అక్కురాడ పేపర్ మిల్లు భూములు రూ.3.30 కోట్లకు వేలం
ABN , First Publish Date - 2021-10-29T04:32:25+05:30 IST
అక్కురాడ పేపర్ మిల్లు భూములు రూ.3.30 కోట్లకు వేలం

అక్కురాడ(జలుమూరు), అక్టోబరు 28: అక్కురాడ బయోగ్రీన్ పేపర్ లిమిటెడ్ ఆధీనంలోని 37.27 ఎకరాల భూమికి గురువారం బహిరంగ వేలం వేశారు. వీటిని విశాఖకు చెందిన సలాది అజయ్‌బాబు రూ.3 కోట్ల 30 లక్షల 30 వేలకు దక్కించుకున్నారు. రాష్ట్ర పన్నులశాఖ నరసన్నపేట సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉప సహాయ కమిషనర్ కింజరాపు వెంకటరమణ.. పేపరు మిల్లు ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో ఐదుగురు బిడ్డర్లు పాల్గొనగా.. సలాది అజయ్‌బాబు అత్యధిక ధరకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఉప సహాయ కమిషనర్ వెంకటరమణ మాట్లాడుతూ.. నెలరోజుల్లోగా సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. పేపర్ మిల్లు యాజమాన్యం రాష్ట్ర పన్నులశాఖకు రూ.1.46 కోట్లు బకాయి పడిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పన్నులశాఖ అధీనంలోని ఈ భూములను వేలం వేశామని చెప్పారు. ఇదిలా ఉండగా, గతంలో ఐదుసారు ఈ భూములకు బహిరంగ వేలం వేసి.. అనివార్య కారణాల వల్ల రద్దు చేశారు. ఈ సారి వేలంపాట ఖరారు కావడంతో.. పన్నుల శాఖ అధికారులు బకాయిలు రాబట్టుకోనున్నారు. కార్యక్రమంలో జీఎస్‌టీవోలు ఎన్.తిరుపతిబాబు, బి.కామరాజు, ఏఈవోలు డి.శ్రీనివాసరావు, ఎం.కిశోర్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ టాక్స్ అసిస్టెంట్ పి.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.