టీకా ఫైట్!
ABN , First Publish Date - 2021-05-09T05:29:47+05:30 IST
జిల్లాకేంద్రమైన ఒంగోలులో ఆయా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద గుంపులుగుంపులుగా ప్రజానీకం చేరడంతో అక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గత వారం రోజుల నుంచి కొవాగ్జిన్ టీకా అందుబాటులో లేకపోవడంతో శనివారం ఆయా కేంద్రాల వద్ద టీకా వేసే ప్రక్రియను వైద్యఆరోగ్యశాఖ చేపట్టింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో వేలాదిమంది కొవాగ్జిన్ టీకారెండో డోసు వేయాల్సి ఉంది.

కొవాగ్జిన్ సెకండ్ డోస్ కోసం పోటెత్తిన జనం
ఉదయం నుంచే పెద్ద ఎత్తున బారులు
కేంద్రాల ఎదుట గుంపులుగుంపులు
వైద్యఆరోగ్యశాఖ నిర్వాకమే కారణం
కొన్ని కేంద్రాల వద్ద అదుపుతప్పిన పరిస్థితి
రిమ్స్‌లోని కేంద్రం ఎదుట తోపులాట
పోలీసుల వచ్చిన తర్వాత క్రమపద్ధతి
ఎక్కడా కనిపించని కరోనా జాగ్రత్త చర్యలు
అయినా చాలామంది నిరాశతో వెనుదిరిగారు
ఒంగోలు(కలెక్టరేట్), మే 8 :
కొవాగ్జిన్ వచ్చిందని తెలియగా జనం పోటెత్తారు. కేంద్రాల ఎదుట ఎక్కడ చూసినా భారీ క్యూలు కనిపించాయి. గుంపులుగుంపులుగా చేరి కరోనా నిబంధనలను గాలికొదిలేశారు. సెకండ్‌డోసు వేయించుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే వందలాదిగా తరలిరావడంతో ఆయా కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు చేరుకుని క్యూపద్ధతిలో వ్యాక్సినేషన్ కేంద్రంలోకి పంపించారు. మొదటి డోసును సచివాలయాల్లో వేసిన వైద్యారోగ్యశాఖాధికారులు రెండో డోసు వచ్చేసరికి పరిమిత కేంద్రాల్లో వేస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వచ్చిన కొవాగ్జిన్ అయిపోతే మరలా రాదేమోనన్న ఆందోళనతో ప్రజానీకం పరుగులుపెట్టారు. రిమ్స్ కేంద్రంలో అయితే ఒకనొక దశలో పరిస్థితి చేయిదాటింది. తోపులాట కూడా చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆయా క్రేందాల్లో కరోనా భౌతికదూరం ఇతర నిబంధనలు కనిపించలేదు. చివరకు చాలామంది టీకా వేయించుకోకుండానే వెనుతిరిగి పోవాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది.
జిల్లాకేంద్రమైన ఒంగోలులో ఆయా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద గుంపులుగుంపులుగా ప్రజానీకం చేరడంతో అక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గత వారం రోజుల నుంచి కొవాగ్జిన్ టీకా అందుబాటులో లేకపోవడంతో శనివారం ఆయా కేంద్రాల వద్ద టీకా వేసే ప్రక్రియను వైద్యఆరోగ్యశాఖ చేపట్టింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో వేలాదిమంది కొవాగ్జిన్ టీకారెండో డోసు వేయాల్సి ఉంది. అయితే వైద్య ఆరోగ్యశాఖ పరిమితంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే కొవాగ్జిన్ వేస్తామని ప్రకటించడంతో శనివారం ఉదయం ఆరున్నర గంటలకే ప్రజానీకం బారులు తీరారు. అలాగే ప్రధాన పట్టణాల్లోని కేంద్రాలకు పరిమితంగానే వ్యాక్సిన్ చేరింది. మొత్తం 53 కేంద్రాల్లో మాత్రమే కొవాగ్జిన్ టీకా వేశారు. దీంతో ముందుగా ఆయా కేంద్రాల వద్ద టీకా వేయించుకొని వ్యక్తి ఆధార్‌ను నమోదు చేయాల్సి ఉంది. దీంతో ప్రజానీకం ముందుగానే ఎవ్వరికి వారు తమ పేర్లు నమోదు చేయించుకోవాలనే ఉద్దేశంతో భారీగా తరలిరావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కడికక్కడే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది.
