పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

ABN , First Publish Date - 2021-03-15T05:11:42+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించారు.

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు
పాలకొండ కౌంటింగ్‌ కేంద్రంలో పరిశీలిస్తున్న అధికారులు

 ఉదయం 10 గంటలకే ఫలితాలు ప్రారంభం..

 కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించిన 

జాయింట్‌ కలెక్టర్లు

(పలాస/ఇచ్ఛాపురం/పాలకొండ/పాలకొండ రూరల్‌)

మునిసిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ ఎన్నికల ఫలితాలు ఆదివారం ఉదయం 10 గంటల నుంచే వెలువడ్డాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్తయ్యాయి. జేసీ శ్రీనివాసులు పర్యవేక్షణలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం మూడు గదుల్లో 18 బెంచీలను ఏర్పాటు చేసి ఓట్లు లెక్కించారు. మొదట 14వ వార్డు ఫలితం ప్రకటించగా, చివరిగా 31వ వార్డు   ప్రకటించారు. 11 గంటలకు మొదటి రౌండ్‌లో 18 స్థానాలు, 12.30 గంటలకు రెండో రౌండ్‌లో 11 స్థానాల ఫలితాలు వెల్లడించారు. కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 

ఇచ్ఛాపురంలోని జ్ఞానభారతి పాఠశాలలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదటి రౌండ్‌లో 12 వార్డులు, రెండో రౌండ్‌లో 11 వార్డుల ఓట్లు లెక్కించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మొత్తం ఫలితాలు వెల్లడించారు.  స్ర్టాంగ్‌రూమ్‌ నుంచి బందోబస్తు నడుమ బ్యాలెట్‌ బాక్సులను లెక్కింపు గదులకు తీసుకెళ్లారు. జేసీ సుమిత్‌కుమార్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి(నోడల్‌ అధికారి) జమదగ్ని, ఎన్నికల పరిశీలకులు చక్రవర్తి, జిల్లా ఎన్నికల సహాయ అధికారి ఎల్‌.రామలక్ష్మి పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. కార్యక్రమంలో సీఐ వినోద్‌బాబు, పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు సత్యనారాయణ, లక్ష్మీ పాల్గొన్నారు. 

పాలకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. 12 గంటలకే రెండు రౌండ్ల ఫలితాలను వెల్లడించారు. జేసీ శ్రీరాములు ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ  కె.రామారావు, ఆర్డీవో టి.వి.ఎస్‌.జి.కుమార్‌, డీఎస్పీ శ్రావణి, కమిషనర్‌ రామారావులు ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. నగర పంచాయతీ మేనేజర్‌ బి.ఎం.శివ ప్రసాద్‌, టీపీఓ సత్యనారాయణ, సిఐ జి.శంకరరావు, ఎస్‌ఐలు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఉంచారు. 


డమ్మీ అభ్యర్థిదే విజయం...

పలాస: పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో 29వ వార్డులో డమ్మీ అభ్యర్థి జోగ త్రివేణి అనూహ్య విజయం సాధించారు. పురపోరులో ఏకగ్రీవాల కోసం వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా టీడీపీ తరఫున నామినేషన్‌ వేసిన నలుగురు అభ్యర్థులను నామినేషన్ల ఉపసంహరణకు ముందే పార్టీలో చేర్చుకుంది. ఈ క్రమంలో రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో రెండు స్థానాలు ఏకగ్రీవానికి యత్నించగా.. టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించి.. వైసీపీ ఎత్తుగ డలను అడ్డుకున్నారు. ఆ వార్డుల్లో డమ్మీ అభ్యర్థులను బరిలో దిం పారు. మి లిన వార్డుల్లో అభ్యర్థులతో పాటు డమ్మీ అభ్యర్థులను కూడా రహస్య ప్రదేశాలకు టీడీపీ నేతలు తరలించారు. ఈ క్రమంలో 29వ వార్డులో డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన జోగ త్రివేణి.. వైసీపీ అభ్యర్థి తూముల సుజాతపై 50 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

నోటా దెబ్బతీసింది!

పాలకొండ: నగర పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో 1, 6, 7,  వార్డుల్లో అభ్యర్థుల విజయావకాశాలను నోటా, చెల్లని ఓట్లు దెబ్బతీశాయి. ఒకటో వార్డులో టీడీపీ అభ్యర్థి... వైసీపీ అభ్యర్థిపై కేవలం 15 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ వార్డులో చెల్లని ఓట్లు 16 నమోదు కాగా, నోటాకు ఎనిమిది ఓట్లు వేశారు. ఈ ఓట్లే సక్రమంగా పడి ఉంటే తమకు విజయావకాశాలు దక్కేవని వైసీపీ అభ్యర్థి చెబుతున్నారు. ఆరో వార్డులో టీడీపీ అభ్యర్థి కేవలం ఎనిమిది ఓట్లతో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆ వార్డులో చెల్లని ఓట్లు పది ఉండగా, నోటాకు ఐదు పడ్డాయి. ఈ ఓట్లు సక్రమంగా పడి ఉంటే  తమకు విజయావకాశం ఉండేదని  వైసీపీ అభ్యర్థి పేర్కొంటున్నారు. ఏడో వార్డులో వైసీపీ అభ్యర్థి ... టీడీపీ అభ్యర్థిపై కేవలం నాలుగు ఓట్ల మెజార్టీతోనే గెలుపొందారు. ఆ వార్డులో చెల్లని ఓట్లు ఎనిమిది నమోదు కాగా, మూడు నోటాకు పడ్డాయి. పది ఓట్లులోపు మెజార్టీతో అభ్యర్థులు గెలిపిస్తే రీకౌంటింగ్‌ చేయవచ్చన్న ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ఆరు, ఏడు  వార్డుల్లో అభ్యర్థుల అభ్యర్థన మేరకు రీ కౌంటింగ్‌ నిర్వహించారు. అయితే అక్కడ ఓట్ల లెక్కింపులో ఎటువంటి తేడా కనిపించలేదు.

  వరుసగా నాలుగుసార్లు..

కౌన్సిలర్‌గా గెలుపొందిన దువ్వాడ శ్రీకాంత్‌

 హ్యాట్రిక్‌ కొట్టిన గురిటి

పలాస:పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ఎన్నికల్లో దువ్వాడ శ్రీకాంత్‌ వరుసగా నాలు గుసార్లు కౌన్సిలర్‌గా విజయం సాధించడం విశేషం. వైసీపీ తరఫున 17వ వార్డు నుంచి ఆయన పోటీచేశారు.ఈ మేరకు ఆదివారం నిర్వహించిన కౌంటింగ్‌లో విజయం సాధించారు. ఈ వార్డులో మునిసిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఆయన కౌన్సిలర్‌గా  గెలుపొందుతున్నారు. అలాగే 27వ వార్డు టీడీపీ అభ్యర్థి గురిటి సూర్యనారాయణ వరుసగా మూడుసార్లు ఎన్నికై హాట్రిక్‌ సాధించారు. అలాగే 25వ వార్డు వైసీపీ అభ్యర్థి బోర చంద్రకళ కూడా మూడుసార్లు ఎన్నికకావడం విశేషం. రెండో పాల కవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా, వైసీపీ నుంచి రెండుసార్లు ఆమె ఎన్నికయ్యారు.


 

Updated Date - 2021-03-15T05:11:42+05:30 IST