సాగునీటిపై నిలదీత

ABN , First Publish Date - 2021-08-22T05:27:06+05:30 IST

‘ఖరీఫ్‌ సీజన్‌ గడచిపోతున్నా సక్రమంగా సాగునీరు అందక రైతులు నాట్లు వేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి’ అని అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమావేశం వాడీవేడిగా సాగింది. అధికార పార్టీ నాయకులే అధికారుల తీరుపై దుమ్మెత్తి పోశారు. జిల్లాలో కాలువల ద్వారా సక్రమంగా సాగునీరు అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

సాగునీటిపై నిలదీత
సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌, పక్కన మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ తదితరులు

- నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు

- అధికారుల తీరుపై దుమ్మెత్తిపోసిన అధికార పార్టీ నేతలు

- వాడీవేడిగా వ్యవసాయ సలహా మండలి సమావేశం

- తోటపల్లి ఎస్‌ఈ, ఎస్‌ఐడీసీ ఈఈలకు నోటీసులు

- రైతు శ్రేయస్సే ధ్యేయం:  ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్‌

కలెక్టరేట్‌, ఆగస్టు 21: ‘ఖరీఫ్‌ సీజన్‌ గడచిపోతున్నా సక్రమంగా సాగునీరు అందక రైతులు నాట్లు వేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  అధికారులు సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి’ అని అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమావేశం వాడీవేడిగా సాగింది. అధికార పార్టీ నాయకులే అధికారుల తీరుపై దుమ్మెత్తి పోశారు. జిల్లాలో కాలువల ద్వారా సక్రమంగా సాగునీరు అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. రైతు శ్రేయస్సే ధ్యేయంగా అధికారులు పని చేయాలని తెలిపారు. బిల్లుల పెండింగ్‌ నెపంతో నీటి విడుదలకు ఆటంకం కలిగించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గార ఎత్తి పోతల పథకం కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని గుర్తు చేశారు. అందులో భాగంగానే సలహా మండలి ఏర్పాటు చేశామన్నారు. అధికారులు శ్రద్ధతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. సమస్యలు ఉంటే చెప్పాలని.. వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పంట కాలువల ముంపు ప్రాంతాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. 


లస్కర్లను వెంటనే నియమించాలి: మంత్రి 

లస్కర్లను వెంటనే నియమించాలని గత సమావేశంలో నిర్ణయించామని.. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆదేశించారు. పశువైద్యాధికారులు విధిగా రైతుభరోసా కేంద్రాలను తనిఖీ చేయా లన్నారు. చెరువుల్లో ఎక్కువగా ఉపాధి పనులు చేస్తున్నారని.. దానికి బదులుగా సాగు నీటి కాలువలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఒడిశా ధాన్యాన్ని అక్రమంగా దిగుమతి చేయడంతో జిల్లారైతులకు నష్టం వాటిల్లుతోందన్నారు. 


ప్రతిపాదనలు సమర్పించండి: కలెక్టర్‌

గోవిందసాగరంలో కలుపు మొక్కలను తొలగించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని  కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  ఎల్‌.ఎన్‌.పేట మండలం  మిరియాపల్లి,  తదితర ప్రాంతాల్లో నీట మునిగిపోతున్న పొలాల స్థితిగతులను పరిశీలించాలని ఆదేశించారు. అక్రమంగా నీటిని వినియోగిస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఉబాలు జరగలేదో పరిశీలించాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కాలువల పనులు చేపట్టాలని తెలిపారు.


గైర్హాజరైన ఇద్దరు అధికారులకు నోటీసులు

వ్యవసాయ సలహా మండలి సమావేశానికి గైర్హాజరైన  తోటపల్లి  ఎస్‌ఈ,  ఎస్‌ఐడీసీ ఈఈలకు నోటీసులు జారీ చేస్తున్నట్లు  కలెక్టర్‌ తెలిపారు. ప్రతి అధికారి విధిగా సమావే శానికి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేసీ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యే కంబాల జోగులు, వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎ.సూరిబాబు, అగ్రిమిషన్‌ చైర్మన్‌ జి.రఘురాం, జలవనరులశాఖ ఈఈ రామచంద్రరావు, డ్వామా పీడీ హెచ్‌.కూర్మారావు  వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు నేతాజీ, వ్యవసాయ శాఖ జేడీ కె.శ్రీధర్‌, వంశధార ఎస్‌ఈ కె.తిరుమలరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-22T05:27:06+05:30 IST