కొనాలంటే ధర దడ!

ABN , First Publish Date - 2021-12-26T05:17:22+05:30 IST

బయట మార్కెట్‌లో రూ.10కి దొరికే సమోసా అక్కడ 30. బయటి దుకాణాల్లో రూ.20కి లభించే నీళ్ల సీసా అక్కడ 30. బయట రూ.20కి విక్రయించే పఫ్‌ అక్కడ రూ.35...ఇవీ సినిమా థియేటర్లలో తినుబండారాల ధరలు. వీటితో పాటు కూల్‌డ్రింక్స్‌, ఇతర తినుబండారాలనూ అధిక ధరలకు విక్రయిస్తూ ప్రేక్షకులను నిలువునా దోచుకుంటున్నారు. ప్రేక్షకులు మంచినీరు కూడా థియేటర్‌ లోపలికి తీసుకెళ్లకుండా అడ్డుకుంటూ... దోపిడీ సాగిస్తున్నారు. టిక్కెట్ల ధరల నియంత్రణ పేరిట తనిఖీలు చేస్తున్న అధికారులు.. తినుబండారాల విక్రయాల్లో దోపిడీని అరికట్టేందుకు మాత్రం చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశమవుతోంది.

కొనాలంటే ధర దడ!

సినిమాహాళ్లలో ఆహార పదార్థాల విక్రయాల్లో దోపిడీ 

నీళ్ల సీసా నుంచి.. కూల్‌ డ్రింక్‌ వరకు బాదుడు

పార్కింగ్‌ పేరిట అదనపు వసూళ్లు

పట్టించుకోని అధికారులు

 (శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి) 

బయట మార్కెట్‌లో రూ.10కి దొరికే సమోసా అక్కడ 30. బయటి దుకాణాల్లో రూ.20కి లభించే నీళ్ల సీసా అక్కడ 30. బయట రూ.20కి విక్రయించే పఫ్‌ అక్కడ రూ.35...ఇవీ సినిమా థియేటర్లలో తినుబండారాల ధరలు. వీటితో పాటు కూల్‌డ్రింక్స్‌, ఇతర తినుబండారాలనూ అధిక ధరలకు విక్రయిస్తూ ప్రేక్షకులను నిలువునా దోచుకుంటున్నారు. ప్రేక్షకులు మంచినీరు కూడా థియేటర్‌ లోపలికి తీసుకెళ్లకుండా అడ్డుకుంటూ... దోపిడీ సాగిస్తున్నారు. టిక్కెట్ల ధరల నియంత్రణ పేరిట తనిఖీలు చేస్తున్న అధికారులు.. తినుబండారాల విక్రయాల్లో దోపిడీని అరికట్టేందుకు మాత్రం చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశమవుతోంది. 

.................................

సినిమా థియేటర్లలో ప్రేక్షకులు దోపిడీకి గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు నియంత్రించేందుకు చర్యలు చేపడుతోంది. కానీ, టిక్కెట్ల ధరల కన్నా.. అక్కడ తినుబండారాల విక్రయాల్లో పెద్దఎత్తున దందా సాగుతోంది. ప్రతి వస్తువుపై దాదాపు మూడు రెట్ల అదనపు ధరలతో వినియోగదారుడి జేబు గుల్లవుతోంది. థియేటర్లలో తనిఖీలు చేస్తున్న అధికారులు.. తినుబండారాల ధరల దోపిడీ నియంత్రణకు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 49 సినిమా హాళ్లు ఉన్నాయి. అత్యధిక థియేటర్లను కార్పొరేట్‌ సంస్థలు లీజుకు తీసుకున్నాయి. కొవిడ్‌ ప్రభావంతో కొన్నాళ్లు థియేటర్లు మూతపడ్డాయి. ఇటీవల థియేటర్లు తెరచుకోగా.. మళ్లీ సందడి నెలకొంది. అగ్రకథానాయకుల సినిమాలు సైతం విడుదలవుతుండడంతో రద్దీ పెరుగుతోంది. టిక్కెట్‌ ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు సినిమా హాళ్లను తనిఖీ చేస్తున్నారు. నేరుగా ప్రేక్షకులతో మాట్లాడి..  ఆరా తీస్తున్నారు. టిక్కెట్ల ధరలు పెంచితే చర్యలు తప్పవని యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ.. వదిలేస్తున్నారు. కానీ.. థియేటర్‌ ఆవరణలోనే విక్రయిస్తున్న తినుబండారాలు, డ్రింక్స్‌ ధరలకు కళ్లెం ఎందుకు వేయడం లేదని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. నలుగురు ఐదుగురు సభ్యులున్న ఒక కుటుంబం.. సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్తే తినుబండారాలకే రూ.వెయ్యికి పైగా ఖర్చవుతోందని గగ్గోలు పెడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా దోపిడీ వ్యాపారం సాగుతోందని ఆరోపిస్తున్నారు. బయట రూ.10కి లభ్యమయ్యే ఆహార పదార్థాలను థియేటర్లలో రూ.40కి విక్రయిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. ప్రముఖ కూల్‌డ్రింక్స్‌ కంపెనీల పేర్లతో.. గ్లాసుల్లో  విడిగా విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    ప్రేక్షకులు ఇంటి నుంచి తినుబండారాలు, ఆఖరికి మంచినీరు కూడా తీసుకెళ్లకుండా యాజమాన్యాలు అడ్డుకుంటున్నాయి. థియేటర్ల ఆవరణలో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నాయి.


