మమ అనిపిస్తారో..చర్చిస్తారో!

ABN , First Publish Date - 2021-12-19T07:13:57+05:30 IST

జడ్పీ సమావేశంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను చూపిస్తారో.. లేక ఏదో నిర్వహిం చాంలే అన్నట్లుగా చర్చ లేకుండా మమఅనిపిస్తారోననే అనుమానాలు జిల్లావాసులను వెంటాడుతున్నాయి.

మమ అనిపిస్తారో..చర్చిస్తారో!
ఒంగోలులోని జడ్పీ కార్యాలయం

సమస్యలకు పరిష్కారం దొరికేనా?

జడ్పీని వేధిస్తున్న నిధుల లేమి

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పారిశుధ్యం, నీటి సరఫరా అధ్వానం

ఒంగోలు(జడ్పీ), డిసెంబరు 18: జడ్పీ సమావేశంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను చూపిస్తారో.. లేక ఏదో నిర్వహిం చాంలే అన్నట్లుగా చర్చ లేకుండా మమఅనిపిస్తారోననే అనుమానాలు జిల్లావాసులను వెంటాడుతున్నాయి. అందుకు ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులే కారణం. దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జడ్పీ పాలకవర్గం గత సెప్టెంబరు 25న కొలువుదీరింది. నిబంధనల ప్రకారం మూడు నెలల్లోపు సర్వసభ్య సమావేశం, రెండునెలల్లోపు స్థాయీసంఘాల ఎన్నిక పూర్తికావాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో వాయిదా వేశారు. ఎట్టకేలకు ఆదివారం తొలి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులోనే స్థాయీసంఘాల ఎన్నికను కూడా పూర్తి చేయనున్నారు.


రోడ్ల మరమ్మతుల ఊసే కరువు

జిల్లావ్యాప్తంగా పంచాయతీల పరిధిలో ఉన్న 750 కిలోమీటర్ల మేర రోడ్లకు మరమ్మతులు చేయాల్సిన ఉంది. దీనిపై గతంలోని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇంతవరకూ వాటిపై కదలిక లేదు. ప్రతిపాదనలు పంపిన వాటిలో బీటీరోడ్లతోపాటు మెటల్‌రోడ్లు కూడా ఉన్నాయి. గ్రామాల నుంచి మండల, పట్టణ కేంద్రాలను కలుపుతూ నిర్మించిన రహదారులు సైతం అత్యంత దారుణంగా తయారై ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి.


గ్రామీణులకు అందని మంచినీరు

జిల్లాలోని పశ్చిమప్రాంతంలో ఉన్న అత్యధిక గ్రామాలు వేసవిలో మంచినీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికితోడు సిబ్బందికి తొమ్మిది నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో జల పరీక్షలు సైతం పడకేసి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో 24,579 చేతిపంపులు ఉంటే దాదాపు 3,000కుపైనే నిరుపయోగంగా మారాయి. ఇవికాక గ్రామీణ ప్రజల నీటి అవసరాలు తీర్చడానికి 2,876 రక్షిత పథకాలు ఉన్నాయి. గత సంవత్సరం నివర్‌ తుఫాన్‌ నుంచి తాజాగా కురిసిన అకాల వర్షాల వరకు ఆ పథకాల పనితీరుపై డ్రైవ్‌ నిర్వహించిన దాఖలాలు లేవు. వీటన్నింటి పనితీరుపై సమగ్రంగా చర్చించి నీటి సరఫరా అందించే పైపులైన్‌లకు తక్షణమే మరమ్మతులను చేపట్టాల్సిన అవసరముంది.


ఆర్థిక సంఘం నిధులే గతి

జడ్పీకి ఆర్థిక సంఘం నిధులు తప్ప రాష్ట్రప్రభుత్వం తోడ్పాటే కరువైంది. దీనికితోడు సీనరేజీ బకాయిలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం అన్నీ కలిపి జిల్లా పరిషత్‌లో రూ.20కోట్లలోపే నిధుల లభ్యత ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.436కోట్ల సీనరేజీ బకాయిలు ఏళ్ల తరబడి జడ్పీకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సీఈవోగా కైలాస్‌ గిరీశ్వర్‌ ఉన్నప్పుడు ఈ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ప్రస్తుతం పాలకవర్గం కూడా కొలువుదీరినందున వీటి విడుదల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే జిల్లాలోని గ్రామాలకు మౌలిక సదుపాయాలను కల్పించే వీలుంటుంది.


రూ.కోట్లలో బకాయిలు

రహదారులు, మంచినీరు, పారిశుధ్య సంబంధమైన పనులకు బిల్లులు వెంటనే విడుదల చేస్తారన్న భరోసా గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి కాంట్రాక్టర్లను రకరకాల కారణాలతో వేధిస్తూ రూ.కోట్ల బిల్లులను పెండింగ్‌లో ఉంచింది. దీంతో కొత్త పనులకు టెండర్లు వేసే నాథుడే కరువయ్యాడు. బిడ్లు పిలవడం... స్పందన లేకపోవడం...మళ్లీ పిలవడం దీంతోనే నెలలు గడిచిపోతున్నాయి తప్ప పల్లెల్లో కనీస వసతుల కల్పన జరగడం లేదు.


స్థాయీసంఘాల ఎన్నిక కూడా నేడే... 

జడ్పీ పాలనలో స్థాయీ సంఘాలు చాలా కీలకమైనవి. వాటి ఎన్నికలను కూడా సర్వసభ్య సమావేశంలోనే పూర్తిచేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం ఏడు సంఘాలకు చైర్మన్లను, సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ సంఘాలు రెండు నెలలకొకసారి సమావేశమై వాటి పరిధిలోని అభివృద్ధి పనుల పురోగతిపై నివేదికను పాలకవర్గానికి అందించాల్సి ఉంది. పాలకవర్గం పరిధిలో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించడం, లేని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం చేయాల్సి ఉంటుంది.


ముందస్తు సమీక్ష నిర్వహించిన జడ్పీ చైర్‌పర్సన్‌

జడ్పీ సమావేశం నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో స్థానిక కార్యాలయంలోని తన చాంబరులో చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ శనివారం ముందస్తు సమీక్ష నిర్వహించారు. ఆదివారం జరగబోయే సర్వసభ్య సమావేశానికి ఏయే నివేదికలతో హాజరుకావాలో ఈ సమీక్షలో చర్చించారు. సమగ్ర వివరాలతో సర్వసభ్య సమావేశానికి హాజరుకావాలని ఆమె అధికారులను ఆదేశించారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి రూ.22.97కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదనలను సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. విద్య, వైద్య, ఉపాధి హామీ, వ్యవసాయం, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇతర విభాగాల అధికారులందరూ పూర్తి సన్నద్ధతో సమావేశానికి రావాలని వెంకాయమ్మ ఆదేశించారు. సమీక్షలో మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, సీఈవో జాలిరెడ్డి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ, అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-19T07:13:57+05:30 IST