ఆట..ఊరట ‘లేదు’!

ABN , First Publish Date - 2021-12-31T05:41:30+05:30 IST

జిల్లాలో క్రీడాభివృద్ధి పడకేసింది. గత ఏడాది కాలంగా క్రీడా పోటీల నిర్వహణ లేదు. క్రీడాకారులకు ప్రోత్సాహం లేకుండా పోయింది. అధికారులు మాత్రం కరోనా పేరు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టి అన్ని వ్యవస్థలు గాడిలో పడినా, శాఖలపరంగా కార్యక్రమాలు ఊపందుకున్నా.. క్రీడల విషయానికి వచ్చేసరికి సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏడాది చివరలో ఈ నెలలో సీఎం కప్‌ పేరుతో పాఠశాలల స్థాయిలో క్రీడల నిర్వహణ మినహా ప్రగతి ఏమీ లేదనే చెప్పాలి. కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో

ఆట..ఊరట ‘లేదు’!
కోడి రామ్మూర్తి స్టేడియం


కానరాని క్రీడా పోటీలు

క్రీడాకారులకు ప్రోత్సాహం కరువు

ముందుకు కదలని స్టేడియంల పనులు

సీఎం కప్‌ పోటీలతో మమ

ఈ ఏడాది పడకేసిన క్రీడా ప్రగతి

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

సిక్కోలు...క్రీడల ఖిల్లా. ఎంతో మంది ఉత్తమ క్రీడాకారులను జాతికి అందించింది ఈ జిల్లా. దేశానికి ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు జిల్లా సొంతం. కానీ ఇదంతా గతం. ప్రస్తుతం క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించే వారు కరువయ్యారు. సత్తా ఉన్న క్రీడాకారులు ఉన్నా మైదానాలు లేవు. ప్రాంగణాలు ఉన్నా వసతులు లేవు. గడిచిన ఏడాది కాలంగా పాఠశాల స్థాయిలో సీఎం కప్‌ క్రీడలు తప్ప.. ఇతర ఆటల ఊసేలేదు. క్రీడా ప్రగతి కానరాలేదు.

జిల్లాలో క్రీడాభివృద్ధి పడకేసింది. గత ఏడాది కాలంగా క్రీడా పోటీల నిర్వహణ లేదు. క్రీడాకారులకు ప్రోత్సాహం లేకుండా పోయింది. అధికారులు మాత్రం కరోనా పేరు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టి అన్ని వ్యవస్థలు గాడిలో పడినా, శాఖలపరంగా కార్యక్రమాలు ఊపందుకున్నా.. క్రీడల విషయానికి వచ్చేసరికి సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏడాది చివరలో ఈ నెలలో సీఎం కప్‌ పేరుతో పాఠశాలల స్థాయిలో క్రీడల నిర్వహణ మినహా ప్రగతి ఏమీ లేదనే చెప్పాలి.  కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో క్రీడల ఊసేలేదు. ఏటా నిర్వహించే వేసవి క్రీడలు, జోనల్‌  స్థాయి క్రీడల నిర్వహణకు ప్రభుత్వం నిధులు లేవని తేల్చి చెప్పడంతో క్రీడాకారుల్లో నైరాశ్యం నెలకొంది. మండల స్థాయిలో ఎక్కడా క్రీడా మైదానాలు లేవు. పట్టణాల్లో ఉన్నా అశించిన స్థాయిలో వసతులు లేవు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి ఒక క్రీడా మైదానాన్ని గుర్తించారు. రూ.2 కోట్లతో మినీ స్టేడియంల నిర్మాణానికి పూనుకున్నారు. కానీ ఎక్కడా పనులు పూర్తికాలేదు. ఈ ఏడాది క్రీడా మైదానాల నిర్మాణాల పూర్తి కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

 కేఆర్‌ స్టేడియం..దయనీయం

జిల్లా కేంద్రంలో కోడి రామ్మూర్తి స్టేడియానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు వేదికగా నిలిచింది ఈ ప్రాంగణం. ఏడాది పొడవునా అన్నిరకాల క్రీడా పోటీలు, ఆర్మీ, పోలీస్‌ నియామకాల సామర్ధ్య పరీక్షలు, సభలు, సమావేశాలు జరిగేవి. నిత్యం క్రీడాకారులతో కళకళలాడుతూ కనిపించిన స్టేడియం ఆధునికీకరణలో భాగంగా కొన్నేళ్ల కిందట నిర్మాణాలను తొలగించారు. ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైనా తరువాత ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా పనుల్లో పురోగతి లేదు. కొందరు ట్రాన్స్‌పోర్టు యాజమానులు క్రీడా మైదానాన్ని పార్కింగ్‌ స్థలంగా వాడుకొంటున్నారు. దీనిని గుర్తించిన వాకర్స్‌, క్రీడా  ప్రాథమికార సంస్థ అధికారులు వాహనాలు లోపలికి రాకుండా సొంత నిధులతో ఇనుప ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. వీఎంఆర్‌డీఏ నిధులు రూ.7.50 కోట్లు మంజూరైనట్టు చెబుతున్నా పనులు ప్రారంభించలేదు. ఈ ఏడాది దీని అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సంబంధిత మంత్రి ప్రకటించారు. పాలనాపరమైన అనుమతులు లభించలేదని అధికారులు చెబుతున్నారు. 

 మొక్కుబడిగా సీఎం కప్‌ పోటీలు

ఈ ఏడాది చివర్లో సీఎం కప్‌ క్రీడా పోటీల పేరిట అధికారులు హడావుడి చేశారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీలను మొక్కుబడిగా పూర్తిచేశారు. వాస్తవానికి విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే పాఠశాల స్థాయి క్రీడా పోటీలకు ప్రాధాన్యమివ్వాలి. కానీ అటువంటి చర్యలేవీ చేపట్టలేదు. దీనిపై విమర్శలు వ్యక్తం కావడంతో ఏడాది చివర్లో పోటీలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం పోటీలు నిర్వహించాలని ఉత్తర్వులిచ్చిందే తప్ప అందుకు తగ్గట్టు నిధులు సమకూర్చలేదని అధికారులు పెదవి విరిచారు. చాలాచోట్ల అరకొర వసతుల నడుమే మొక్కుబడి తంతుగా పోటీలను పూర్తిచేశారు.



Updated Date - 2021-12-31T05:41:30+05:30 IST