 తనిఖీలు ఏవీ?

సినిమాహాళ్లలో ఆహార పదార్థాలు నాణ్యమైనవేనా.. శుభ్రంగా ఉన్నాయా ? ప్రజలు తినేందుకు యోగ్యమేనా అనేది ఇటు ఆహార కల్తీ నియంత్రణ, అటు ప్రజారోగ్యం, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, తూనికలు కొలతలు శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు తనిఖీలు చేయాలి. రెవెన్యూ అధికారులే ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. మిగిలిన అధికారులు ఏడాదికి ఓసారైనా.. థియేటర్లలో తనిఖీలు చేసే సందర్భం లేదు. నాసిరకమైన ఆహార పదార్థాలు విక్రయిస్తున్న వారిపై ఒక్క కేసు కూడా నమోదు చేసిన దాఖలాలు లేవు. అన్ని శాఖల అధికారులు శ్రీకాకుళంలోనే ఉన్నారు. కానీ, జిల్లా కేంద్రంలో ఉన్న 9 థియేటర్లలో కూడా తనిఖీలు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త సినిమాలు వస్తే.. కొంతమంది అధికారులకు థియేటర్ల యాజమాన్యాలు టిక్కెట్లు కేటాయిస్తాయని..ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తాయని... అందుకే తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


అరకొర సౌకర్యాలే 

కరోనా ఆంక్షలు కారణంగా థియేటర్లను శానిటైజ్‌ చేస్తున్నారు. అయినా దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. ఏసీ థియేటర్‌ అని టిక్కెట్‌లపై ముద్రించి.. అధిక ధర వసూలు చేస్తున్నారు. కానీ కొద్దిసేపు మాత్రమే ఏసీ వేసి.. ఆపేస్తున్నారు. ఇక పార్కింగ్‌ పేరిట ద్విచక్ర వాహనాలకు రూ.20 చొప్పున వసూలు చేసి అడ్డంగా దోచేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌ కోసం షెడ్డు కూడా ఉండట్లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి థియేటర్లలో తినుబండారాల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రేక్షకులు కోరుతున్నారు. సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


తనిఖీలు చేస్తున్నాం 

సినిమా హాళ్లలో తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. నిబంధనలు అమలు చేయని వారికి నోటీసులు జారీ చేస్తున్నాం. ధరలు పెంచి విక్రయిస్తే వాటిపై సంబంధిత అధికారులకు ప్రేక్షకులు ఫిర్యాదు చేయవచ్చు.

- దయానిధి, జిల్లా రెవెన్యూ అధికారి


శ్రీకాకుళంలోని ఓ థియేటర్‌లో ఆహార పదార్థాలు, కూల్‌డ్రింక్‌ల ధరలు ఇలా..

------------------

కూల్‌ డ్రింక్‌         రూ.60

పాప్‌కార్న్‌(90గ్రా.) రూ.100

    60 గ్రాములు రూ.80

    మీడియం         రూ.60

మసాలా ఫ్రెంచ్‌ఫ్రైస్‌ రూ.100

ఫ్రెంచ్‌ ఫ్రైస్‌         రూ.80

స్వీట్‌ కార్న్‌         రూ.60

కూల్‌డ్రింక్‌+పాప్‌కార్న్‌ రూ.80

  (45గ్రా..)

ఐస్‌క్రీం రూ.50

కాఫీ         రూ.25

టీ         రూ.25

వెజ్‌ పఫ్‌         రూ.35

ఎగ్‌పఫ్‌ రూ.40

చికెన్‌ పఫ్‌         రూ.40

పన్నీర్‌ రోల్‌         రూ.45

సమోసా (100గ్రా.) రూ.25

Updated Date - 2021-12-26T05:17:22+05:30 IST