జల ఘోష

ABN , First Publish Date - 2021-09-02T06:40:09+05:30 IST

జిల్లాలో నీటి సంక్షోభం నెలకొంది. చుట్టూ నీరున్నా మనకు మాత్రం సున్నానే.

జల ఘోష
వెలిగొండ రెండో టన్నెల్‌

నీటిపారుదల రంగంపై నీలినీడలు 

సాగర్‌ ఆయకట్టులో మాగాణికి నో చెప్పిన యంత్రాంగం

డ్యాంలు నిండి సముద్రానికి పోతున్న నీరు

అయినా జిల్లాలో వరి సాగుకు మాత్రం ఇవ్వరు 

గుండ్లకమ్మ, రామతీర్థం, కొరిశపాడు పథకాల ఉనికి ప్రశ్నార్థకం

వివాదంలో వెలిగొండ నిర్మాణం, నీటి లభ్యత

కరువు, వర్షాభావంతో అక్కరకు రాని ఇతర వనరులు

ప్రభుత్వ ఉదాసీనతతో జిల్లా భవిష్యత్‌ అయోమయం 

అనుకున్నంతా అయ్యింది. విభజన అనంతరం దిగువ రాష్ట్రంగా ఉండే ఆంధ్రప్రదేశ్‌కు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని సమైక్యవాదులు, సాగునీటి రంగ నిపుణులు నాడు ఆందోళన వ్యక్తం చేసిన విధంగానే ప్రస్తుతం జలఘోష నెలకొంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నా, మన జిల్లా విషయంలో మాత్రం అది అక్షర సత్యంగా కనిపి స్తోంది. సాగు, తాగునీటికి జిల్లాలోని అత్యధిక ప్రాంతాలకు మేలు చేస్తున్న సాగర్‌ కుడికాలువకు ఏటికేడు తగ్గుతున్న నీటి సరఫరా ఆందోళన కలిగిస్తోంది. అలాగే గుండ్లకమ్మ ప్రాజెక్టుతోపాటు రామతీర్థం, కొరిశపాడు ఎత్తిపోతల వంటి పథకాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా ప్రజల వరప్రసాదమైన వెలిగొండకు నీటి లభ్యత, నిర్మాణం వివాదంలో పడింది. చిన్న, మధ్యతరహా నీటి వనరులు చూస్తే అధ్వానంగానే ఉంటున్నాయి. భూగర్భజలాలు అడుగంటి బోర్ల కింద సాగు తగ్గిపోతోంది. దీంతో చాలావరకు రైతులు సాగును వదిలేస్తున్న పరిస్థితి. ఇంత జరుగుతున్నా పాలకపక్షం మౌనముద్ర వీడకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

జిల్లాలో నీటి సంక్షోభం నెలకొంది. చుట్టూ నీరున్నా మనకు మాత్రం సున్నానే. అవసరమైతే ఆరుతడికి ఇస్తారు. ప్రాజెక్టులను మాత్రం పట్టించుకోరు. ఇదీ సర్కారు జిల్లాపై చూపుతున్న నిర్లక్ష్య ధోరణి. జిల్లాలో ప్రధాన సాగు, తాగునీటి వనరుగా ఉన్న సాగర్‌ కుడికాలువ కాగా ఆ నీరు రాక ప్రారంభం నుంచి పూర్తిస్థాయిలో ఎప్పుడూ సరఫరా జరిగింది లేదు.  కుడికాలువ పరిధిలో సుమారు 4.42లక్షల ఎకరాలు ఉండగా, జిల్లాకు రావాల్సిన వాటా మేరకు నీరు రాక లక్ష ఎకరాలు దిగువ భూములలో వర్షాధార సేద్యం సాగుతోంది. మిగిలిన 3.40లక్షల ఎకరాల్లో సగం మాగాణి, సగం ఆరుతడి సాగవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా నీటి సమస్యలు వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డ్యాం కనిష్ఠ మట్టం నుంచి కూడా నీటిని తెచ్చుకొని కనీసం తాగునీటి అవసరాలైనా తీర్చుకున్న అనుభవం ఉంది. అలాంటిది ప్రస్తుతం కృష్ణానదిపై రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం, సాగర్‌ డ్యాములు నిండి వందల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతున్నా జిల్లాలోని సాగర్‌ ఆయకట్టుకు సాగునీరు గ్యారెంటీగా ఇవ్వలేని దుస్థితి నెలకొంది.


