అన్నదాత.. కుదేలు!

ABN , First Publish Date - 2021-12-27T05:16:25+05:30 IST

అన్నదాత.. కుదేలు!

అన్నదాత.. కుదేలు!
ఇటీవల వచ్చిన జావెద్‌ తుఫాన్‌కు నేలకొరిగిన వరి పంట

2021.. మరో ఐదు రోజుల్లో  కాలగమనంలో కలసిపోనుంది. ఈ ఏడాది జిల్లావాసులకు ఎన్నో తీపి జ్ఞాపకాలు... చేదు సంఘటనలు... మధుర ఘట్టాలను మిగిల్చింది. ప్రధానంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొంతమంది జీవితాల్లో తేరుకోలేని విషాదాన్ని నింపింది. వ్యవసాయం, విద్య తదితర అన్ని రంగాలనూ కుదేలు చేసింది. ఎంతో మందికి ఉపాధిని దూరం చేసింది. ఇక.. సాగు విషయానికి వస్తే..  అకాల వర్షాలు, వరుస తుఫాన్‌లు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. పండిన పంటను విక్రయించేందుకు కష్టాలు ఎదురవుతున్నాయి. ఈదురుగాలులు, తెగుళ్ల ప్రభావంతో దిగుబడి తగ్గి.. కొబ్బరి రైతులకు కూడా నష్టాలు తప్పలేదు. ఇలా 2021లో జరిగిన సంఘటనలు, ఎదురైన సవాళ్లు, అధిగమించిన విపత్తుల సమాహారాలను మరోసారి మననం చేసుకుందాం. 

 


- కలిసిరాని 2021..

- అకాల వర్షాలు, తుఫాన్‌లతో విలవిల

- సక్రమంగా అందని నష్టపరిహారం 

- ధాన్యం విక్రయాలకు తప్పని అవస్థలు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/టెక్కలి/పాలకొండ)

అన్నదాతకు ఈ ఏడాది ఆక్రందనే మిగిలింది. ఓవైపు ప్రకృతి కన్నెర్ర జేయగా, మరోవైపు ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రైతులకు నష్టం తప్పలేదు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నా.. వర్షాధారంపైనే రైతులు ఆధారపడాల్సిన దుస్థితి ఎదురైంది. రబీ సీజన్‌లో కాలువల వెంబడి సాగునీరు విడిచిపెట్టకపోవడంతో రైతులు నష్టపోయారు. ఇక ఖరీఫ్‌ సాగు ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నారు.  పంట చేతికి అంది వచ్చే సమయంలో  సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కురిసిన అకాలవర్షాలు, వరుస తుఫాన్‌లు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. గులాబ్‌, జవాద్‌ తుఫాన్లు రైతులను నిండా ముంచేశాయి. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రగల్భాలు పలుకుతున్న వైసీపీ నేతలు.. అన్నదాతలను ఆదుకోవడం విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో 2.10లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. లక్షన్నర ఎకరాల్లో పత్తి, 50 ఎకరాల్లో మొక్కజొన్న, మరో లక్ష ఎకరాల్లో వివిధ రకాల వాణిజ్య పంటలు, కూరగాయలను సాగు చేశారు. అకాల వర్షాలు, తుఫాన్‌ల కారణంగా పంటను రక్షించుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు. సెప్టెంబరు నెలలో గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో సుమారు 18వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. అలాగే అక్టోబరులో జవాద్‌ తుఫాన్‌ దెబ్బకు మరో పదివేల ఎకరాల్లో పంట పోయినట్టు వ్యవసాయ అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ రెండు తుఫాన్ల ప్రభావంతో జిల్లాలో లక్ష ఎకరాలకుపైగా వరి పంటకు నష్టం వాటిల్లింది. క్షేత్రస్థాయిలో కమిటీలు వేసి అధికారులు పంట నష్టాన్ని గుర్తించినా.. రైతులకు మాత్రం పరిహారం అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మొత్తంగా జిల్లాలో 20 మండలాల పరిధిలో 451 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. చాలా మంది రైతులు ఆధార్‌ అనుసంధానం చేసుకోలేదు. సాగు వివరాలు ఈ క్రాఫ్‌లో నమోదు చేసి.. ఈకేవైసీ చేయించుకోలేదు. ఈ నేపథ్యంలో బాధిత రైతులందరికీ పరిహారం అందుతుందో లేదోనన్న సందేహం వ్యక్తమవుతోంది. 


ఎరువు కరువు....

రైతులకు ఈ ఏడాది విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేయలేకపోయింది. రైతుభరోసా కేంద్రాల్లో అరకొరగా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసింది. దీంతో రైతులు మార్కెట్‌లో అధిక ధరకు కొనుగోలు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రైతులకు సబ్సిడీపై యాంత్రీకరణ సామగ్రి కూడా అందకపోవడంతో నిరాశ చెందారు. 


వరి రైతులకు ఆదుకొనేవారేరీ....

