భారీగా గుట్కా, ఖైనీ స్వాధీనం
ABN , First Publish Date - 2021-08-08T05:33:42+05:30 IST
నర్సింగపల్లి సమీపంలో శనివారం పోలీసులు భారీగా గుట్కా, ఖైనీని స్వాధీనం చేసుకున్నారు.
టెక్కలి రూరల్: నర్సింగపల్లి సమీపంలో శనివారం పోలీసులు భారీగా గుట్కా, ఖైనీని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం పర్లా కిమిడి నుంచి వాహనంలో గుట్కా, ఖైనీ బస్తాలను శ్రీకాకుళం వైపు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్‌ఐ కామేశ్వరరావు, సిబ్బంది నర్సింగపల్లి వద్ద కాపుకాసి వాహనాన్ని తనిఖీ చేశారు. ఒడిశా రాష్ట్రం ఉనగుండ ప్రాంతానికి చెందిన మోదిలి బాలకృష్ణ, సవర చిన్నిలను అదుపులోకి తీసుకున్నారు. సరుకు విలువ సుమారు రూ.4 లక్షలుంటుందని, వాహనాన్ని సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు. సీఐ ఆర్.నీలయ్య ఈ సరుకు ను పరిశీలించారు. ఎస్‌ఐ కామేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పారాపురం వద్ద 10 లీటర్ల సారా..
కొత్తూరు, ఆగస్టు 7: మండలంలోని పారాపురం వద్ద చేపట్టిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ ప్రభాకర్ తెలిపారు. అసిరినాయుడు 10 లీటర్ల సారాను తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేసి కేసునమోదు చేసినట్లు చెప్పారు.