టీకా.. కాక...!

ABN , First Publish Date - 2021-05-25T05:16:25+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వైరస్‌ విచ్చలవిడిగా దాడి చేస్తుండడంతో హడలిపోతున్నారు. వ్యాక్సిన్‌ కోసం పరుగులుపెడుతున్నారు.

టీకా.. కాక...!
దర్శిలోని జూనియర్‌ కళాశాల ఆవరణలో వ్యాక్సిన్‌ స్లిప్పుల కోసం కౌంటర్‌ వద్ద ఎగబడుతున్న ప్రజలు


కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వైరస్‌ విచ్చలవిడిగా దాడి చేస్తుండడంతో హడలిపోతున్నారు. వ్యాక్సిన్‌ కోసం పరుగులుపెడుతున్నారు. సోమవారం దర్శి కేంద్రం వద్దకు కొవాగ్జిన్‌ రెండోడోసు కోసం వందలాది మంది గుంపులుగా చేరారు. ఎలాగైనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలనే ఆత్రుతతో మహిళలు, పురుషులు ఉదయం 9 గంటలకే  భారీగా చేరుకున్నారు. తొలుత మహిళలను ఒకవైపు, పురుషులను మరోవైపు క్యూలో ఉంచి వ్యాక్సిన్‌ వేయడం ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత మహిళలు అధికంగా రావడంతో రెండో లైన్‌లో నిలబడాలని సిబ్బంది సూచించారు. ముందు వరసలోకి వారి కంటే రెండో వరసలో వారికి త్వరగా వ్యాక్సిన్‌ వేస్తుండడంతో ఒక్కసారిగా మహిళలు గుమికూడారు. మరోవైపు వ్యాక్సిన్‌ కోసం పురుషులు కూడా తోసుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. 300 మందికి కొవాగ్జిన్‌ రెండో డోస్‌ వేసినట్లు చందలూరు పీహెచ్‌సీ వైద్యాధికారి విజయ్‌కుమార్‌ తెలిపారు. మొత్తం 700 మంది వేయాల్సి ఉండగా, వ్యాక్సిన్‌ అందుబాటులో లేక మిగిలిన వారు వెనుదిరిగారు. ఇక 100 మందికి కొవిషీల్డు తొలి డోస్‌ వేసినట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు.     -దర్శి 



Updated Date - 2021-05-25T05:16:25+05:30 IST