జిల్లాలో ఈ ఏడాది 12లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ, తుఫాన్ల ప్రభావంతో దిగుబడి బాగా తగ్గింది. అష్టకష్టాలు పడి పండించిన ఆ ధాన్యాన్ని విక్రయించేందుకు కూడా రైతులకు కష్టాలు తప్పడం లేదు. అదును దాటిపోతున్నా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందక దిగులు చెందుతున్నారు. గత ఏడాది క్వింటా ఏ-గ్రేడు ధాన్యానికి రూ.1888, సాదా రకానికి రూ.1868 ధర నిర్ణయించారు. ఈ ఏడాది ప్రభుత్వం ధర పెంచింది.  క్వింటా ఏ గ్రేడుకు రూ.1960, సాదా రకానికి రూ.1940 ధర నిర్ణయించింది. కానీ కొనుగోలు ప్రక్రియలో వేగవంతం లేకపోవడంతో దళారులను ఆశ్రయుంచాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. గతంలో రైతులను నిండా ముంచిన మిల్లర్లకు ధాన్యం కొనుగోలుతో సంబంధం లేదని చెబుతున్న అధికారులు మళ్లీ ఇప్పుడు వారినే ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. 80 కిలోల బస్తా ఽధాన్యానికి రైతు  రూ.950 నుంచి రూ.1150 వరకే ధర చెల్లిస్తున్నారు. టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలో కొంతమంది దళారులు రైతుల నుంచి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇ-క్రాఫ్‌లో నమోదైన రైతుల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం అన్నదాతలకు శాపంగా మారింది. ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోనెసంచులు సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతోంది. రంగుమారిన ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది.  అలాగే రబీ సీజన్‌లో టెక్కలి ప్రాంతంలో వేరుశనగ పంటవేసి తీవ్రంగా నష్టపోయిన రైతులకు కోటి రూపాయలకు పైగా నష్టపరిహారం చెల్లించడంలో వ్యవసాయశాఖ జాప్యం చేస్తోంది. గత ఏడాది ఖరీఫ్‌ ధాన్యం రవాణా చార్జీల కింద రైతులకు రూ.20కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, బకాయిలు త్వరగా చెల్లించాలని రైతులు కోరుతున్నారు. 


కొబ్బరి రైతులకు.. గడ్డుకాలం

- మానని తితలీ గాయం

- కరోనాతో మరింత అతలాకుతలం

(ఇచ్ఛాపురం రూరల్‌)

కొబ్బరి రైతులకు ఈ ఏడాది  చేదు అనుభవాన్నే మిగిల్చింది. గతంలో తితలీ తుఫాన్‌ ఉద్దానం రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. అప్పట్లో కొబ్బరి చెట్లు కూలిపోవడంతో మొదలైన కష్టాలు ఇంకా తొలగిపోలేదు. కొబ్బరికి మార్కెట్‌ ధర ఉన్నా దిగుబడి లేని పరిస్థితి నెలకొంది. ఆదుకుంటాయనుకున్న అంతరపంటలు అతీగతీ లేని దుస్థితి. తితలీ తుఫాన్‌ నుంచి కోలుకోకముందే కరోనా లాక్‌డౌన్‌ కొబ్బరి రైతులకు శాపంగా మారింది. ఒకవైపు తెల్లదోమ, ఇంకోవైపు దళారుల దందా మొత్తంగా ఉద్దానం కొబ్బరి ఎప్పుడూలేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.23వేల నుంచి రూ.25వేలు ఉంది. ఆశించినంత దిగుబడి లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఉద్దానం కొబ్బరి అధికంగా కోల్‌కత్తా, ఢిల్లీ, ఛత్తీస్‌ఘడ్‌, ఒడిశా, తదితరల రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. కరోనాతో లాక్‌డౌన్‌ సమయంలో కొబ్బరి ఎగుమతులు పూర్తిగా పడిపోయాయి. దీంతో దళారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి రైతులను మోసం చేస్తున్నారు. 


రెట్టింపు పరిహారం ఉత్తిదే 

2018 అక్టోబరు11న సంభవించిన తితలీ తుఫాన్‌.. ఉద్దానం కొబ్బరి రైతుల బతుకులను బుగ్గిపాలు చేసింది. తుఫాన్‌ ధాటికి 52,164 మంది రైతులకు చెందిన 15,97,559 కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. అప్పటి ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించింది. పడిపోయిన చెట్లస్థానంలో నాటేందుకు కొబ్బరి మొక్కలను అందించి కాస్త ఉపశమనం కలిగించింది. పడిపోయిన చెట్లను తొలగించేందుకు సైతం సహకరించింది. తాము అధికారంలోకి వస్తే తితలీ బాధితులకు రెట్టింపు పరిహారం అందిస్తామని పాదయాత్ర సమయంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించడంతో రైతుల్లో హర్షాతీరేకాలు వ్యక్తమయ్యాయి. జగన్‌ సీఎం అయ్యి రెండున్నరేళ్లు దాటినా రెట్టింపు పరిహారం ఊసేలేదు. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు. అలాగే గులాబ్‌, జవాద్‌ తుఫాన్ల సమయంలో కొన్నిచోట్ల కొబ్బరిచెట్లు నేలకొరిగాయి. కానీ, ఇప్పటివరకు తమకు ఎటువంటి నష్టపరిహారం అందలేదని బాధిత రైతులు వాపోతున్నారు. 

Updated Date - 2021-12-27T05:16:25+05:30 IST