రహదారి కష్టం తీర్చరూ..?
ABN , First Publish Date - 2021-12-15T06:26:53+05:30 IST
మండలంలోని పడమటకట్టకిందపల్లి పంచాయతీ పరిధిలోని కందులవారిపల్లి గ్రామానికి వెళ్లే దారి అధ్వానంగా తయారైంది.

పామూరు, డిసెంబరు 14: మండలంలోని పడమటకట్టకిందపల్లి పంచాయతీ పరిధిలోని కందులవారిపల్లి గ్రామానికి వెళ్లే దారి అధ్వానంగా తయారైంది. దీంతో గ్రామస్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామానికి సరైన రహదారి సౌకర్యం ఏర్పాటు చేయడంలో పాలకులు దృష్టి సారించలేదు. దీంతో కష్టాలు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. పక్కారోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా కాంట్రాక్టరు రహదారి నిర్మించలేదు. కేవలం వంకపై చప్టా నిర్మించారే తప్పా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. చప్టా వద్ద వేసివున్న గ్రావెల్ ఇటీవల కురిసిన వర్షాల తాకిడికి మట్టి కోసుకుని పోవడంతో నడిచేందుకు సైతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోకి పాల ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు వీలులేక పోవడంతో ప్రజలు అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని గ్రామస్థులు పేర్కొంటున్నారు.