ఓబీసీలో పెరిగిన నీటి ప్రవాహం

ABN , First Publish Date - 2021-05-18T06:51:25+05:30 IST

మంచినీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్‌ జలాలు నీటి పరిమాణం సోమవారం ఘననీయంగా పెరిగింది.

ఓబీసీలో పెరిగిన నీటి ప్రవాహం
ఓబీసీలో ప్రవహిస్తున్న సాగర్‌ జలాలు

దర్శి, మే 17 : మంచినీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్‌ జలాలు నీటి పరిమాణం సోమవారం ఘననీయంగా పెరిగింది. ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు(ఓబీసీ) పుష్కలంగా నీరు సరఫరా అవుతుండటంతో రామతీర్ధం జలాశయంకు చేరుతోంది. ప్రస్తుతం సాగర్‌ డ్యాం నుండి కుడికాలువకు 2236 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా బుగ్గవాగుకు చేరుతుంది. బుగ్గవాగు నుండి సాగర్‌ ప్రధాన కాలువకు 2456 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. ఆ నీటిని సాగర్‌ ప్రధాన కాలువ 85/3వ మైలు(పకాశం బార్డర్‌కు) 1839 క్యూసెక్కులు, దర్శి బ్రాంచ్‌ కాలువకు 1160 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు 846 క్యూసెక్కుల నీరు పంపిణీ జరుగుతోంది. ప్రస్తుతం ఓబీసీకి విడుదల అవుతున్న నీటిని పూర్తిగా రామతీర్ధం జలాశయంకు నింపుతున్నారు. సాగర్‌ కాలువలపై మేజర్లు ఎత్తకుండా ఎన్‌ఎస్‌పీ అధికారులు, సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. వారం రోజులు పాటు రామతీర్ధం జలాశయంకు నింపిన తర్వాత జిల్లాలోని మంచినీటి చెరువులకు నీరు నింపేందుకు  మేజర్లకు నీరు విడుదల చేస్తారు. 

దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలి 

 మంచినీటి చెరువులకు నీరు నింపేందుకు మేజర్లకు నీరు విడుదల చేసినప్పుడు ప్రతిసారీ అధికశాతం నీరు దుర్వినియోగం అవుతుంది. చేపల పాటదారులు చెరువులకు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం నాలుగు నెలలుగా వర్షం లేకపోవటంతో అన్నిరకాల చెరువుల్లో నీరు అడుగంటింది. దీంతో చేపల చెరువులకు నీరు నింపుకునేందుకు నిర్వాహకులు తమ వంతు ప్రయత్నాలు కొనసాగించే అవకాశం ఉంది. గతంలో తాగునీటి అవసరాలకు నీరు విడుదల చేసినప్పుడు కొందరు అధికారులు, సిబ్బంది లోపాయికారికంగా చేపల చెరువులకు నీరు విడుదల చేశారు. ఆ సమయంలో దర్శి ప్రాంతంలో చేపల చెరువులు నిండాయి కాని మంచినీటి చెరువులకు పూర్తిగా నీరు చేరలేదు. ఆ సమయంలో ప్రజల నుండి ఫిర్యాదులు అందటంతో ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈసారి కూడా అధికారులు అప్రమత్తంగా లేకపోతే సాగర్‌ జలాలు చేపల చెరువులకు వెళ్లే ప్రమాదముంది. తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్‌ జలాలు దుర్వినియోగం కాకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2021-05-18T06:51:25+05:30 IST