మగ్గం.. మాయం

ABN , First Publish Date - 2021-08-07T06:59:24+05:30 IST

చేనేత గుంటమగ్గాల చప్పుళ్లు క్రమేణా ముగబోతున్నాయి. దశాబ్దం క్రితం జిల్లాలో సుమారు 21వేల పైచిలుకు మగ్గాలు ఉండేవి.

మగ్గం.. మాయం

సొసైటీల కనికట్టు  

కాగితాల్లోనే లావాదేవీలు

గుడ్డిలో మెల్లగా నేతన్ననేస్తం 

ఉపవృత్తులకు మొండిచెయ్యి

వృత్తివారసత్వం బిడ్డలకు ఇవ్వబోమంటున్న  నేతన్నలు

నేడు చేనేత దినోత్సవం 

చేనేత సృజనకు మారుపేరు. గతం ఘనం .. వర్తమానం అంతంతమాత్రం ... భవిష్యత్‌ అంధకారం... దశాబ్దకాలంలో జిల్లాలో చేనేత మగ్గాల సంఖ్య మూడో వంతుకు పడిపోవటం అందుకు నిదర్శనం. ఓ వైపు మరమగ్గాలు.. మరోవైపు చేనేత ముసుగులో మిషన్లపై తయారవుతున్న వస్త్రాలు... బోగస్‌ చేనేత సొసైటీలు.. ఇలా క్రమంగా సంప్రదాయ మగ్గాలు మాయమవుతున్నాయని ఆ రంగంలో సుదీర్ఘకాలం పనిచేసినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా నేతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చివరకు కులవృత్తిని తమ వారసులకు ఇచ్చేందుకు వారు సుముఖంగా లేరంటే  పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.. 

చీరాల, ఆగస్టు 6 : చేనేత గుంటమగ్గాల చప్పుళ్లు క్రమేణా ముగబోతున్నాయి. దశాబ్దం క్రితం జిల్లాలో సుమారు 21వేల పైచిలుకు మగ్గాలు ఉండేవి. అందులో సింహభాగం చీరాల ప్రాంతంలోనే కనిపించేవి. అయితే ప్రస్తుతం జిల్లాలో ఆ సంఖ్య 7,070కు పడిపోయాయి.  ఎక్కువశాతం మంది నేతన్నలు వృత్తిని వదిలేస్తున్నారు. ఇతర కూలిపనులు చేస్తుండటంతో పాటు కొందరు వలసలు పోతున్నారు.  


అవుట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ పేరుతో ధర కోత

వస్త్రం ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచి మేరకు తయారవ్వాలి. అయితే మగ్గంపై ఒకరకం నుంచి మరో రకం నేత  నేసేందుకు సామగ్రిని మార్చాలంటే చాలా ఖర్చవుతుంది. అయితే సగటు చేనేత కార్మికుడు రెండు, మూడు నెలలకొకసారి అలా మార్పులు చేయాలంటే కష్టతరం. దీంతో వారు తయారుచేసిన వస్త్రాలను షావుకార్లు అవుట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ పేరుతో ధరను తగ్గించి నియంత్రిస్తారు. ఇది ఒక కారణమైతే మిషన్లపై చేనేత ముసుగులో పెద్దసంఖ్యలో వస్త్రాలు తయారీ కావటం మరో కారణం. కచ్ఛితమైన చేనేత వస్త్రం ధర ఎక్కువ ఉంటుంది. చేనేత ముసుగులో మిషన్లపై తయారైన వస్త్రాలు తక్కువ ధరకు వినియోగదారునికి చేరతాయి. వాటి వ్యత్యాసం ఎక్కువమంది వినియోగదారులకు తెలీదు. దీంతో కొనుగోలుదారులు వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతారు. ఇది మరో కారణం. ఈ క్రమంలో ఆ రంగంను వీడి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు అడుగులు వేయటంతో మగ్గాలు క్రమేణా మూగబోతున్నాయి. చేనేత వృత్తిపరంగా తమ వారసత్వాన్ని తమ బిడ్డలకు ఇవ్వబోమని ఆ రంగంలో సుదీర్ఘకాలం పనిచేసిన వారు తెగేసి  చెప్తున్నారు.  జిల్లాలో సుమారు 78 చేనేత సొసైటీలు ఉన్నాయి. అందులో 32 చీరాల నియోజకవర్గంలోనే ఉన్నాయి. వీటిలో పనిచేసేవి కొన్ని మాత్రమే. అయితే ఆయా సొసైటీలలో కాగితాలపైన మాత్రమే మగ్గాలు ఉంటాయి. ప్రభుత్వపరంగా అందే రాయితీలన్నీ సొసైటీలకు అందుతుంటాయి. నూలు సబ్సిడీ, కొనుగోలు రాయితీ వరకు అంతా సొసైటీలకే చేరుతుంది. అవన్నీ పక్కదారి పడుతున్నాయని ఆరోపణలున్నాయి.


ఉపవృత్తుల వారికి వర్తించని నేస్తం

ప్రభుత్వపరంగా అందిస్తున్న నేతన్న నేస్తంలో లబ్ధిదారులకు ఏడాదికి రూ.24వేలు వారి ఖాతాల్లో జమవుతున్నాయి. ప్రస్తుతానికి ఇది గుడ్డిలో మెల్లగా వారికి కొంతమేర ఉపయోగపడుతోంది. అయితే మగ్గాలు ఉండి సాంకేతిక కారణాలతో కొందరికి, చేనేత ఉపవృత్తుల వారికి మొండిచెయ్యి చూపారు. దీంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా ఆ పథకాన్ని వర్తింపచేయాలని కోరుతున్నారు.


Updated Date - 2021-08-07T06:59:24+05:30 IST