జిల్లాకు తీవ్ర అన్యాయం

జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలు అలాగే నీటి వృథా కలిపి సుమారు 72 టీఎంసీలు అవసరమని అంచనా. అందులో కనీసం 69 టీఎంసీలు అయినా ఇస్తేనే అవసరాలు తీరుతాయి. విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం జల జగడంతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ సాగర్‌ కాలువల నీటి సరఫరా గందరగోళంలో పడింది. అందులో అధిక నష్టం జిల్లాకు జరుగుతోంది. తీవ్ర కరువుతో 2018లో కేవలం 32 టీఎంసీలు మాత్రమే సాగునీరు అందగా పంటల సాగు సరిలేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక పుష్కలంగా వర్షాలు కురిసి డ్యాములు నిండినా 2019లో జిల్లాకు 58.2 టీఎంసీలు, 2020లో సుమారు 63 టీఎంసీలు నీరు వచ్చినా పలుమార్లు అటు మాగాణి, ఇటు ఆరుతడి పంటలకు అందక ఇక్కట్లు పడాల్సి వచ్చింది. గతంలో 3.40 లక్షల ఎకరాల వరకు సాగు జరుగుతుండగా గతేడాది 1.25లక్షల ఎకరాల్లో మాగాణి 1.80లక్షల ఎకరాల్లో ఆరుతడి సాగు చేసినట్లు అధికార లెక్కలు తెలియజేస్తున్నాయి.

 

ఆరుతడి పంటలే వేయండి

ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈనెల తొలివారంలోనే శ్రీశైలం, సాగర్‌ డ్యామ్‌లు నిండి నీరు సముద్రంలోకి పోయినా కృష్ణానది నీటిని పంపిణీ చేసే కేఆర్‌ఎంబీ మాత్రం గతంలో ఉన్న మాదిరిగానే కుడి కాలువకు 132 టీఎంసీలు ఇచ్చింది. అందులో 52 టీఎంసీలు మాత్రమే జిల్లాకు ఇస్తారన్న సంకేతాలు అందాయి. దీంతో జిల్లా యంత్రాంగం ఏకంగా ప్రస్తుత సీజన్‌లో మాగాణి అవసరం లేదని, కేవలం ఆరుతడి పంట లు మాత్రమే సాగు చేసుకోవాలని ప్రకటించింది. దీంతో దశాబ్దకాలంగా సాగర్‌ ఆయకట్టు ప్రాంతంలోని 400కుపైగా గ్రామాల్లో సాగవుతున్న మాగాణి అయోమయంలోపడటంతోపాటు దాని ఆధారంగా గ్రామీణ ప్రాంతంలో రెండో ప్రధాన వృత్తిగా ఉన్న పాడిపరిశ్రమతోపాటు కూలీలకు దొరికే లక్షలాది పని దినాలు ప్రమాదంలో పడను న్నాయి. భవిష్యత్‌లో నీటి పంపిణీ పూర్తిగా కేంద్రం చేతుల్లోకి పోనుండటంతో ఇక సాగర్‌ కాలువల్లో నీటి సరఫరాపై ఏటా ఇలాంటి పరిస్థితులే నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. 


వివాదాల సుడిలో వెలిగొండ

మరోవైపు జిల్లావాసుల ఆశాజ్యోతి అయిన వెలిగొండ ప్రాజెక్టు వివాదంలో పడింది. మరో రెండు, మూడేళ్లుకు అయినా నీటిని చూస్తామన్న ఆశలు కలుగుతున్న సమయంలో ప్రాజెక్టు భవిష్యత్‌ను తెలంగాణ ప్రభుత్వం వివాదం చేస్తుండగా, మన ప్రభుత్వం ఉదాసీనంగా వ్యహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మిగులు జలాల ఆధారంగా 53.50టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే జిల్లాలోని 3.36లక్షల ఎకరాలతోపాటు కడప, నెల్లూరు జిల్లాలు కలిపి మొత్తం 4.43 లక్షల ఎకరాలకు సాగునీరు, 15లక్షల మందికి తాగునీరు అందుతుంది. రూ.8,300కోట్ల వ్యయ అంచనా కాగా ఇప్పటికే దాదాపు 5.5వేల కోట్లు ఖర్చు చేశారు. తొలి టన్నెల్‌ తవ్వకం పూర్తయి నీరు తీసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పునరావాసం అడ్డంకిగా మారింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం నీటి విషయంలో గిల్లికజ్జాలు వెలిగొండకు నీటి లభ్యతను వివాదం చేస్తోంది. ఈ నేపత్యంలో ఇటీవల కేంద్రం ప్రకటించిన గజిట్‌లో వెలిగొండను అన్‌ అప్రూవుడ్‌ ప్రాజెక్టుగా పేర్కొంది. దీనిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్‌కు ఒకటికి, రెండు లేఖలు రాసినా రాష్ట్రప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు  ్యవహరిస్తోంది.


