సహాయక చర్యలకు సిద్ధంగా ఉండండి
ABN , First Publish Date - 2021-05-25T04:20:30+05:30 IST
తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ అమిత్‌బర్దర్ పోలీసులకు ఆదేశించారు. ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పోలీసులకు ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదేశం
పలాస, మే 24: తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ అమిత్‌బర్దర్ పోలీసులకు ఆదేశించారు. ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయంలో టెక్కలి డివిజన్ సర్కిల్ పోలీసు అధికారులతో తుఫాన్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ హెచ్చరికల నేపధ్యంలో రెవెన్యూ, ఆరోగ్యశాఖ, అగ్నిమాపకశాఖ, ట్రాన్స్‌కో అధికారులతో సమన్వయం చేసుకొని కొవిడ్ నిబంధనల మేరకు పూర్తిగా సిద్ధం కావాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ పునరుద్ధరణ, వైద్యశిబిరాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, నష్టం జరిగినా తక్షణమే పూరించేలా సహాయకారిగా వ్యవహరించాలని తెలిపారు. తితలీ తుఫాన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైన ఎక్స్‌కవేటర్లు, కటింగ్ యంత్రాలు, టార్చ్‌లైట్లు, రోప్‌లు, జనరేటర్లు, ఇతర సహాయ సామగ్రి సిద్ధం చేసుకోవాలని చెప్పారు. తుఫాన్ రక్షిత భవనాల్లో ఆహారం తయారీకి కావాల్సిన పదార్థాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐలు శంకరరావు, నీలయ్య, సతీష్‌కుమార్, ఎస్‌ఐలు కామేశ్వరరావు, గోవిందరావు, ఎం.యాసిన్, బాలరాజు, గోవిందరావు, రవికుమార్ పాల్గొన్నారు.