బంద్‌పై జులుం
ABN , First Publish Date - 2021-10-21T05:51:07+05:30 IST
బంద్ నేపథ్యంలో జిల్లా అంతటా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. నేతలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధాలు చేయడంతో పాటు రోడ్లపైకి వచ్చిన వారిని అరెస్టులు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. అయినా వైసీపీ ప్రభుత్వ తీరు, పోలీసులు వైఖరిని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. అనేకచోట్ల పట్టణాలు, మండలకేంద్రాలు, ప్రధాన రహదారులపై ర్యాలీలు, రాస్తారోకోలు, బైఠాయింపులు ఇతర రూపాల్లో నిరసనలకు దిగారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతల నేతృత్వంలో ఆందోళనలు సాగాయి.

ఆరెస్టులు ....నిర్బంధాలు.. ప్రతిఘటనలు
అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు
అయినా రోడ్డెక్కి నిరసించిన టీడీపీ శ్రేణులు
జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, బైఠాయింపులు
బంద్ పాటించిన తెలుగు తమ్ముళ్ళు , పలుచోట్ల ఉద్రిక్తత
వైపీపీ ప్రభుత్వం, పోలీసులు తీరుపై ఆగ్రహం
ఒంగోలు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) :
-ఒంగోలులో బంద్‌ను విజయవంతం చేసే కార్యక్రమానికి దామచర్ల జనార్దన్ నేతృత్వం వహించగా, పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. స్థానిక బీకే ఎన్‌క్లేవ్‌లోని దామచర్లను ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బలవంతంగా అరెస్టు చేసి, తాలూకా స్టేషన్‌కు తరలించబోగా టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులకు, వారికి మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. తెలుగు మహిళలు డీఎస్పీ కారు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. కాగా బంద్ సందర్భంగా దర్శి ఇన్చార్జి పమిడి రమేష్‌ను ఒంగోలులో అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా ఆయనను విడుదల చేయాలంటూ వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఎదుట నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
- బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. నాగులపాలెంలో ఆయనను పోలీసులు చుట్టుముట్టి హౌస్ ఆరెస్టు చేశారు. అయినా పోలీసుల కట్టడిని ఛేదించుకుని బయటకొచ్చి పర్చూరుకు బయలుదేరిన ఏలూరిని ఎస్సై అడ్డుకున్నాడు. ఈనేపథ్యంలో తిరిగి మళ్ళీ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల దిగ్బంధాన్ని తప్పించుకుని ముందుకు సాగారు. పర్చూరు బొమ్మల సెంటర్లో టీడీపీ కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశారు. సీఐ అడ్డుకుని బొమ్మను లాక్కోవటంతో వరిగడ్డిని దహనం చేసి సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.
-అద్దంకిలో బంద్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రవికుమార్ ఉదయాన్నే చిలకలూరిపేట నుంచి బయలుదేరగా జొన్నతాళి సెంటరు వద్ద వాహనాలను భారీగా తరలివచ్చిన పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను సమీపంలోని గ్రానైట్ పరిశ్రమకు తరలించారు. విషయం తెలుసుకున్న శ్రేణులు భారీగా అక్కడకు చేరుకున్నారు. కాగా అద్దంకిలో వైసీపీ ర్యాలీకి అనుమతిచ్చి తమను అడ్డుకోవడం ఏమిటంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైవేపైకి వచ్చి బైఠాయించారు. ఈ సమయంలో ఎమ్మెల్యేను ఆపటానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఎమ్మెల్యే నిరసనతో హైవేపై కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
- ఇదీ పోలీసుల ఓవరాక్షన్ నిర్బంధాలు, అరెస్టులు, ప్రతిఘటనలు, తోపులాటల మధ్య బుధవారం సాగిన బంద్ తీరుతెన్ను. తెలుగుదేశం పార్టీ తలపెట్టిన నిరసన బంద్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ అర్ధరాత్రి నుంచే ముందస్తు నోటీసుల పేరుతో హౌస్ అరెస్టులకు తెరతీశారు. ఆ తర్వాతఅడుగడునా అడ్డగింతలతో అక్రమ అరెస్టులు చేసి, తమ ఓవర్ యాక్షన్ నిరూపించుకున్నారు. చాలామందిని బలవంతంగా స్టేషన్లకు తరలించారు. అయినా తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. తమ నిరసనాగ్రహాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. పలుచోట్ల ప్రజలు, వ్యాపారస్తులు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించడం గమనార్హం.
