ఇదేమి.. ‘నిషా’ధం!

ABN , First Publish Date - 2021-12-20T04:52:52+05:30 IST

సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ఎన్నికల్లో ప్రకటించిన వైసీపీ.. మద్యం విక్రయాలు పెంచేలా చర్యలు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మద్యం ధరలను తగ్గించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. తగ్గిన ధరలు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ధరల పెరుగుదలతో పక్కా రాష్ట్రాల నుంచి మద్యం ప్రవేశిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ధరల తగ్గింపుపై మందుబాబులు కాస్త ఊరట చెందుతున్నారు. మిగిలిన వర్గాల ప్రజలు మద్యం విక్రయాలు పెంచుకునేందుకే ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించిందని విమర్శిస్తున్నారు.

ఇదేమి.. ‘నిషా’ధం!
మెళియాపుట్టిలో మద్యం కోసం నిరీక్షిస్తున్న దృశ్యం

- తగ్గిన మద్యం ధరలు

- చీప్‌లిక్కర్‌పై రూ.30, మీడియం బ్రాండ్లపై రూ.60 తగ్గింపు

- మద్య నిషేధం అమలు చేస్తామంటూనే.. విక్రయాలు పెంపునకు చర్యలు

- ప్రభుత్వ తీరుపై భిన్న వ్యాఖ్యలు

- ఇకనైనా ఒడిశా మద్యానికి చెక్‌పడేనా?

(రణస్థలం) 

సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ఎన్నికల్లో ప్రకటించిన వైసీపీ.. మద్యం విక్రయాలు పెంచేలా చర్యలు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మద్యం ధరలను తగ్గించింది. ఈ మేరకు శనివారం  ఉత్తర్వులు జారీచేసింది. తగ్గిన ధరలు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ధరల పెరుగుదలతో పక్కా రాష్ట్రాల నుంచి మద్యం ప్రవేశిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చీప్‌లిక్కర్‌పై రూ.30, మీడియం బ్రాండ్లపై రూ.60, బీర్లపై రూ.20 నుంచి రూ.30 వరకూ ధర తగ్గినట్టు ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ధరల తగ్గింపుపై మందుబాబులు కాస్త ఊరట చెందుతున్నారు. మిగిలిన వర్గాల ప్రజలు మద్యం విక్రయాలు పెంచుకునేందుకే ప్రభుత్వం మద్యం  ధరలు తగ్గించిందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఏడాదిన్నర కిందట మద్యంపై ఒక్కసారిగా 75 శాతం ధరలు పెంచేసింది. ధరలు భారీగా పెంచితే మందుబాబులు మద్యానికి దూరమవుతారని, తద్వారా మధ్య నిషేధం సాధ్యమవుతుందని ప్రభుత్వం పేర్కొంది. కానీ కొద్దిరోజుల తర్వాత 25 శాతం మేర ధరలు తగ్గించింది. తాజాగా మరోసారి ధరలు తగ్గించింది. మరోవైపు ఏడాదికి 25 శాతం షాపుల తగ్గింపు ఊసేలేదు. దీంతో మద్య నిషేధం ఉత్తమాటేనని తేలిపోయిందని పలువురు విమర్శిస్తున్నారు.  


 జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో ప్రస్తుతం 158 మద్యం దుకాణాలు, పట్టణ ప్రాంతాల్లో 19 మాల్స్‌ ద్వారా మద్యం విక్రయిస్తున్నారు. ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ (ఐఎంఎఫ్‌ఎల్‌) రకం మద్యంపై 5 శాతం నుంచి 12 శాతం, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం ధరలు తగ్గించారు. బీర్లపై వ్యాట్‌ 10 నుంచి 20 శాతం తగ్గింది. స్పెషల్‌ మార్జిన్‌ 36శాతం, అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ 36 శాతం తగ్గించారు.. ఐఎంఎఫ్‌ఎల్‌ లిక్కర్‌పై వ్యాట్‌ 35 నుంచి 50 శాతం, స్పెషల్‌ మార్జిన్‌ 10 నుంచి 20 శాతం, అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ 5 నుంచి 26 శాతం తగ్గించడంతో అన్ని రకాల మద్యం ధరలు తగ్గాయి. కానీ పొరుగునే ఉన్న ఒడిశాతో పోల్చుకుంటే మాత్రం ధర ఇంకా అధికమే. జిల్లాలో ఒడిశా మద్యం, సారా ఏరులై పారింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాసిరకం బ్రాండ్లు, అధిక ధరలే ఇందుకు కారణం. మన రాష్ట్రంతో పోల్చుకుంటే ఒడిశాలో మద్యం ధరలు తక్కువ. దేశంలో పేరుమోసిన బ్రాండ్లన్లీ అక్కడ లభిస్తున్నాయి. జిల్లాలో దాదాపు పదుల సంఖ్యలో మండలాలు ఒడిశాకు సరిహద్దులో ఉండడంతో అక్కడి మద్యం జిల్లాకు ప్రవేశిస్తోంది. ప్రతీరోజూ ఏదో చోట ఒడిశా మద్యం పట్టుబడుతూనే ఉంది. ఒడిశా మద్యం రవాణాను నియంత్రించడం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోతో పాటు పోలీసులకు సవాల్‌గా మారింది. అటు తెలంగాణా, కర్ణాటక సరిహద్దు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉండడం, మన రాష్ట్రానికి చెందిన మద్యం అమ్మకాలు అంతంతమాత్రంగా ఉండడంతో ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించిందని ఎక్సైజ్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా ఒడిశా మద్యానికి చెక్‌ పడుతుందో లేదోనన్న చర్చనీయాంశమవుతోంది. 


 తొలిరోజు సర్వర్‌ దెబ్బ

మెళియాపుట్టి/రాజాం, డిసెంబరు 19 : ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించగా.. తొలిరోజు ఆదివారం సర్వర్‌ సమస్య కారణంగా మందుబాబులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మద్యం దుకాణాలను ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు తెరుస్తారు. కాగా సర్వర్‌ సమస్య కారణంగా ఆన్‌లైన్‌లో తగ్గిన ధరలు నమోదు కాలేదు. దీంతో మద్యం అమ్మకాలు నిలిపేశారు. సాయంత్రం 4 గంటల వరకు తగ్గింపు ధరలు అమలులోకి రాకపోవడంతో అప్పటివరకూ నిరీక్షించారు. సాయంత్రం 4 గంటల తర్వాత విక్రయాలు జోరుగా సాగాయి. రాజాంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ధరలు కాస్త తగ్గాయని తెలిసి.. ఆదివారం ఉదయానికే చాలామంది మద్యం దుకాణాలకు చేరుకున్నారు. కాగా మద్యం ధరలు తగ్గినా.. సీసాలు స్కాన్‌ అవ్వకపోవడంతో నిర్వాహకులు విక్రయాలు నిలిపేశారు. దీంతో మందుబాబులు నిరాశ చెందారు. మద్యం సీసాలు స్కాన్‌ అవ్వకపోతే మందుబాబులు నష్టపోతారని, అందుకే తాత్కాలికంగా వ్రికయాలు నిలుపుదల చేయాలని సేల్స్‌మెన్లకు ఆదేశించామని ఎక్సైజ్‌ సీఐ వెంకటరమణ మూర్తి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత విక్రయాలు సాగించారు. 


ధరలు తగ్గాయి

 మద్యంపై ప్రభుత్వం అన్నిరకాల పన్నులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో చీప్‌లిక్కర్‌, మధ్యరకం బ్రాండ్లు, బీర్ల ధరలు తగ్గాయి. ఖరీదైన మద్యం ధరలు స్వల్పంగా తగ్గించారు. ఆదివారం నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి.  ఒడిశా మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్కడైనా అక్రమంగా మద్యం విక్రయించినా, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటాం. 

-ఏసుదాసు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, శ్రీకాకుళం

Updated Date - 2021-12-20T04:52:52+05:30 IST