అధికారపార్టీ నేతల అరాచకం
ABN , First Publish Date - 2021-02-06T07:04:44+05:30 IST
‘టీడీపీకి ప్రచారం చేసినా, ఓట్లు అడిగినా కిడ్నాప్ చేస్తాం. ఓటు వేయకపోతే గ్రామంలో ఇబ్బంది పెడతాం. 10 ఏళ్ల నుంచి ఇంటిలో ఉన్నా ఏదో ఒక దారిలో ఖాళీచేయిస్తాం’ ఇదీ మార్టూరు మండలం డేగరమూడి గ్రామ పంచాయతీలో కొంతమంది అధికారపార్టీ నేతలు ప్రత్యక్షంగా టీడీపీ సానుభూతిపరులపై సాగిస్తున్న అరాచకం.

పథకాల పేరుతో వలంటీర్ల బెదిరింపులు
డేగరమూడిలో ఢీ అంటే ఢీ
గెలుపే లక్ష్యంగా వైసీపీ అడ్డదారులు
మార్టూరు, ఫిబ్రవరి 5: ‘టీడీపీకి ప్రచారం చేసినా, ఓట్లు అడిగినా కిడ్నాప్ చేస్తాం. ఓటు వేయకపోతే గ్రామంలో ఇబ్బంది పెడతాం. 10 ఏళ్ల నుంచి ఇంటిలో ఉన్నా ఏదో ఒక దారిలో ఖాళీచేయిస్తాం’ ఇదీ మార్టూరు మండలం డేగరమూడి గ్రామ పంచాయతీలో కొంతమంది అధికారపార్టీ నేతలు ప్రత్యక్షంగా టీడీపీ సానుభూతిపరులపై సాగిస్తున్న అరాచకం. వీటికి తోడు చాపకింద నీరులా కొంతమంది గ్రామ వలంటీర్లు అధికార పార్టీకి ఓటు వేయకపోతే పెన్షన్‌తో పాటు ఇతరత్రా సాయాలు అందవని బెదిరిస్తున్నారు. దాంతో ఈ గ్రామంలో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. సర్పంచ్ పదవి అన్ రిజర్వ్‌డ్ మహిళకు కేటాయించారు. గ్రామంలోని ఓట్లు 904. తెలుగుదేశం పార్టీ మద్దతుదారుగా బత్తుల అరుణ, వైసీపీ మద్దతుదారుగా జంపాని అంజమ్మలు పోటీపడుతున్నారు. ఇప్పటివరకు ఈ పంచాయతీలో టీడీపీ మద్దతుదారులు నాలుగుసార్లు గెలిచారు. టీడీపీకి గట్టిపట్టు ఉన్న గ్రామం. అయితే ఈ దఫా పంచాయతీని కైవసం చేసుకోవాలని వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని టీడీపీ సానుభూతిపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహిళలు వేధిస్తున్నారు
బత్తుల నాగరేణుక, డేగరమూడి
నాభర్త చనిపోయి ఆరునెలలైంది. కూలి పని చేసుకుంటున్నాను. ఇంటిస్థలం లేదు. పెన్షన్ రాలేదు. గ్రామంలో తల్లిదండ్రులు అద్దె ఇంటిలో ఉంటున్నారు. వారి ఇంటికి వెళ్లకూడదంటున్నారు. రాత్రి సమయంలో గోకులం కోసం నిర్మించిన గదుల్లో ఉన్నా వైసీపీకి ఓటు వేయాలని కొంతమంది మహిళలు బెదిరిస్తే, చర్చిలో తలదాచుకుంటున్నాను. అక్కడకు కూడా రాకుండా తాళం వేశారు. దాంతో గుడి బయట అరుగుపై నిద్రిస్తున్నాను.
పదేళ్ల నుంచి ఉంటున్న ఇంటిని ఖాళీ చేయమంటున్నారు
స్వర్ణ సాంబయ్య, డేగరమూడి
30 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి దగ్గర స్థలాన్ని కొనుగోలు చేసి, పదేళ్ల క్రితం అక్కడ రేకులషెడ్డును వేసుకొని ఉంటున్నా. ఇంటి పన్ను, కరెంటు బిల్లు కడుతున్నాను. అయితే స్థలాన్ని అమ్మినవారి కుటుంబసభ్యులు తెలంగాణ నుంచి వచ్చి, ఇల్లు ఖాళీచేయాలంటున్నారు. 30ఏళ్ల నాటి కాగితాలు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. 30 ఏళ్ల నుంచి రానివారు ఇప్పడు రావడం ఏమిటో వైసీపీ నాయకులకే తెలియాలి.
వైసీపీ వాళ్లు రెచ్చిపోతున్నారు
బాణాల రాంబాబు, టీడీపీ సానుభూతిపరుడు
డేగరమూడి గ్రామంలో అధికారపార్టీ వారు రెచ్చిపోతున్నారు. వారి బెదిరింపులతో గ్రామంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. పోలీసుల నిఘా ఉండాలి. ముఖ్యంగా ఓట్లు పోలింగ్ జరిగే 9వతేదీన ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేయాలి.