వైసీపీ వాళ్ల బెదిరింపులతోనే వెంగయ్య ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-20T06:37:38+05:30 IST

వైసీపీ కార్యకర్తల బెదిరింపులతోనే బండ్ల వెం గయ్య (40) ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిం చారు.

వైసీపీ వాళ్ల బెదిరింపులతోనే వెంగయ్య ఆత్మహత్య
వెంగయ్య అంతిమయాత్రలో పాల్గొన్న జనసేన నాయకులు

కుటుంబసభ్యుల ఆరోపణ 

ఇది రాజకీయ హత్యే: జనసేన

ఎమ్మెల్యే రాంబాబుపై క్రిమినల్‌  కేసు నమోదుకు డిమాండ్‌

పరామర్శకు రానున్న పవన్‌కల్యాణ్‌

బేస్తవారపేట, జనవరి 19 : వైసీపీ కార్యకర్తల బెదిరింపులతోనే బండ్ల వెం గయ్య (40) ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిం చారు.  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వెంగయ్య అంత్యక్రియలు స్వగ్రామమైన శింగరపల్లెలో మంగళవారం జరిగాయి. పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. జనసేన ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, మార్కాపురం, గిద్దలూరు,  ఇన్‌చార్జిలు ఇమ్మడి కాశీనాథ్‌, బెల్లంకొండ సాయిబాబా తదితరులు వెంగ య్యకు నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ... వెంగయ్యది ఆత్మహత్య కాదని వైసీపీ నాయకులు చేసిన రాజకీయ హత్య అని ఆరోపించారు. దీనికి బాధ్యులైన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఆయన అనుచరులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుని కుటుంబాన్ని అన్నివిధాలా జనసేన పార్టీ ఆదుకుంటుందన్నారు. అధినేత పవన్‌ కల్యాణ్‌ రెండు మూడురోజుల్లో వెంగ య్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు రానున్నట్లు వారు చెప్పారు. 


వైసీపీ కార్యకర్తలు బెదిరించారు : బాధిత కుటుంబీకులు

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనుచరులైన వైసీపీ కార్యకర్తలు తమను బెదిరించారని వెంగయ్య కుటుంబసభ్యులు ఆరోపించారు. విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ జనసేన కార్యకర్త వెంగయ్య ఆత్మహత్య నేపథ్యాన్ని వివరించారు. ఈనెల 15న కోనపల్లె గ్రామానికి వెళుతున్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును చూసి వెంగయ్య, జనసేన కార్యకర్తలు ఆపారన్నారు. గ్రామంలో డ్రైౖనేజీ కాలువలు లేకపోవడం,  ఇతరత్రా మరికొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే జనసేన కార్యకర్తలపై విరుచుకుపడ్డారన్నారు. అప్పటి నుంచే వారికి వేధింపులు మొదలయ్యాయని తెలిపారు. వెంగయ్య భార్య లక్ష్మీనారాయణమ్మ మాట్లా డుతూ తన భర్తను వైసీపీ కార్యకర్తలు కొట్టారని, తనను బెదిరించారని ఆరోపించారు. దీంతో తన భర్త అత్మహత్య చేసుకుంటున్నట్లు ఫోన్‌లో వివరించి బలవన్మరానికి పాల్పడ్డారని ఆమె బోరుమన్నారు. వెంగయ్య సోదరుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తన తమ్ముడు వెంగయ్య జనసేన పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నాడన్నారు. దీంతో గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఓర్వలేక కొట్టి బెదిరించడంతో మనస్తాపానికి గురయ్యాడని తెలిపారు. ఆ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసకున్నాడని అన్నారు. కాగా వైసీపీ నాయకుల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని మరో జనసేన కార్యకర్త, మృతుడి మేనల్లుడు దుమ్మని చంద్రశేఖర్‌ వాపోయాడు. తనను ఇప్పటికే బెదిరించి ఊరి నుంచి వెళ్లిపొమ్మన్నారని తెలిపాడు.  
Updated Date - 2021-01-20T06:37:38+05:30 IST