వైద్య,ఆరోగ్య శాఖలో కుదుపు!

ABN , First Publish Date - 2021-12-08T05:46:37+05:30 IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు)లో సిబ్బందిని కుదించనున్నారు. ఇది ఉద్యోగుల్లో ఆందోళన రేపుతోంది. ఏళ్ల తరబడి వివిధ కేడర్‌లలో సేవలందిస్తూ..పదోన్నతి ఆశిస్తున్న వారు ప్రభుత్వ నిర్ణయంతో షాక్‌కు గురవుతున్నారు. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో వైద్యులతో పాటు అన్నిరకాల సిబ్బంది 18 మంది వరకూ పని చేస్తున్నారు.

వైద్య,ఆరోగ్య శాఖలో కుదుపు!
పొగిరి పీహెచ్‌సీ


-పీహెచ్‌సీల్లో సిబ్బంది తగ్గింపు

- ఉద్యోగుల సంఖ్య 12కు కుదింపు

- ఒక్కో ఆస్పత్రి నుంచి ఆరుగురికి ఉద్వాసన?

- జీవోను గోప్యంగా ఉంచిన అధికారులు

(రాజాం)

వైద్య, ఆరోగ్య శాఖలో భారీ కుదుపు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందిని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యులతో పాటు ఇతర సిబ్బంది సంఖ్యను 12కు మించకుండా చూడాలని భావిస్తోంది. పారదర్శక వైద్యసేవలతో పాటు పని సర్దుబాటుకేనని ప్రభుత్వం చెబుతోంది. పీహెచ్‌సీల్లో సిబ్బంది కుదింపుపై గత నెల 17న వైద్యఆరోగ్య శాఖ 143 జీవోను విడుదల చేసింది. కానీ అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆస్పత్రిలో వైద్యసేవలందించే వైద్యులు, సిబ్బంది పోస్టులకు పర్వాలేకున్నా.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే సిబ్బందిపై వేటు పడనుందని తెలుస్తోంది. 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు)లో సిబ్బందిని కుదించనున్నారు. ఇది ఉద్యోగుల్లో ఆందోళన రేపుతోంది. ఏళ్ల తరబడి వివిధ కేడర్‌లలో సేవలందిస్తూ..పదోన్నతి ఆశిస్తున్న వారు ప్రభుత్వ నిర్ణయంతో షాక్‌కు గురవుతున్నారు. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో వైద్యులతో పాటు అన్నిరకాల సిబ్బంది 18 మంది వరకూ పని చేస్తున్నారు. ఇందులో ఆస్పత్రికి ఆరుగురు చొప్పున తగ్గించాలన్నది ఈ జీవో సారాంశం. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న హెల్త్‌ సూపర్‌వైజర్ల పోస్టులు గల్లంతు కానున్నాయి. ముగ్గురు, నలుగురు చేసే పనిని ఒకరికి అప్పగించనున్నారు.  ఇలా మిగులు పోస్టులు ఏం చేయనున్నారన్న దానిపై స్పష్టత లేదు. దీంతో ఎవరి ఉద్యోగానికి ఎసరుపడుతుందోనన్న ఆందోళన ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. 

 ఇదీ పరిస్థితి

ప్రస్తుతం ఒక్కో ఆస్పత్రిలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్టు, ఒక ఎఫ్‌ఎన్‌వో (ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డరీ), ఒక స్వీపర్‌, ఎల్‌డీ కంప్యూటర్‌ ఆపరేటర్‌, జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు   సేవలందిస్తున్నారు. ఫీల్డ్‌ స్టాఫ్‌గా పురుష, మహిళా సూపర్‌వైజర్లు, ఆరోగ్య విస్తరణాధికారి, ఆరోగ్య బోధకుడు, పబ్లిక్‌ హెల్త్‌ నర్సు, సామాజిక ఆరోగ్య అధికారి, పారా మెడికల్‌ అధికారి విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ తాజా  నిర్ణయంలో భాగంగా ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మాసిస్ట్‌, ఎఫ్‌ఎన్‌వో పోస్టులు యథావిధిగా కొనసాగనున్నాయి. కంప్యూటర్‌ ఆపరేటర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్లకు సంబంధించి ఒక పోస్టుకు మాత్రమే పరిమితం చేయనున్నారు.  పురుష, మహిళా సూపర్‌వైజర్లు, ఆరోగ్య విస్తరణాధికారి, ఆరోగ్య బోధకుడు, పబ్లిక్‌ హెల్త్‌ నర్సు, సామాజిక ఆరోగ్య అధికారి, పారా మెడికల్‌ అధికారి క్యాడర్లకు సంబంధించి ఒక్కరినే కొనసాగించనున్నారు. స్వీపర్‌, అటెండర్‌, నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టుల్లో కూడా ఒకరినే ఉంచనున్నారు.

 మిగులు సిబ్బంది పరిస్థితేమిటి?

పీహెచ్‌సీల్లో మిగిలిపోతున్న సిబ్బందిని ఏంచేస్తారన్న దానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదు. జిల్లా వ్యాప్తంగా 83 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో మరో 27 ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. ఆస్పత్రికి ఆరుగురు చొప్పున కుదించినా..దాదాపు 500 మంది ఉద్యోగులు తగ్గిపోనున్నారు. వీరి సేవలను ఎలా వినియోగించుకుంటారు? మిగతా చోట్ల సర్దుబాటు చేస్తారా? అన్నదానిపై మాత్రం ఎటువంటి సమాధానం లేకుండా పోతోంది. ఫీల్ట్‌ స్టాఫ్‌కు సంబంధించి ఒక్కో పోస్టుకు ఒక్కో విద్యార్హత ఉంటుంది. శిక్షణ, విధులు వేర్వేరుగా ఉంటాయి. అటువంటిది నలుగురు విధులు ఒక్కరే నిర్వహించడం కత్తిమీద సామే. అదే సమయంలో సిబ్బంది తగ్గినా మిగతా వారిపై పనిభారం తప్పదు. వైద్యసేవలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఏళ్ల తరబడి సేవలందిస్తూ పదోన్నతులకు ఎదురుచూస్తున్న సమయంలో ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పబ్లిక్‌ హెల్త్‌ ఎంప్లాయూస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు పోరుబాటకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

 ఇబ్బందులు తప్పవు

143 జీవో అమలైతే ఇబ్బందులు తప్పవు. దిగువ స్థాయి సిబ్బందిని కుదిస్తే ఆ ప్రభావం సేవలపై పడతాయి. ముఖ్యంగా సబ్‌సెంటర్లపై పర్యవేక్షణ తగ్గుతుంది. సూపర్‌వైజర్ల సంఖ్య తగ్గిపోతుంది. ఉన్న వారిపై పనిభారం పడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించితే మంచిది. పాత విధానాన్నే కొనసాగించాలి.

-అకిరి భార్గవ్‌, వైద్యాధికారి, పొగిరి పీహెచ్‌సీ
Updated Date - 2021-12-08T05:46:37+05:30 IST