గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-09T06:18:57+05:30 IST

జిల్లాలో పలుచోట్ల దారుణాలకు పాల్పడుతూ సంచరిస్తున్న వారిని ఎదుర్కొని పోలీసులకు అప్పగించడానికి గ్రామాల్లో గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ కండె శ్రీనివాసరావు అన్నారు.

గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసుకోవాలి
అవగాహన కల్పిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు

పామూరు, డిసెంబరు 8:  జిల్లాలో పలుచోట్ల దారుణాలకు పాల్పడుతూ సంచరిస్తున్న వారిని ఎదుర్కొని పోలీసులకు అప్పగించడానికి గ్రామాల్లో గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ కండె శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని అబ్దుల్‌ కలాం కూడలిలో చెడ్డిగ్యాంగ్‌ వివరాలు గురించి బుధవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరుడు గట్టిన చెడ్డిగ్యాంగ్‌ బృందం ప్రవేశించిందన్నారు. అలాంటి గ్యాంగ్‌ మన ప్రాంతాల్లో వచ్చిందన్న సమాచారం నిమిత్తం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి గ్రామ రక్షక దళాలుగా ఏర్పడి పహారా నిర్వహించాలని డీఎస్పీ సూచించారు. అదేవిధంగా మోపాడు గ్రామంలో కూడ చెడ్డి గ్యాంగ్‌ గురించి అవగాహన కల్పించారు. డిఎస్పీ వెంట సీఐ కొండవీటి శ్రీనివాసరావు, ఎస్‌ఐ కె సురే్‌షలు ఉన్నారు. 

ఉలవపాడు : ఇళ్లలోకి చొరబడి హత్యలు, దోపిడీలు చేసే ముఠా జిల్లాలో ప్రవేశించనందున మండల ప్రజలు ఎల్లవేళల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై టీ త్యాగరాజు సూచించారు. నివాస ప్రాంతాల్లో, గ్రామాల్లో గుర్తు తెలియని కొత్త వ్యక్తులు, అనుమానితులు ఏ వేషధారణలో ఉన్నా వేంటనే స్ధానిక పోలీసులకు కానీ, 100 ద్వారా, దిశా ఎస్‌ఓఎస్‌ ద్వారా కానీ సమాచారం అందిచాలని కోరారు. యువకులంతా ఆయా గ్రామాల్లో పగలు, రాత్రులు గస్తీ నిర్వహించాలన్నారు.

తాళ్లూరు : దోపిడి దొంగలు పలుప్రాంతాల్లో అఘాయిత్యాలకు పాల్పడుతున్నందున గ్రామాల్లో కొత్తవ్యక్తులు సంచరిస్తుంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై బి.నరసింహారావు తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలకు  నేరప్రవృత్తిపై బుధవారం అవగాహన కల్పించారు. గ్రామాల్లో కొందరు  కొత్త వ్యక్తులు వ్యాపారాల పేరిట వివిధ రకాలుగా వస్తుంటారన్నారు. ప్రధానంగా మహిళలువీధుల్లో తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి వాటిని లక్ష్యంగా చేసుకుని దోపిడికి పాల్పడుతున్నట్లు సమాచారం వుందన్నారు. గ్రామాల్లో అనుమానిత, అసాంఘీక కార్యక్రమాల వివరాలు, ఇతర సమాచారం తెలిపినవారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. మహిళలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. 

Updated Date - 2021-12-09T06:18:57+05:30 IST