కొలువుదీరనున్న ‘వల్లూరమ్మ’ ట్రస్టీ

ABN , First Publish Date - 2021-12-10T04:49:04+05:30 IST

టంగుటూరు మండలంలోని వల్లూరులో వేంచేసి ఉన్న వల్లూరమ్మ దేవస్థానం పాలకవర్గ ఎంపిక ఎట్టకేలకు పూర్తయింది.

కొలువుదీరనున్న ‘వల్లూరమ్మ’ ట్రస్టీ

నేడు బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం

టంగుటూరు, డిసెంబరు 9 : మండలంలోని వల్లూరులో వేంచేసి ఉన్న వల్లూరమ్మ దేవస్థానం పాలకవర్గ ఎంపిక ఎట్టకేలకు పూర్తయింది. రాష్ట్ర దేవదాయ శాఖ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు సభ్యులుగా నిర్ణయించబడ్డ 9 మంది శుక్రవారం దేవస్థానం ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం జరిగే తొలి సమావేశం ద్వారా ట్రస్టీ బోర్డు చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికి ఒకసారి దేవస్థానం డైరెక్టర్ల ఎంపిక, వారి ప్రమాణస్వీకారం, చైర్మన్‌ ఎంపిక జరిగాయి. న్యాయస్థానం ఆదేశాలతో ఈ ఎంపికకు బ్రేకులు పడ్డాయి. కొందరి సభ్యుల ప్రమాణ స్వీకారం జరగలేదని, చైర్మన్‌ ఎంపిక నిబంధనలకు విరుద్ధమని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆ పాలకవర్గాన్ని రద్దు చేసింది. అధికార పార్టీలోని నాయకుల మధ్య వచ్చిన విభేదాలతో పాలకవర్గ ఎంపిక వివాదాస్పదం అయిందన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. కోర్టు తీర్పుతో దేవస్థానం తిరిగి పాలకవర్గం లేని దేవస్థానంగా మిగిలిపోయింది. తిరిగి డైరెక్టర్ల ఎంపికతో దేవదాయ శాఖ నుంచి మరొక జాబితా దేవస్థానానికి వచ్చింది. రద్దు అయిన డైరెక్టర్ల జాబితాలో కొన్ని మార్పులు జరిగాయి. అప్పటి కొందరి సభ్యుల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. మొత్తం 9 మంది డైరెక్టర్లతోపాటు దేవస్థానం ప్రధాన అర్చకుని స్థానంలో ఈసారి కొత్తగా ప్రస్తుత ప్రధాన అర్చకుడు ఉమాశంకర్‌ పేరు చేర్చారు.

కొత్త సభ్యులు వీరే

ప్రభుత్వం ప్రతిపాదించిన దేవస్థానం పాలకవర్గ సభ్యుల వివరాలు... చుండి బంగారు, సుంకర బ్రహ్మానందరెడ్డి, బాలినేని వెంకటేశ్వరరెడ్డి, కాలే శ్రీనివాసులు, ముప్పరాజు వీణావాని, గుడిపాటి సుశీల, యర్లబోయిన కోటేశ్వరమ్మ, తక్కెళ్లపాటి పద్మజ, పూనూరి రాధా పేర్లు ఖరారయ్యాయి. వీరితోపాటు ప్రధాన అర్చకుడు ఉమాశంకర్‌ సభ్యునిగా కొనసాగుతారు.

చైర్మన్‌గా శ్రీనివాసరావు

సభ్యుల ప్రమాణ స్వీకారం జరగగానే దేవస్థానం పాలకవర్గ తొలి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలోనే వల్లూరుకు చెందిన కాలే శ్రీనివాసరావును చైర్మన్‌గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వల్లూరు దేవస్థానం చైర్మన్‌గిరి తమకు కావాలంటూ వల్లూరుకు చెందిన వైసీపీ సీనియర్‌ నాయకుడు కుందం హనుమారెడ్డి కోరుతున్నారు. ఆయన మంత్రి బాలినేని వద్ద తన మాటను నెగ్గించుకున్నారు. మంత్రి అండతోనే హనుమారెడ్డి కొత్త పాలకవర్గ సభ్యులను సూచించడం, అదే పేర్లకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడం చకచకా పూర్తయింది. హనుమారెడ్డి మద్దతుదారుడైన శ్రీనివాసరావు రద్దు అయిన పాలకవర్గంలో చైర్మన్‌గా ఉన్నారు. తిరిగి ఆయన పేరునే హనుమారెడ్డి ప్రతిపాదించనున్నారు. ఈసారీ ఆయనే చైర్మన్‌గా ఎంపికై ప్రమాణం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుబ్బారావు నేతృత్వంలో పూర్తయ్యాయి. 

Updated Date - 2021-12-10T04:49:04+05:30 IST