కాలగర్భంలోకి డీఆర్‌డీఏ

ABN , First Publish Date - 2021-11-12T04:56:38+05:30 IST

పాలనా విభాగంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)ది కీలక పాత్ర. అన్ని శాఖలతో సమన్వయంగా వ్యవహరించి గ్రామీణాభివృద్ధికి కృషి చేయడం ఈ సంస్థ ప్రధాన విధి. రెండు దశాబ్దాల కిందట కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఆర్‌డీఏ త్వరలో రద్దు కానుంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ కార్యదర్శి సంజయ్‌కుమార్‌ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. కేంద్రం తాజా ఆదేశాలతో ఏప్రిల్‌ 1 నుంచి గ్రామీణాభివృద్ధి సంస్థ కనుమరుగు కానుంది. ఈ సంస్థలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది మాతృ సంస్థలకు వెళ్లనున్నారు. మిగతా శాఖలు, విభాగాల్లో సర్దుబాటు చేయనున్నారు.

కాలగర్భంలోకి డీఆర్‌డీఏ

- ఏప్రిల్‌ 1 నుంచి రద్దుకు కేంద్రం ఆదేశం

- జిల్లా పరిషత్‌, పంచాయతీల్లో విలీనానికి సూచన

- సిబ్బంది మాతృ సంస్థకు, వివిధ విభాగాలకు సర్దుబాటు

(ఇచ్ఛాపురం రూరల్‌)

పాలనా విభాగంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)ది కీలక పాత్ర.  అన్ని శాఖలతో సమన్వయంగా వ్యవహరించి గ్రామీణాభివృద్ధికి కృషి చేయడం ఈ సంస్థ ప్రధాన విధి. రెండు దశాబ్దాల కిందట కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఆర్‌డీఏ త్వరలో రద్దు కానుంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ కార్యదర్శి సంజయ్‌కుమార్‌ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. కేంద్రం తాజా ఆదేశాలతో ఏప్రిల్‌ 1 నుంచి గ్రామీణాభివృద్ధి సంస్థ కనుమరుగు కానుంది. ఈ సంస్థలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది మాతృ సంస్థలకు వెళ్లనున్నారు. మిగతా శాఖలు, విభాగాల్లో సర్దుబాటు చేయనున్నారు. 

......................

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)కు సుదీర్ఘ చరిత్ర ఉంది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా 1999 ఏప్రిల్‌ 1న అప్పటి కేంద్ర ప్రభుత్వం డీఆర్‌డీఏను ప్రారంభించింది. అప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో డీఆర్‌డీఏ కీలక పాత్ర వహిస్తూ వచ్చింది. అనుబంధ శాఖల సహకారంతో పని చేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి డీఆర్‌డీఏ సంస్థను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. జిల్లా పరిషత్‌ లేదా పంచాయతీల్లో విలీనం చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ప్రస్తుతం డీఆర్‌డీఏ రాష్ట్ర డైరెక్టరేట్‌, రీజియన్‌, జిల్లా, బ్లాకులుగా పనిచేస్తోంది. ఈ పథకం కింద పనిచేసే సిబ్బంది జీతాలు, గ్రామాల అభివృద్ధికి 75:25 నిష్పత్తిలో నిధులు విడుదలవుతున్నాయి. డీఆర్‌డీఏకు నేరుగా కేంద్రం నిధులు జమ చేస్తుంటుంది. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పేదరిక నిర్మూలన వంటి కార్యక్రమాలను డీఆర్‌డీఏ చేపడుతోంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అన్ని వ్యవహారాల్లోనూ ఈ సంస్థ పని చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, మహిళల స్వయం సమృద్ధి వంటి పథకాలను అమలు చేయవలసిన బాధ్యతను డీఆర్‌డీఏ తీసుకుంది. బాల్య వివాహాలు, వేధింపులు వంటి నియంత్రణకు సంబంధిత శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. 


సిబ్బంది మాతృసంస్థకు..

డీఆర్‌డీఏ పరిధిలో ఉన్న పీడీ, ఏపీడీలు, ఏరియా కోఆర్డినేటర్లు, ఏపీఎంలు, సూపర్‌వైజర్లు, కార్యాలయ సిబ్బంది వివిధ శాఖల పరిధి నుంచి వచ్చి డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. వీరందరిని మాతృసంస్థలకు, ఇతర సిబ్బందిని జిల్లా ప్రణాళిక, పర్యవేక్షణ విభాగం, ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంలో సర్దుబాటు చేయాలని ఆదేశించింది. దీంతో జిల్లాలో డీఆర్‌డీఏలో పని చేస్తున్న సిబ్బందిని సిఫారసు చేసిన శాఖల్లోకి బదలాయించనున్నట్లు తెలుస్తోంది. డీఆర్‌డీఏలో ఆ స్థాయిలో పని చేస్తున్న సిబ్బందిని వారి స్థాయి ఉద్యోగాల్లో నియమిస్తారా? లేదంటే కేడర్‌ తగ్గనున్నదా? అనేది వేచిచూడాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల ఎవరి ఉద్యోగాలు ఉంటాయి? ఎవరివి ఊడిపోతాయోనన్న ఆందోళన ఉద్యోగులు, సిబ్బందిని వెంటాడుతోంది. జిల్లాలో డీఆర్‌డీఏలో గతంలో ఉన్న ఉద్యోగులు సెర్ఫ్‌కు వెళ్లిపోగా ప్రస్తుతం 13 మంది మాత్రమే ఉన్నారు. అందులో 10మంది వివిధ శాఖల నుంచి డెప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. ముగ్గురు కాంటాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. డిప్యూటేషన్‌పై వచ్చినవారిని మాతృశాఖకు పంపిస్తామని, మిగత వారిని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇతర శాఖలకు మళ్లించే అవకాశం ఉంటుందని కార్యాలయ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2021-11-12T04:56:38+05:30 IST