కొత్తమారడికోటలో కిడ్నీ పడగ!
ABN , First Publish Date - 2021-12-27T05:13:54+05:30 IST
కొత్తమారడికోటలో కిడ్నీ పడగ!

- ఐదేళ్లలో 14 మంది మృతి
- మరో 15 మంది బాధితులు
- ఆందోళనలో గ్రామస్థులు
- పట్టించుకోని అధికారులు
(మెళియాపుట్టి)
కిడ్నీ వ్యాధి అంటే గుర్తొచ్చేది జిల్లాలోని ఉద్దానం ప్రాంతం. ఇప్పుడీ మహమ్మారి మెళియాపుట్టి మండలం కొత్తమారడికోటను వణికిస్తోంది. ఈ గ్రామంలో మరణమృదంగాన్ని మోగిస్తోంది. గత ఐదేళ్లలో 14 మందిని బలి తీసుకుంది. మరో 15మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. చాలామంది గ్రామం విడిచి వలస పోతున్నారు. ఈ గ్రామంలో 125 ఇళ్లు ఉన్నాయి. సుమారు 600 మంది నివసిస్తున్నారు. ఇంత చిన్న గ్రామంలో కిడ్నీ వ్యాధి బారిన పడి ఇంతమంది మృతి చెందుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ విషయాన్ని ఐటీడీఏ పీవో నవ్య దృష్టికి ఎంపీపీ ఈశ్వరమ్మ ఉదయ్ తీసుకెళ్లారు. దీంతో తాజాగా శుక్రవారం చాపర ఆరోగ్య కేంద్రంలో 15 మందికి పరీక్షలు చేయగా, ఐదుగురికి కిడ్నీ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మొత్తంగా గ్రామంలో ప్రస్తుతం 15 మంది బాధితులు ఉన్నారు. వీరిలో కొందరు మందులు వాడుతుండగా, మరికొందరు డయాలసిస్ చేయించుకుంటున్నారు. గత ఐదేళ్లలో 14 మంది కిడ్నీ వ్యాధితో మృతి చెందగా, వారిలో ఎక్కువ మంది 40 నుంచి 50ఏళ్ల లోపు వారేనని గ్రామస్థులు చెబుతున్నారు. కిడ్నీ మహమ్మారికి టి.దశరథ, వి.లింగరాజు, ఎన్.ధర్మారావు, ఆర్.బారికి, ఆర్.కిష్టమ్మ, పి.బుడ్డు, పి.మొఖలింగం, పి.జగన్నానాయకులు, ఎన్.జగదాంబ, టి.మోహనరావు, ఆర్.మోహనరావు, బి.దోమ, బి.హేమసుందరావుతో పాటు మరొక వ్యక్తి బలైనట్లు గ్రామస్థులు తెలిపారు.
తాగునీరే కారణమా?
గత ప్రభుత్వం 2019 డిసెంబరులో నందిగాం, టెక్కలి, రాజాం మండలాల్లోని పలు గ్రామాలతో పాటు మెళియాపుట్టి మండలం కొత్తమారడికోటలో తాగునీటి పరీక్షలు చేయించింది. లీటరు నీటిలో 15 మిల్లీ గ్రాముల ఫ్లోరైడ్ మాత్రమే ఉండాలి. కానీ, ఈ గ్రామంలో ఒక లీటరు నీటిలో 25 నుంచి 50 మిలీ ్లగ్రాముల ఫ్లోరైడ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ గ్రామంలో శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో వినియోగంలోకి రాలేదు. విద్యుత్ కనెక్షన్‌కు సుమారు రూ.2లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. కిడ్నీ వ్యాధి వ్యాప్తికి తాగునీరే కారణమని, వెంటనే మినరల్ వాటర్‌ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు. కిడ్నీ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మందులు వాడుతున్నాను..
నేను వైద్య పరీక్షలు చేయించుకోగా కిడ్నీ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో పలాసలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో మందులు వాడుతున్నాను. మా పిల్లలకు ఈ వ్యాధి రాకుండా కాపాడండి.
- అప్పోజమ్మ, బాధితురాలు
భయంగా ఉంది
నా ఆరోగ్యం మొన్నటి వరకూ బాగానే ఉంది. ఒక్కసారి అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాను. కిడ్నీ సమస్య ఉందని వైద్యులు చెప్పడంతో భయమేసింది. మా అమ్మ కూడా ఈ సమస్యతో బాధపడుతోంది.
- ఐ.వెంకటరావు, బాధితుడు
ఎలా బతకాలి
నా భర్త టి.మోహనరావు ఆరోగ్యం బాగానే ఉండేది. ఒకసారి పొలంలో పని చేస్తూ కళ్లుతిరిగి పడిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయగా కిడ్నీ సమస్య ఉన్నట్లు తేలింది. ఏడాది పాటు శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించాం. నా కళ్ల ముందే చనిపోయారు. ఇద్దరు పిల్లలతో నేను ఎలా బతకాలి.
- ధనలక్ష్మి, మోహనరావు భార్య
వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి
కిడ్నీ వ్యాధి కారణంగా మా గ్రామ ప్రజలు భయపడుతున్నారు. చాలామంది వలస వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి. గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి అందరికీ పరీక్షలు చేయాలి. వ్యాధి ముదరకముందే చికిత్స అందిస్తే కొంత వరకు మరణాలను తగ్గించవచ్చు. మినరల్ వాటర్ ప్లాంట్‌కు విద్యుత్ కనెక్షన్ కోసం నిధులు మంజూరు చేయాలి.
- భాగ్యం శ్రీనివాస్ సర్పంచ్, కొత్తమారడికోట
నీటి శాంపిల్ పంపించాం
కొత్తమారడికోటలో ప్రజలు తాగుతున్న నీటి శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపించాం. కిడ్నీ వ్యాధికి తాగునీరే కారణమని నిర్థారణ జరిగిన తరువాత ఏమి చేయాలో ఆలోచిస్తాం. మినరల్ వాటర్ ప్లాంట్‌కు విద్యుత్ సౌకర్యాన్ని పంచాయతీ నిధులతో ఏర్పాటు చేయాలి. కానీ పంచాయతీలో డబ్బులు లేవని చెబుతున్నారు.
- కళ్యాణ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, మెళియాపుట్టి
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
కొత్తమారడికోటలో అధికంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది. వెంటనే కొంతమందిని ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేసి మందులు అందించాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గ్రామస్థులందరికీ రక్త పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.
- జి.గణపతిరావు వైద్యాధికారి చాపర