రాళ్లపాడుకు సోమశిల జలాలు అందిస్తాం
ABN , First Publish Date - 2021-10-29T06:24:49+05:30 IST
సోమశిల ఉత్తర కాలువ వెడల్పు పనులు పూర్తయితే వచ్చే సీజన్ నుంచి రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరందిస్తామని చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు.
చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసులురెడ్డి
లింగసముద్రం, అక్టోబరు 28 : సోమశిల ఉత్తర కాలువ వెడల్పు పనులు పూర్తయితే వచ్చే సీజన్ నుంచి రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరందిస్తామని చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. ఏడాదిలో ఒకే నెలలోనే నీరు నిండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో సీఈ శ్రీనివాసులురెడ్డి, జిల్లా ఇరిగేషన్ ఎస్‌ఈ కే.లక్ష్మీరెడ్డి, ప్రాజెక్టు ఈఈ శరత్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టులోని నీటిమట్టాన్ని పరిశీలించారు. పాత, కొత్త స్పిల్ వేలను, హయ్యస్ట్ బ్రిడ్డిపై ఉన్న గేర్ బాక్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొత్త స్పిల్ వేను తనిఖీ చేసేందుకు వచ్చినట్టు చెప్పారు. ఇటీవలి వరకు సోమశిల ఉత్తర కాలువ వెడల్పు పనులు జరిగాయన్నారు. ప్రస్తుతం సోమశిల నీరు రాళ్లపాడు ప్రాజెక్టుకు విడుదల చేసినందున కాలువ వెడల్పు పనులు నిలిచిపోయాయన్నారు. ఈ సీజన్ ముగిసిన తర్వాత కాలువ వెడల్పు పనులు తిరిగి ప్రారంభమౌతాయన్నారు. అలాగే ప్రాజెక్టు ఎడమ కాలువ పొడిగింపు పనులకు నిధులు మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. పరిపాలనా పరమైన అనుమతులు వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
వారం రోజుల్లో సోమశిల జలాలు
వారం రోజుల క్రితం సోమశిల జలాలను రాళ్లపాడు ప్రాజెక్టుకు విడుదల చేశారని చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసులురెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఆ నీరు నెల్లూరు జిల్లాలోని రాజోలు చెరువు వరకు వచ్చాయన్నారు. మరో వారం రోజులలో ప్రాజెక్టుకు నీరు వస్తుందన్నారు. ప్రాజెక్టులోని పాత స్పిల్‌వే గేట్లను వచ్చే ఏడాది వేసవి కాలంలో పని చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రాజెక్టులోని సిబ్బంది కొరత గురించి ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఈ వర్షాకాలంలో ప్రాజెక్టులోకి వరద నీరుచేరితే, ఆ నీటిని మన్నేరుకు విడుదల చేసేందుకు వీలుగా కొత్తగేట్లను సిద్ధం చేయాలని ఈఈ శరత్‌కుమార్‌రెడ్డిని ఆదేశించారు. ఈ గేట్లకు ఆయిల్, గ్రీజు పట్టించాలన్నారు. అలాగే ఏవైనా కరెంటుకు సంబంధించిన పనులు, చిన్న చిన్న మరమ్మత్తులు ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు డీఈలు హజరత్తయ్య, లక్ష్మీనారాయణ, ఏఈలు, సిబ్బంది ఉన్నారు.