కారులు మార్చి...అధికారులను ఏమార్చి!

ABN , First Publish Date - 2021-11-28T05:58:40+05:30 IST

ముందుగా ఒక కారు బయలుదేరుతుంది. దానికి కిలోమీటరు దూరంలో గంజాయితో మరో కారు ఉంటుంది. ముందు వెళ్తున్న కారును పోలీసులు కానీ... ఎస్‌ఈబీ అధికారులు కానీ ఆపి తనిఖీ చేస్తే వెనుక కారులో ఉన్నవారికి ఇట్టే సమాచారం అందిపోతుంది. వెంటనే అలెర్ట్‌ అయిపోతారు. కారును దారి మళ్లిస్తారు... గంజాయి తరలింపునకు కొంతమంది ఎంచుకున్న కొత్త మార్గమిదీ. నరసన్నపేటలో ఇటువంటి ఘటనే వెలుగుచూసింది.

కారులు మార్చి...అధికారులను ఏమార్చి!
పట్టుబడిన గంజాయి
 ఒడిశా నుంచి గంజాయి తరలింపు

సినీ ఫక్కీలో 200కిలోలు స్వాఽధీనం

నరసన్నపేట, నవంబరు 27: ముందుగా ఒక కారు బయలుదేరుతుంది. దానికి కిలోమీటరు దూరంలో గంజాయితో మరో కారు ఉంటుంది. ముందు వెళ్తున్న కారును పోలీసులు కానీ... ఎస్‌ఈబీ అధికారులు కానీ ఆపి తనిఖీ చేస్తే వెనుక కారులో ఉన్నవారికి ఇట్టే సమాచారం అందిపోతుంది. వెంటనే అలెర్ట్‌ అయిపోతారు. కారును దారి మళ్లిస్తారు... గంజాయి తరలింపునకు కొంతమంది ఎంచుకున్న కొత్త మార్గమిదీ. నరసన్నపేటలో ఇటువంటి ఘటనే వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి సీఐ తిరుపతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున జమ్మూ జంక్షన్‌లో హెచ్‌సీ ధర్మారావు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా ఒడిశా జిల్లా పర్లాకిమిడి నుంచి నరసన్నపేటకు వస్తున్న కారు తారసపడింది. క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో ఉన్నవారు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారి కదలికలపై పోలీసులు దృష్టి పెట్టారు. అక్కడికి కొద్దిసేపటికే ఆ వాహనం వెంట మరో కారు కదిలింది. పోలీసులు వెంబడించగా ...జమ్ము సమీపంలోని ఓ మిల్లు వద్ద ఒక కారును పార్క్‌ చేశారు. మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ కారును కూడా కొద్ది దూరంలో ఓ చోట విడిచిపెట్టి పరారయ్యారు. మిల్లు వద్ద ఆపిన ఓఆర్‌ 07 ఏఏ 2900 నంబరు గల కారులో పోలీసులకు 200 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.4 లక్షలు ఉంటుంది. ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వాహనాల నంబరు ఆధారంగా కేసు విచారణ ప్రారంభించినట్టు సీఐ తిరుపతి తెలిపారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.Updated Date - 2021-11-28T05:58:40+05:30 IST