సచివాలయ భవనాలను పూర్తి చేయండి

ABN , First Publish Date - 2021-10-30T05:14:01+05:30 IST

సచివాలయ భవనాలను పూర్తి చేయండి

సచివాలయ భవనాలను పూర్తి చేయండి

- జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, అక్టోబరు 29: జిల్లాలో గ్రామ సచివాలయ భవన నిర్మాణాలను పూర్తి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్‌లో డ్వామా ఆధ్వర్యంలో జడ్పీటీసీలు, ఎంపీపీలతో ఉపాధి హామీ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ పాల్గొని మాట్లాడారు. పేదరికాన్ని రూపు మాపడమే ఉపాధిహామీ పథకం ముఖ్యఉద్దేశమని చెప్పారు.  ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మెటీరియల్‌ పనులకు ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తే బాగుంటుందని సభ్యులు సూచించడంతో.. దీనిపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్లానింగ్‌ ప్రక్రియలో, పనుల గుర్తింపులో ప్రజాప్రతినిధులు భాగస్వాములుగా ఉండాలన్నారు. డ్వామా ప్రాజెక్టు డైరక్టర్‌ కూర్మారావు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రస్తుతం మానవవనరులతో కూడిన టెక్నాలజీ అవసరమన్నారు. రాష్ట్రంలో ఆనందసూచికలో శ్రీకాకుళం జిల్లా ముందువరుసలో ఉందన్నారు. జిల్లాలో 5.36లక్షల జాబ్‌ కార్డు దారులు ఉన్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున మొక్కలు నాటామన్నారు. ప్రస్తుతం నీటి లభ్యత తగ్గుతోంద న్నారు. భూగర్భజలాలను పెంపొందించడమే నీటి సమస్యకు పరిష్కారమని చెప్పారు. మన ఊరు-మన చెరువు పథకం కింద 150 చెరువులను గుర్తించామని.. ఒక్కో చెరువును రూ. 25లక్షలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీలు రోజారాణి, అప్పలనాయుడు, ఏవో రాజ్యలక్ష్మి, అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-30T05:14:01+05:30 IST