కొత్తబాట సరే... పాత సంగతేంటి?

ABN , First Publish Date - 2021-09-03T05:14:02+05:30 IST

గ్రంథాలయ వ్యవస్థలో విప్మవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆధునిక సొబగులు అద్దనున్నట్లు ప్రకటించింది. సచివాలయ పరిధిలో ఒక డిజిటల్‌ గ్రంథాలయం ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. ఇది మంచిదే అయినా, ఇప్పటికే ఉన్న గ్రంథాలయాలను మాత్రం పట్టించుకోవడం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాలయాల్లో ఎటువంటి మార్పులు లేవు. పాతకాలం నాటి పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, కొన్ని దినపత్రికలు, మ్యాగజైన్లతో సరిపెడుతున్నారు. నిర్వహణకు తగినంత మంది సిబ్బంది లేరు. ఈ పరిస్థితుల్లో డిజిటల్‌ లైబ్రరీల నిర్వహణ సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

కొత్తబాట సరే... పాత సంగతేంటి?

- దయనీయ స్థితిలో శాఖా గ్రంథాలయాలు

- పాఠకులకు అందని మెరుగైన సేవలు

- వెంటాడుతున్న నిధులు, సిబ్బంది కొరత

- తాజాగా సచివాలయానికి ఒక డిజిటల్‌ లైబ్రరీ ప్రతిపాదనలు

- స్థలాలు పరిశీలిస్తున్న అధికారులు 

(టెక్కలి)

గ్రంథాలయ వ్యవస్థలో విప్మవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆధునిక సొబగులు అద్దనున్నట్లు ప్రకటించింది. సచివాలయ పరిధిలో ఒక డిజిటల్‌ గ్రంథాలయం ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. ఇది మంచిదే అయినా, ఇప్పటికే ఉన్న గ్రంథాలయాలను మాత్రం పట్టించుకోవడం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాలయాల్లో ఎటువంటి మార్పులు లేవు. పాతకాలం నాటి పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, కొన్ని దినపత్రికలు, మ్యాగజైన్లతో సరిపెడుతున్నారు. నిర్వహణకు తగినంత మంది సిబ్బంది లేరు. ఈ పరిస్థితుల్లో డిజిటల్‌ లైబ్రరీల నిర్వహణ సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 

....................

సచివాలయాల్లో డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతగా రాష్ట్రవ్యాప్తంగా 4,530 సచివాలయాల్లో ఏర్పాటు చేయాలని సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకుగాను రూ.140కోట్లు కేటాయించనున్నట్టు ప్రకటించింది. సచివాలయాలకు అనుసంధానంగా భవనాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రూ.16 లక్షలతో ఒక్కో భవనం నిర్మించనుంది. మన జిల్లాకు సంబంధించి 250 చోట్ల తొలి విడతగా ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్థలాల వేటలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించింది. కానీ డిజిటల్‌ ల్రైబ్రరీలు సాధ్యమేనా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ లైబ్రరీ భవనాలు మరింతగా ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిజిటల్‌ గ్రంథాలయ భవనం పూర్తయితే హైక్వాలిటీ, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మూడు డెస్క్‌టాప్‌లు, యూపీఎస్‌లు, డెస్క్‌టాప్‌ బార్‌కోడ్‌ ప్రింటర్‌, స్కానర్‌, లేజర్‌ ప్రింటర్‌, సాఫ్ట్‌వేర్‌, యాంటీ వైరస్‌ వంటి వాటిని సమకూర్చనున్నారు. కాగా, కొన్నేళ్ల కిందట జిల్లాలో ఎనిమిది గ్రంథాలయాల్లో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తెచ్చారు. కానీ సాంకేతిక సమస్యలతో సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో డిజిటల్‌ గ్రంథాలయాలు ఎంతవరకు విజయవంతమవుతాయనే ప్రశ్నలు తల్తెతుతున్నాయి. 


శిథిల భవనాలు.. సిబ్బంది లేమి..

జిల్లాలో గ్రంథాలయాలు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. పాఠకుల ఆదరణ ఉన్నా, మెరుగైన సేవలు అందించలేకపోతున్నాయి. దశాబ్దాల కిందట నిర్మించిన భవనాల్లో కొనసాగుతున్నాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలో 45 శాఖ గ్రంథాలయాలు ఉన్నాయి. పాతపట్నం మండలం లాబర, నరసన్నపేట మండలం మబుగాం, శ్రీకాకుళం మండలం భైరిసింగుపురం, సంతకవిటి మండలం సిరిపురం, ఎల్‌ఎన్‌పేట మండలం శ్యామలాపురంలో విలేజ్‌ గ్రంథాలయాలున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 100 బుక్‌ డిపాజిట్‌, డెలివరీ కేంద్రాలున్నాయి. సిబ్బంది కొరత, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు మంజూరు చేయకపోవడంతో గ్రంథాలయాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికీ చాలా గ్రంథాలయాలకు సరైన భవనాలు లేవు. శిథిల భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ శాఖలు వినియోగించని భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో ఏళ్ల తరబడి నియామకాలు లేవు. శాశ్వత ఉద్యోగులు ఒక్కొక్కరూ పదవీ విరమణ చేస్తున్నా వారి స్థానంలో ఎవరినీ భర్తీ చేయడం లేదు. దాదాపు అన్నిచోట్ల కాంట్రాక్ట్‌ ప్రతిపాదికన పనిచేస్తున్న వారే కొనసాగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రంథాలయాల్లో సమస్యలు పరిష్కరించి మెరుగైన సేవలు అందజేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్‌రాజా వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా... గ్రంథాలయాల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పాఠకులకు మెరుగైన సేవలు అందించనున్నట్టు చెప్పారు. సచివాలయాల్లో ఏర్పాటు చేయనున్న డిజిటల్‌ లైబ్రరీలకు, గ్రంథాలయ సంస్థకు సంబంధం లేదన్నారు. పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించినట్టు తెలిపారు.

Updated Date - 2021-09-03T05:14:02+05:30 IST