అప్పుల ఊబిలో బతుకు ఛిద్రం

ABN , First Publish Date - 2021-10-07T05:52:04+05:30 IST

వృత్తి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోగా కుటుంబ యజమాని తీసుకున్న తొందరపాటు నిర్ణయంతో ఆ కుటుంబంలో ముగ్గురు మృత్యువాతపడిన సంఘటన పాతపట్నం మండలం కొరసవాడ గ్రామం ఆనెంవీధిలో వెలుగు చూసింది.

అప్పుల ఊబిలో బతుకు ఛిద్రం
యామిని (ఫైల్‌ఫొటో)

వరుసగా తండ్రి, ఇద్దరు చిన్నారులు మృత్యువాత

 కుటుంబంలో విషాదఛాయలు

పాతపట్నం, అక్టోబరు 6: వృత్తి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోగా కుటుంబ యజమాని తీసుకున్న తొందరపాటు నిర్ణయంతో ఆ కుటుంబంలో ముగ్గురు మృత్యువాతపడిన సంఘటన పాతపట్నం మండలం కొరసవాడ గ్రామం ఆనెంవీధిలో వెలుగు చూసింది. కుటుంబ పెద్ద వెంకటరమణ (28) పురుగుల మందు శీతల పానీయంలో కలిపి తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన సంగతి తెలిసిందే.  పురుగుల మందు కలిపి తాగిన శీతల పానీయం బాటిల్‌ అక్కడే వదిలేయడంతో కూల్‌ డ్రింక్‌గా భావించి అతని కుమారుడు నిహాల్‌ (3), కుమార్తె యామిని (5) దానిని తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే కుటుంబ పెద్ద మృతితో ఆ విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులు పిల్లలు ఆ మందును తాగిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించి శుక్రవారం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. చికిత్స చేయగా ఆరోగ్యం కుదుటపడడంతో వారిని ఇంటికి తీసుకువచ్చారు. శనివారం మధ్యాహ్నం వరకు ఆడుకున్న చిన్నారులు ఒక్కసారి వాంతులు చేసుకోవడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమారుడు నీహాల్‌ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. కనీసం కుమార్తెను బతికించుకుందామనుకుని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. కెజీహెచ్‌లో చికిత్స పొందుతున్న యామిని కూడా బుధవారం మృతి చెందింది. దీంతో ఆ కుటుం బంలో విషాదఛాయలు అలముకున్నాయి. 


అప్పులు గుదిబండగా మారి...

కొరసవాడ ఆనెంవీధిలో మేడిపాకల వెంకటరమణ (28) భార్య సుజాత, తల్లిదండ్రులు, తమ్ముడు శశితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. వడ్రంగి పనులుచేసుకుంటూ జీవనం సాగిస్తుం డగా అందరి లాగానే కరోనా కాలంలో పనులు లేక ఉపాధి కోల్పోయి అప్పులు చేసుకుంటూ కాలం నెట్టుకొచ్చాడు.  అప్పుల బాధ ఎక్కువ అవుతుండడంతో ఉన్న ఇంటిని అమ్మి కొంతమేర అప్పులు తీర్చాడు. మిగిలిన అప్పులు కూడా గుదిబండగా మార డంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు మృతి చెందడంతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఒకరి తరువాత మరొకరు మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అహమ్మద్‌ అమీర్‌ ఆలీ  తెలిపారు.

 

Updated Date - 2021-10-07T05:52:04+05:30 IST