ఏ కేంద్రంవద్ద చూసినా ఇదే పరిస్థితి
మొదటి డోసును ఒంగోలులో సచివాలయాల పరిధి నుంచి ప్రజలకు వేశారు. కానీ సెకండ్ డోసు వేసే సమయంలో ఒంగోలులో ఎంపిక చేసిన ఐదు కేంద్రాల్లో మాత్రమే టీకా వేస్తామని ప్రకటించడంతో ఆయా కేంద్రాల వద్దకు బారులు తీరారు. బాలాజీనగర్, పాపాకాలనీ, వెంకటేశ్వరకాలనీ, మంగమూరు రోడ్డులోని గాంధీనగర్, కుటుంబ నియంత్రణ కేంద్రం(రిమ్స్)లో మాత్రమే ఈ టీకా వేశారు. అలాగే జిల్లావ్యాప్తంగా ఇంకా 48చోట్ల కొవాగ్జిన్ వేశారు. ఆయా కేంద్రాల వద్ద సెకండ్‌డోసు వేయించుకోనేందుకు వందలాది మంది రావడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. దీంతో ఆయా కేంద్రాల వద్దకు పోలీసుల వచ్చి గుంపులుగుంపులుగా లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిమ్స్ వద్ద ఒకానొక దశలో తోపులాట చోటుచేసుకుంది. కొందరు కిందకూడా పడిపోయారు. అయితే సకాలంలో పోలీసులు స్పందించడంతో కొద్దిసేపటికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదేవిధంగా జిల్లాలోని చీరాల, చీమకుర్తి, పర్చూరు, సంతనూతలపాడు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం తదితర అర్బన్ ఏరియాల్లో కొద్దిమొత్తంలో మాత్రమే సెంకడ్ డోస్ వారికి కొవాగ్జిన్ వేశారు. దీంతో ఆయాచోట్ల కూడా భారీగా క్యూలు కనిపించినాయి. చాలామంది ఐదారు గంటలు వేచి చూసి ఉసూరుమంటూ వెనుదిరిగి వెళ్లారు.
ముందుచూపుతో వ్యవహరించకనే ఈ పరిస్థితి
కాగా కొవాగ్జిన్ కోసం వేలాదిమంది ఉన్నారని తెలిసినా వైద్య ఆరోగ్యశాఖ ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లనే శనివారం ఈ పరిస్థితి నెలకొంది. మొదటిడోసు వేయించుకున్న తర్వాత ఆరువారాల్లోపు సెకండ్ డోసు వేయించుకోవాల్సి ఉంది. దీంతో సమయం ముగిసిపోతుందని ప్రజానీకం ఆందోళనతో ఈ టీకా కోసం వందలాది మంది ఆయా కేంద్రాల వద్దకు తరలివచ్చారు. ఎక్కువమంది ప్రజానీకం ఉన్నందున ఇంకా అదనంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ అటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఇలాగా కరోనా నియంత్రణ సాధ్యమేనా?
జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో నియంత్రణ కోసం మధ్యాహ్నం 12గంటల నుంచి కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలుచేస్తున్న అధికారులు టీకా కేంద్రాల వద్దకు వేలాదిమంది వస్తుండటంతో ఏ విధంగా నియంత్రణ జరుగుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు టీకా వేసేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోక పోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో 7,987 మందికి టీకాలు
జిల్లాలో శనివారం 7,987 మందికి వ్యాక్సిన్ (టీకాలు) వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రత్నావళితెలిపారు. 125 టీకా కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 5,08,627 మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు.
15 వరకు సెకండ్ డోసే
జిల్లాలో ఈనెల 15వతేదీ వరకు ప్రజలకు సెకండ్ డోస్ టీకా వేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు కలెక్టర్ పోలాభాస్కర్ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో ఇప్పటివరకు ఐదు లక్షల మంది వరకు మొదటి డోసు వేయించుకోగా వారిలో 60శాతంకుపైగా సెకండ్ డోసు వేయించుకోవాల్సి ఉంది. దీంతో జిల్లాలో అవసరమైన మేరకు నిల్వలు లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి డోసులతో సర్దుకుంటూ వస్తున్నారు. అందులో ఎక్కువమంది ప్రజానీకం కొవాగ్జిన్ టీకా సెకండ్ డోసు వేయించుకోవాల్సి ఉంది. సమయం ముగిసిపోతుండటంతో ప్రస్తుతం ఈ వారంరోజుల పాటు వారికే వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.