పదవుల పందేరం

ABN , First Publish Date - 2022-01-01T04:49:12+05:30 IST

పదవుల పందేరం

పదవుల పందేరం

- మండలానికి మరో వైస్‌ ఎంపీపీ

- నోటిఫికేషన్‌ విడుదల 

- 4న ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు

- అసంతృప్తులకు తాయిలాలు

(రాజాం రూరల్‌)

అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు అధికార పార్టీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మండలానికి మరో వైఎస్‌ ఎంపీపీ పదవి కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 4న వైస్‌ ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నట్టు వెల్లడించింది. దీంతో ఆశావహుల్లో సందడి నెలకొంది. జిల్లాలో 38 మండల పరిషత్‌లకు ఎంపీపీలు ఇటీవల ఎన్నికయ్యారు. వీరికి తోడుగా మరో 38 మంది వైస్‌ ఎంపీపీలు ఉన్నారు. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో మరో 38 మంది వైస్‌ ఎంపీపీలు ఎన్నిక కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ కమిటీలు, సొసైటీలు, వివిధ కార్పొరేషన్ల పేరిట ఇప్పటికే నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసింది. అయినప్పటికీ కొన్ని మండలాల్లో పదవులు దక్కని నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా మండలానికి మరో వైస్‌ ఎంపీపీ పదవి కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకోసం పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ చేసి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 4న మండల పరిషత్‌ కార్యాలయాలలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఎంపీటీసీ సభ్యుల సమక్షంలో ప్రిసైడింగ్‌ అధికారి ఎన్నిక నిర్వహిస్తారు. చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకోనున్నారు. ఏకాభిప్రాయం కుదరక లేదా.. అనివార్య కారణాల వల్ల నిర్దేశించిన రోజున ఎన్నిక జరగకపోతే మరుసటి రోజు నిర్వహిస్తారు.  


విమర్శల హోరు

రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కొత్తగా వైస్‌ ఎంపీపీల పదవుల భర్తీ తంతు రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ చేయడానికే తప్ప.. అదనంగా ఒరిగే ప్రయోజనం ఉండదని విమర్శిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు తిలోదకాలిస్తోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పార్టీ బలోపేతానికి, రాజకీయ నిరుద్యోగులకు పదవుల కట్టబెట్టడంపైనే దృష్టి సారిస్తోందని విమర్శిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.  

Updated Date - 2022-01-01T04:49:12+05:30 IST