ఎలా నడిపేది?
ABN , First Publish Date - 2021-10-25T05:42:35+05:30 IST
జిల్లాలో 1,140 పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో నాలుగేళ్ల నుంచి రిజిస్ర్టేషన్ సర్‌చార్జీలు పంచాయతీల ఖాతాకు జమ కావడం లేదు. 2017 నుంచి నిలిచిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏటా రూ.100 నుంచి రూ.125 కోట్లు సర్‌చార్జీలు జమవుతుంటాయని అధికారులు చెబుతున్నారు.

- పేరుకుపోతున్న నీటి తీరువా బకాయిలు
- ఇసుక, గనుల సీనరేజి చార్జీలదీ ఇదే పరిస్థితి
- నిలిచిపోయిన చెల్లింపులు
- నిర్వేదంలో పంచాయతీలు
- నిధులు లేక నీరుగారుతున్న సర్పంచ్‌లు
(రాజాం)
‘ఆదాయం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన చెల్లింపులు కూడా లేవు’...దీంతో పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజలకు ఏం చెప్పాలో సర్పంచ్‌లు, అధికారులకు పాలుపోవడం లేదు. చిన్న పని కూడా చేయలేకపోతున్నామన్న ఆవేదన వారిని వెంటాడుతోంది. సాధారణంగా పంచాయతీలకు నీటి తీరువా వాటా, ఇసుక, గనుల సీనరేజీ, రిజిస్ట్రేషన్ సర్‌చార్జీలు ఆదాయ వనరులు. కానీ కొన్నేళ్లుగా చెల్లింపులు లేవు. అటు 14వ ఆర్థిక సంఘం పెండింగ్ నిధులు విద్యుత్ చార్జీల కింద ప్రభుత్వం జమ చేసుకుంది. ప్రస్తుతం పంచాయతీల బ్యాంక్ ఖాతాలు చూస్తుంటే ఖాళీగా కనిపిస్తున్నాయి. పారిశుధ్య పనులు, తాగునీటి వనరుల మరమ్మతులు చేయలేని స్థితిలో సర్పంచ్‌లు ఉన్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు.
- జిల్లాలో 1,140 పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో నాలుగేళ్ల నుంచి రిజిస్ర్టేషన్ సర్‌చార్జీలు పంచాయతీల ఖాతాకు జమ కావడం లేదు. 2017 నుంచి నిలిచిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏటా రూ.100 నుంచి రూ.125 కోట్లు సర్‌చార్జీలు జమవుతుంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన గత నాలుగేళ్లలో రూ.400 కోట్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇసుక, గనుల సీనరేజ్ది అదే పరిస్థితి. సహజ వనరుల ద్వారా లభించే సీనరేజ్ ఆదాయం జిల్లా పరిషత్‌లకు జమయ్యేది. అక్కడి నుంచి స్థానిక సంస్థలకు కేటాయింపులు జరిగేవి. పంచాయతీలకు 50 శాతం, మండల పరిషత్‌లకు 25 శాతం, జిల్లా పరిషత్‌లకు 25 శాతం నిధులు సర్దుబాటు చేసేవారు. గతంలో ఇసుక రీచ్‌ల నిర్వహణను జిల్లా పరిషత్ చూసేది. ఒక్క ఇసుక మీదే జడ్పీకి రూ.50 కోట్లపైగా ఆదాయం సమకూరేది. ఆ నిధులను వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదీ పరీవాహక పంచాయతీల అభివృద్ధికి దామాషా ప్రకారం ఖర్చు చేసేవారు. జిల్లాలో గ్రానైట్ క్వారీల ద్వారా లభించే సీనరేజ్ చార్జీలదీ అదే పరిస్థితి.
- నీటి తీరువాలో 5 నుంచి 10 శాతం పంచాయతీలకు జమయ్యేవి. మిగతావి సాగునీటి సంఘాలకు జమ చేసేవారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్ట్ కమిటీలకు కొంత మొత్తం కేటాయించేవారు. రెవెన్యూ శాఖ జూలై 1 నుంచి జూన్ 30 వరకూ ఆర్థిక సంఘంగా పరిగణిస్తుంది. ఏ గ్రామంలో నీటి తీరువా ఎంత మొత్తంలో వసూలైందో తహసీల్దారు కార్యాలయంలో లెక్కిస్తారు. ఆ మొత్తంలో పంచాయతీ వాటాను లెక్కించి ఖాతాల్లో జమ చేసేవారు. కానీ కొన్నేళ్లుగా ఈ చెల్లింపులు నిలిపివేశారు. నేరుగా ప్రభుత్వ ఖజానాకు చెల్లిస్తున్నా సీఎంఎఫ్ఎస్ విధానం ద్వారా దారి మళ్లుతున్నాయి తప్ప తిరిగి పంచాయతీలకు చెల్లింపులు చేయడం లేదు.
ఉన్నతాధికారులకు నివేదించాం.
పంచాయతీలకు సినరేజ్ చార్జీలు, నీటితీరువా పన్నులు నిలిచిపోయిన మాట వాస్తవమే. ఉన్నతాధికారులకు నివేదించాం. ఉన్నంతలో సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తున్నాం. బకాయిలు వచ్చిన వెంటనే అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తాం.
-- రవికుమార్ , జిల్లా పంచాయతీ అధికారి, శ్రీకాకుళం
నిధుల మళ్లింపు తగదు
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు మంజూరు చేయడం లేదు. కేంద్రం అందించే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లిస్తోంది. నీటి తీరువా, రిజిస్ర్టేషన్ సర్‌చార్జీలు, సినరేజ్ చార్జీలు సైతం చెల్లించడం లేదు. ఇలాగైతే పంచాయతీల నిర్వహణ ఎలా సాధ్యం.? ఇప్పటికైనా ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిధులు కేటాయించాలి.
-గురవాన రమేష్, సర్పంచ్, కోడిశ
111111111111111111111111111111111