చదువు.. సందిగ్ధం
ABN , First Publish Date - 2021-05-21T05:21:47+05:30 IST
కరోనా రెండో దశ వ్యాప్తి.. విద్యారంగానికి పెద్ద సవాల్ విసిరింది. కేజీ నుంచి పీజీ వరకు, డిప్లమో, ఇంజనీరింగ్ ఇలా అన్ని కోర్సులపై కరోనా ప్రభావం పడింది. విద్యార్థుల చదువుపై సందిగ్ధం నెలకొంది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో విద్యా సంవత్సరం పూర్తయేది. గత ఏడాది విద్యా సంవత్సరం చివరిలో కరోనా ప్రభావం మొదలైంది. దీంతో కొన్ని నెలల పాటు పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఆపై ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆరంభం ఆలస్యమైంది.

విద్యాసంవత్సరం పూర్తయ్యేనా?
కరోనా ప్రభావంతో ఆన్లైన్లోనే తరగతులు
విద్యార్థుల హాజరు అంతంతమాత్రమే
(ఎచ్చెర్ల)
కరోనా రెండో దశ వ్యాప్తి.. విద్యారంగానికి పెద్ద సవాల్ విసిరింది. కేజీ నుంచి పీజీ వరకు, డిప్లమో, ఇంజనీరింగ్ ఇలా అన్ని కోర్సులపై కరోనా ప్రభావం పడింది. విద్యార్థుల చదువుపై సందిగ్ధం నెలకొంది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో విద్యా సంవత్సరం పూర్తయేది. గత ఏడాది విద్యా సంవత్సరం చివరిలో కరోనా ప్రభావం మొదలైంది. దీంతో కొన్ని నెలల పాటు పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఆపై ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆరంభం ఆలస్యమైంది. ఈ క్రమంలో ఇంటర్, డిప్లమో, ఇంజినీరింగ్ కోర్సుల్లో గత ఏడాది నవంబర్ వరకూ ప్రవేశాలు జరగలేదు. అనంతరం మూడు నెలలపాటు విద్యార్థులు కళాశాలకు వెళ్లారు. ఇంతలో కరోనా రెండో దశ వ్యాప్తిచెందడంతో తరగతులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో విద్యాసంస్థలు ఆన్లైన్ తరగతులను ప్రారంభించాయి. ఈ తరగతులకు 30 శాతానికి మించి విద్యార్థులు హాజరుకావడం లేదు. వీటిని విద్యార్థులు చాలా తేలికగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో మే నెలాఖరు అవుతున్నా, 2020-21 విద్యా సంవత్సరం పూర్తికాని పరిస్థితి నెలకొంది. అసలు ఎప్పుడు పూర్తవుతుందో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇక 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభంపై కూడా సందేహం వ్యక్తమవుతోంది.
డిగ్రీ, పీజీ విద్యార్థుల పరిస్థితి..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. వర్సిటీలోని బోధనా సిబ్బంది ఆన్లైన్ తరగతులను ఠంచన్‌గా నిర్వహిస్తున్నా.. విద్యార్థుల హాజరు తక్కువగానే ఉంది. వర్సిటీ పరిధిలో పీజీ విద్యార్థులకు ఈ ఏడాది మార్చి నెలాఖరులో ఆన్లైన్ తరగతులు ప్రారంభించారు. జనవరి మూడో వారం వరకు పీజీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు జరిగాయి. ఫిబ్రవరిలో కొద్ది రోజులు ఆప్‌లైన్‌లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు 3వ సెమిస్టర్ పరీక్షలు మార్చి 15 వరకు నిర్వహించారు. 4వ సెమిస్టర్‌కు ఆన్లైన్లో తరగతులు జరుగుతున్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంకా 1వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అంబేడ్కర్ వర్సిటీ అనుబంధ కళాశాలల్లోని డిగ్రీ విద్యార్థులకు కూడా ఆన్లైన్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. డిగ్రీ 3,5 సెమిస్టర్ పరీక్షలు పూర్తయినా, ఇంకా ఫలితాలు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించి విద్యా సంవత్సరం ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
డిప్లమో, ఇంజనీరింగ్దీ ఇదే పరిస్థితి
పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా ఆన్లైన్లోనే తరగతులు నిర్వహిస్తు న్నారు. వీరి హాజరు శాతం తక్కువగానే ఉంది. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలు పూర్తికాకపోవడంతో, ఈ ఏడాది పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో తెలియడం లేదు. సాధారణంగా పాలిసెట్ ఏప్రిల్ నెలలో నిర్వహించేవారు. గత ఏడాది సెప్టెంబరు 20న పాలిసెట్ నిర్వహించారు. ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు మినహా మిగిలిన విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఈ నెల 10 నుంచి 1వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, కొవిడ్ కారణంగా వాయిదా వేశారు.
పకడ్బందీగా
అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు పకడ్బందీగా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం. ఈ తరగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. వర్సిటీలో కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నాం.
- ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, రిజిస్ట్రార్, అంబేడ్కర్ యూనివర్సిటీ