సచివాలయ ఉద్యోగులకు షాక్
ABN , First Publish Date - 2021-08-25T05:30:00+05:30 IST
ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. బియ్యం(రేషన్) కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు తక్షణమే వాటిని సరెండర్ చేయాలని ఆదేశించింది. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయం, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 5,674 మంది ఉన్నారు. వారంతా కార్డులు సరెండర్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు వారి కార్డుల రద్దుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వలంటీర్లు, వీఆర్‌వోల ద్వారా బియ్యం కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. బియ్యం కార్డులను స్వచ్ఛందంగా సరెండర్ చేయకపోతే.. చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

- తక్షణమే బియ్యం కార్డులు వెనక్కి ఇచ్చేయాలని ప్రభుత్వ ఆదేశం
- ఆందోళన చెందుతున్న సిబ్బంది
(ఇచ్ఛాపురం రూరల్)
ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. బియ్యం(రేషన్) కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు తక్షణమే వాటిని సరెండర్ చేయాలని ఆదేశించింది. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయం, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 5,674 మంది ఉన్నారు. వారంతా కార్డులు సరెండర్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు వారి కార్డుల రద్దుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వలంటీర్లు, వీఆర్‌వోల ద్వారా బియ్యం కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. బియ్యం కార్డులను స్వచ్ఛందంగా సరెండర్ చేయకపోతే.. చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు బియ్యం కార్డులను వెనక్కిచ్చేయడం చట్టబద్ధమే అయినప్పటికీ వీరిలో అల్పాదాయ వర్గాల వారికి గత ప్రభుత్వం న్యాయం చేసింది. అప్పట్లో ఆర్టీసీ, విద్యుత్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో తక్కువ వేతనాలు పొందే వారికి మినహాయింపునిచ్చింది. దీనికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం ఆదాయంతో సంబంధం లేకుండా ఉద్యోగులందరి కార్డుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.
‘ఆరోగ్యశ్రీ’ కార్డులకు దూరమే
సచివాలయ ఉద్యోగులకు రూ.15 వేలు వేతనం వస్తుందన్న కారణంతో నిబంధనల ప్రకారం రైస్‌కార్డుకు అర్హత లేదన్నది ప్రభుత్వ వాదన. కాగా, సచివాలయ సిబ్బందికి బియ్యం కార్డులు రద్దయితే, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా తొలగిపోనున్నాయి. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వారికి ఎలాంటి హెల్త్‌కార్డులు లేకపోవడం వల్ల వైద్య సేవలకు దూరమవుతారు. కుటుంబ సభ్యులంతా నిత్యావసరాలను కోల్పోతారు. సచివాలయ ఉద్యోగులకు ఇచ్చే రూ.15వేల వేతనంలో సగం ప్రయాణ ఖర్చులకు, ఇంటి అద్దెల ఖర్చుకే పోతాయి. మిగిలిన సగం వేతనంతోనే జీవనం సాగించాల్సి ఉంటుంది. ఒక రకంగా సచివాలయ ఉద్యోగులకు ఇది దుర్భర పరిస్థితే. ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
నిబంధనలు ఇవీ..
బియ్యం కార్డులకు విధించిన నిబంధనల ప్రకారం గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలకు మించి ఆదాయం ఉండకూడదు. నిర్దేశించిన వార్షిక ఆదాయం కంటే ఎక్కువ ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల వద్ద బియ్యం కార్డులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఏఏ ప్రభుత్వ శాఖలో ఏఏ ఉద్యోగులు బియ్యం కార్డులు కలిగి ఉన్నారో పరిశీలన మొదలైంది. ఈ లెక్కన సచివాలయ ఉద్యోగులతో పాటు ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారూ తెల్ల రేషన్‌కార్డు కలిగి ఉన్నట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బియ్యం కార్డుల ఏరివేతకు ఈకేవైసీ విధానం తీసుకువచ్చింది. కార్డుదారులు ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం షరతు విధించింది. తద్వారా అనర్హులను గుర్తించే అవకాశం ఉంది.
క్రిమినల్ చర్యలకు ఆదేశాలు
ప్రభుత్వ ఉద్యోగులు తెల్ల (బియ్యం) రేషన్‌కార్డు కలిగి ఉండటం నేరం. తప్పుడు సమాచారం ఇచ్చి రేషన్‌కార్డు పొందినా, ఒక కుటుంబ సభ్యునిగా కార్డులో పేరు నమోదై ఉన్నా ఆ ఉద్యోగులపై ఏపీ స్టేట్ పీడీ సిస్టమ్ కంట్రోల్ ఆర్డర్ 2018 మేరకు కఠిన చర్యలు తీసుకుంటామంటూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తాజాగా అధికారులకు రాసిన లేఖ సంచలనమైంది. ఆ లేఖ ఆధారంగా జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ఉన్న బియ్యం కార్డుల ఏరివేత ప్రక్రియ ప్రారంభమైంది. బియ్యం కార్డులను కలిగిన ప్రభుత్వ ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ ఆధికారులు ఆదేశించడంపై సచివాలయ సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
రెండు వారాల్లోగా..
ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల బియ్యం కార్డులను రెండు వారాల్లోగా సరెండర్ చేయాలి. లేకుంటే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.
- డి.వెంకటరమణ, డీఎస్‌వో, శ్రీకాకుళం