మిగతా ప్రాజెక్టులకూ అంతే

జిల్లాలో 80వేల ఎకరాల ఆయకట్టు, ఒంగోలు నగరంతోపాటు అనేక గ్రామాల తాగునీటి కోసం ఇంచుమించు రూ.745కోట్ల వ్యయంతో నిర్మించిన గుండ్లకమ్మ ప్రాజెక్టు సామర్థ్యం 3.89టీఎంసీ లు కాగా నాలుగుసార్లు నిండితేనే లక్ష్యం మేర నీటి సర ఫరా జరిగేది. అందులో అధిక భాగం సాగర్‌ కాలువల వృఽథా నీరే ఆధారం. జిల్లాలో వర్షాభావం పరిస్థితి చూస్తే గుండ్లకమ్మ ఉనికి ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. అలాగే గుండ్లకమ్మ దిగువన  20వేల ఎకరాలకు సాగునీరు అందించేలా సుమారు రూ.177 కోట్లతో చేపట్టిన కొరిశపాడు ఎత్తిపోతల, రామతీర్థం ప్రాజెక్టుల పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. జిల్లాలో పూర్వం నుంచి ఉన్న 953 చిన్న, మరో 5 మధ్య తరహా ప్రాజెక్టుల కింద  1.75లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా సగం కూడా సాగుకావడం లేదు. ఒక్క రాళ్లపాడు, అప్పుడప్పుడూ కంభం చెరువు కింద మినహా ఎక్కడా సాగు సరిగా లేదు. ఇక భూగర్భజలాలు అడుగంటిపోయి ఇప్పటికే బోర్ల కింద సాగు దాదాపు నిలిచిపోయింది.


సర్కారు ఉదాసీనతే వారికి అలుసు 

వెలిగొండకు జరిగిన అన్యాయంపై సీఎం, జిల్లా మంత్రులు నోరు మెదపడం లేదు. దీనిని ఆసరా చేసుకుని  ప్రాజెక్టుకు నీటి కేటాయింపు చేయరాదని, నిధులు ఇవ్వరాదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణం, నీటి లభ్యత గందరగోళంలో పడింది. దీనివల్ల పశ్చిమ ప్రాంత సాగు, తాగునీటి భవిష్యత్‌ అంధకారమై ఎడారిగా మారే ప్రమాదం కనిపిస్తోంది. వెలిగొండ ఆధారంగా మంజూరు చేసిన రూ. వేల కోట్ల తాగునీటి పథకాల మనుగడ ప్రశ్నార్థకమవు తుంది. ఇంత జరుగుతున్నా బాధ్యత కలిగిన అధికారపక్షం మౌన ముద్ర వీడటం లేదు. జిల్లాలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మరింత చొరవ తీసుకుని కీలకమైన గెజిట్‌లో వెలిగొండ చేర్చాల్సిన అవసరాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఆ మేరకు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరు సాంబశివరావు, డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్ల నేతృత్వంలో మంగళవారం ఆ పార్టీ ముఖ్యనేతలంతా ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంతి షెకావత్‌ను కలిసి వినతిపత్రం అందజేసి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు టీడీపీ నేతలు తీసుకున్న చొరవ అభినందించదగినదైనప్పటికీ ఇతర పార్టీలను, పౌరసమా జాన్ని కలుపుకొని జిల్లా ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.Updated Date - 2021-09-02T06:40:09+05:30 IST