విలీనమాయే..చదువుపోయే!

ABN , First Publish Date - 2021-12-16T04:50:03+05:30 IST

ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానానికి అవాంతరాలు ఎదురవుతున్నాయి. విద్యావ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టింది. తొలివిడతలో జిల్లాలో 240 ప్రాథమిక పాఠశాలల్లోని మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసిన సుమారు 200 మంది ఉపాధ్యాయులను కూడా ఉన్నత పాఠశాలల్లో కలిపారు. కానీ క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం గుర్తించకపోవడంతో ప్రాథమిక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

విలీనమాయే..చదువుపోయే!

- మొక్కుబడిగా తరగతుల నిర్వహణ

- పాఠశాలల్లో వేధిస్తున్న గదుల కొరత

- ప్రాథమిక విద్యార్థులను పట్టించుకోని హైస్కూల్‌ సిబ్బంది 

(నరసన్నపేట)

ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానానికి అవాంతరాలు ఎదురవుతున్నాయి. విద్యావ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టింది.  తొలివిడతలో జిల్లాలో 240 ప్రాథమిక పాఠశాలల్లోని మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసిన సుమారు 200 మంది ఉపాధ్యాయులను కూడా ఉన్నత పాఠశాలల్లో కలిపారు. కానీ క్షేత్రస్థాయిలో  ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం గుర్తించకపోవడంతో ప్రాథమిక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గదులు చాలకపోవడం, ఉపాధ్యాయులు సరిపడా లేకపోవడంతో బోధన అటకెక్కుతోంది. ఉదాహరణకు నరసన్నపేట మండలంలో సత్యవరం, బోర్డు ఉన్నత పాఠశాల, కంబకాయి తదితర చోట్ల ప్రాథమిక పాఠశాలల ఆవరణలో నే తరగతులను నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు విలీనం జరిగే పాఠశాలల్లో మూడు నుంచి పదో తరగతి వరకు పాఠశాలల హెచ్‌ఎంలు టైంటేబుల్‌ వేయాలి. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు, ప్రాథమిక పాఠశాలల నుంచివచ్చిన ఉపాధ్యాయులకు కూడా పీరియడ్స్‌ సర్దుబాటు చేయాలి. పేపర్‌ మీద టైంటేబుల్‌ వేసి ఉన్నతాధికారులకు చూపించాలి. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. నరసన్నపేట మండలంలోని   పాఠశాలలో ‘ఆంధ్రజ్యోతి’ వారం రోజుల పాటు పరిశీలించగా మూడు నుంచి ఐదు తరగతులవరకు విలీనం చేసే పాఠశాలల్లో నామమాత్రంగానే బోధన కొనసాగుతున్నట్టు వెల్లడైంది. విలీనమైన మూడు నుంచి ఐదు తరగతులవైపు హెచ్‌ఎంలు, ఎస్‌ఏలు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులే బోధిస్తున్నారు. మొక్కుబడిగా ఒకటి రెండు పీరియడ్స్‌ తెలుగు పండిట్‌లతో బోధిస్తున్నారు. ఆ మూడు తరగతుల పిల్లలకు పాత పాఠశాల నుంచివచ్చిన ఎస్జీటీలతో అరకొరగా  బోధన సాగుతోంది. ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం ఇష్టం లేని కొన్ని ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు గదులు సరిపోవడం లేదని సాకు చూపిస్తూ పాత పాఠశాలల ఆవరణలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో కొందరు ఎస్‌ఏలు ఆ తరగతులకు బోధించడం లేదని విమర్శలు వస్తున్నాయి. కేవలం తెలుగు గ్రేడ్‌ -2 పండిట్‌లను మాత్రం పంపించడం తప్ప... కనీసం పీఈటీలతో ఆటలు కూడా ఆడించడం లేదని, మరి ఎందుకు విలీనం చేశారో తెలియడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. 


పాత పాఠశాలల్లోనే ఎండీఎం

ఉన్నత పాఠశాలల్లో విలీనమైన విద్యార్థులకు పాత పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) నిర్వహిస్తున్నారు. దీంతో ఆ మూడు తరగతుల విద్యార్థుల బాధ్యత మాది కాదంటే మాది కాదని... పాత పాఠశాలల హెచ్‌ఎంలు... ఉన్నత పాఠశాల హెచ్‌ఎంలు చేతులు దులుపుకొంటున్నారు. దీంతో విలీనమైన ఉపాధ్యాయుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.  పాత పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఒక్కరే సెలవు పెట్టాలని, ఆ చిన్న పిల్లలతో భరించలేమని ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు చేతులెత్తేస్తున్నారు. దీంతో అత్యవసర సమయంలో సెలవులు వాడుకోలేకపోతున్నామని కొందరు ఉపాధ్యాయులు ‘ఆంధ్రజ్యోతి’ వద్ద వాపోయారు. పాఠశాలలను పూర్తిస్థాయిలో విలీనం చేసి.. బాధ్యతగా బోధన విధానాలను అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 


ప్రధానోపాధ్యాయులదే బాధ్యత

విలీన ఉన్నత పాఠశాలల్లోని హెచ్‌ఎంలు పట్టించుకోకుండా ఉంటే చర్యలు తీసుకుంటాం. అన్ని వ్యవహారాలకు హెచ్‌ఎం బాధ్యుడు. టైంటేబుల్‌ ప్రకారం మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు వేర్వేరు సబ్జెక్టులకు ఉపాధ్యాయులు బోధించాలి. అలా జరగకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయాలి. 

- పగడాలమ్మ, డిప్యూటీ డీఈవో, శ్రీకాకుళం

Updated Date - 2021-12-16T04:50:03+05:30 IST