అమ్మో..వైద్యం!

ABN , First Publish Date - 2021-05-19T05:20:15+05:30 IST

కరోనా విపత్కర వేళ ఏ చిన్న రుగ్మత కనిపించినా జనాలు భయపడుతున్నారు. కొవిడ్‌ అని భావించి ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఉచిత నిర్థారణ పరీక్షలు చేస్తున్నా.. ఎక్కడ బయటపడుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

అమ్మో..వైద్యం!
కరోనా పరీక్షకు ఐదు రెట్ల అదనపు వసూలు

ర్యాపిడ్‌ టెస్ట్‌కు రూ.1,500

శస్త్రచికిత్సలు, ఓపీ ధరలకు రెక్కలు

ప్రైవేటు ఆస్పత్రుల బాదుడు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

కరోనా విపత్కర వేళ ఏ చిన్న రుగ్మత కనిపించినా జనాలు భయపడుతున్నారు. కొవిడ్‌ అని భావించి ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఉచిత నిర్థారణ పరీక్షలు చేస్తున్నా.. ఎక్కడ బయటపడుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జనాల అవసరాలను, భయాన్ని ల్యాబ్‌ల నిర్వాహకులు, ఆస్పత్రి యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. రూ.250కు చేయాల్సిన నిర్థారణ పరీక్షను రూ.1500కు పెంచి వసూలు చేస్తున్నారు. అరగంటలో నోటిమాటగా ఫలితాన్ని వెల్లడిస్తున్నారు. ఓ ఇంట్లో ఒకరిలో లక్షణాలు కనిపిస్తే కుటుంబ సభ్యులందరూ పరీక్షలు చేసుకోవాల్సి వస్తోంది. ఈ లెక్కన ఓ కుటుంబం నిర్థారణ పరీక్షలకే రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నిర్థారణ పరీక్షల పేరిట దందా కొనసాగుతోంది. 


భయంతో...

ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగానే కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. ఫలితాలు వచ్చేసరికి తీవ్ర జాప్యం జరుగుతోంది. నాలుగు రోజులకుపైగా దాటుతోంది. అంతవరకూ బాధితుల్లో ఒకటే టెన్షన్‌. పైగా ఇలా పరీక్షలు చేసుకున్న తరువాత పాజిటివ్‌ అని తేలితే అవమానంగా భావిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది హడావుడి చేస్తారని భయపడుతున్నారు. అందుకే చాలామంది గోప్యంగా ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పాజిటివా, నెగిటివా అన్నది అక్కడి సిబ్బంది నోటి మాటగా చెబుతుండడంతో ఇదే మేలని భావిస్తున్నారు. ర్యాపిడ్‌ టెస్ట్‌కు ఐదు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నా కిమ్మనకుండా ఉంటున్నారు. కొందరు ప్రశ్నిస్తుంటే ఇష్టముంటే చేయించుకోండి..లేకుంటే వెళ్లిపోండి అంటూ సమాధానమిస్తున్నారు.  


సాధారణ రుగ్మతలైనా..

సాధారణ రోగాలకు వైద్యం చేయించాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. సీజనల్‌ వారీగా వచ్చే జ్వరాలు, కడుపు నొప్పి, దంత సమస్యలు వంటి వాటికి వైద్యం గగనమవుతోంది. ఇలా వెళ్తున్న వారికి ముందుగా కరోనా పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. తరువాతే ఆశ్రయించాలని చెబుతున్నారు. చిన్న పిల్లల విషయంలో కూడా కనికరించడం లేదు. రూ.1,500 చెల్లించి కరోనా టెస్ట్‌ చేయించాకే వైద్యం అందిస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ఓపీ ధరలను సైతం అమాంతం పెంచేశారు. ఏడాది కిందట ఓపీ ధర రూ.200 ఉన్న ఆస్పత్రుల్లో ఇప్పుడు రూ.500 వరకూ పెంచేశారు. అదీ కూడా పరిమిత సంఖ్యలో రోగులనే చూస్తున్నారు. స్కానింగ్‌, రక్త పరీక్షలతో పాటు హెర్నియా, పేగుపూత, అపెండిసైటిస్‌ వంటి శస్త్రచికిత్సల ధరలు సైతం అమాంతం పెరిగాయి. చిన్నపాటి ఆపరేషన్‌ అయినా రూ.30 వేలు దాటుతోంది. దీంతో సామాన్యులు వైద్యం అంటేనే వణికిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులపై యంత్రాంగం నిఘా పెంచాల్సిన అవసరముంది. 111111111111111111111111111111

Updated Date - 2021-05-19T05:20:15+05:30 IST