బంద్ నేపథ్యంలో జిల్లా అంతటా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. నేతలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధాలు చేయడంతో పాటు రోడ్లపైకి వచ్చిన వారిని అరెస్టులు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. అయినా వైసీపీ ప్రభుత్వ తీరు, పోలీసులు వైఖరిని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. అనేకచోట్ల పట్టణాలు, మండలకేంద్రాలు, ప్రధాన రహదారులపై ర్యాలీలు, రాస్తారోకోలు, బైఠాయింపులు ఇతర రూపాల్లో నిరసనలకు దిగారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతల నేతృత్వంలో ఆందోళనలు సాగాయి. కొన్నిచోట్ల ముఖ్యనేతలను పోలీసులు ఆరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేసినా కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి బంద్ పాటించారు. ఒంగోలులో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అయినా ఎదిరించి బంద్ చేసేందుకు బయలుదేరగా అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆ సందర్భంగా టీడీపీ మహిళా కార్యకర్తలు వాహనానికి అడ్డు నిలిపివేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అలాగే పార్టీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఎస్‌ఎన్‌పాడు మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, దర్శి టీడీపీ ఇన్చార్జి పమిడి రమేష్, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి దామచర్ల సత్యలను ఒంగోలులో గృహ నిర్బంధం చేశారు. మార్కాపురంలో తెల్లవారుజామున ఆర్టీసీ డిపో వద్ద ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వైపాలెం నిరసన ర్యాలీతో బంద్ చేపట్టిన ఎరిక్షన్‌బాబు, గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, దర్శిలో మాజీ ఎమ్మెల్యే పాపారావు తదితరులను గృహనిర్బంధంతో పాటు పోలీస్స్టేషన్లకు తరలించారు.
ద్వితీయ శ్రేణినీ అడ్డుకున్నారు..
టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని ఇతర పలు ప్రాంతాల్లో కార్యాలయాలపై వైసీపీ దాడులను ఖండిస్తూ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన బంద్ నేపథ్యంలో బుధవారం అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు ప్రభుత్వం తీరు, మరోవైపు పోలీసులు వైఖరిని నిరసిస్తూ మంగళవారం రాత్రి జిల్లావ్యాప్తంగా టీడీపీశ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. కొనసాగింపుగా బుధవారం బంద్‌కు టీడీపీ ఇచ్చిన పిలుపుతో తెల్లవారుజాము నుంచే ఆ పార్టీశ్రేణులు జిల్లా అంతటా బంద్ విజయవంతానికి పూనుకున్నారు. అయితే పోలీసులు అడుగడుగునా వారికి అడ్డంకులను కల్పించారు. ఒంగోలులో తెల్లవారుజామను ఆర్టీసీ డిపో వద్ద నగర టీడీపీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు నేతృత్వంలో ఆందోళనకు దిగిన కార్యకర్తలను అరెస్టు చేశారు. ఇతర పలుచోట్ల టీడీపీ ద్వితీయశ్రేణి నేతలను అరెస్టు చేశారు. నేతలను గృహనిర్భంధాలు, రోడ్లపైకి వచ్చిన వారిని అరెస్టులు చేసి బంద్‌ను విఫలం చేసే ప్రయత్నం చేసినా టీడీపీ కార్యకర్తలు పోలీసులు నిర్బంధాలను అధిగమించి బంద్‌ను పాటించారు. ఒకపక్క ముఖ్యనేతలను ముందుగానే పోలీసులు అరెస్టులు చేసి నిర్బంధించిన ఏమాత్రం భయపడకుండా పలుచోట్ల శ్రేణులు రోడ్డెక్కాయి. నగరంలో యువకులు బంద్‌ను పర్యవేక్షించారు. పోలీసులు గృహనిర్భాందాన్ని కార్యకర్తల అండతో ఛేదించి టీడీపీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్చూరులో జరిగిన బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగులపాలెంలో, పర్చూరులోను ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను జొన్నతాళి వద్ద ఫ్యాక్తరీలో పోలీసులు నిర్బంధం చేయగా అప్పటికే అక్కడకు చేరుకున్న నాయకులతో కలిసి జాతీయరహదారిపై ఆయన రాస్తారోకో చేశారు. కొండపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామిని ఉదయాన్నే తూర్పునాయుడుపాలెంలోని ఆయన స్వగృహంలో పోలీసులు నిర్బంధించగా పదిగంటలకు టీడీపీ శ్రేణులు, మండలస్థాయి నేతలు కలిసి బంద్ పాటించారు.
జిల్లా అంతటా నిరసనలు
కాగా అద్దంకి, చీమకుర్తి, కొండపి, కనిగిరి, దర్శి, పొదిలి, పామూరు, గిద్దలూరు, కంభం, వైపాలెం, సింగరాయకొండ, కందుకూరులతో పాటు దాదాపు అన్ని మండల కేంద్రాల్లోనూ ర్యాలీలు, రాస్తారోకోలు బైఠాయింపులతో తెలుగుతమ్ముళ్లు నిరసనలు తెలిపారు. అలాగే బ్యాంకులు, దుకాణాలు, విద్యాసంస్థలను మూతవేయించడంతో పాటు రవాణాను సైతం అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో టీడీపీ ముఖ్య నేతలు మాట్లాడుతూ నిరంకుశంగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వం, పోలీసులు, సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి నియంతలా మారారని, రాక్షస పాలన చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్లనే ప్రశ్నించే టీడీపీ నాయకులను బెదిరించి భయపెట్టాలని పార్టీ కార్యాలయాలపై దాడులు చేపిస్తున్నాడని ధ్వజమెత్తారు. అయితే ఆలాంటి వాటికి టీడీపీ భయపడదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షణకు, ప్రజల రక్షణకు నిలిచి పోరాడుతుందన్నారు.




