల పరీవాహక ప్రాంతాలు, ముంపు గ్రామాల ప్రజలను అధికారులు ముందస్తుగా అప్రమత్తం చేశారు. అవసరమనుకుంటే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిబ్బందిని సిద్ధం చేశారు.
కలెక్టర్ పర్యవేక్షణలో..
గత రెండు రోజులుగా తుఫాన్ సహాయక చర్యలపె కలెక్టర్ నివాస్ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లను సైతం చేపట్టారు. మండలాల అధికారుల నుంచి దిగువ స్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. తుఫాన్ దృష్ట్యా అధికారులు, సిబ్బంది సెలవులు పెట్టొద్దని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ ఉద్యోగులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. ఇప్పటికే డివిజన్ల వారీగా సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.