ఉనికి కోసమే ఎస్‌ఈబీ దాడులు

ABN , First Publish Date - 2021-07-13T05:28:36+05:30 IST

ఎస్‌ఈబీ అధికారులు ఉనికి కాపాడుకోవడానికే ఇసుక, మద్యంపై తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తూన్నారు. దీంతో మద్యం అక్రమ రవాణా ఆగడం లేదు. ఎక్కడ చూసినా అక్రమ మద్యం పరవళ్లు తొక్కుతోంది. ప్రతి గ్రామంలో రెండు, మూడు బెల్ట్‌ షాపులు దర్శనమిస్తున్నాయి. పొదిలి కొనకనమిట్ల మండలాల్లో తెలంగాణ అక్రమ మద్యంతో పాటు సారా విచ్చలవిడిగా కాస్తున్నారు.

ఉనికి కోసమే ఎస్‌ఈబీ దాడులు
గొట్లగట్టులో భారీగా పట్టుబడిన గోవా మద్యం (ఫైల్‌ )


 కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి

పొదిలి (రూరల్‌) జూలై 12 : ఎస్‌ఈబీ అధికారులు ఉనికి కాపాడుకోవడానికే ఇసుక, మద్యంపై తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తూన్నారు. దీంతో మద్యం అక్రమ రవాణా ఆగడం లేదు. ఎక్కడ చూసినా అక్రమ మద్యం పరవళ్లు తొక్కుతోంది. ప్రతి గ్రామంలో రెండు, మూడు బెల్ట్‌ షాపులు దర్శనమిస్తున్నాయి. పొదిలి కొనకనమిట్ల మండలాల్లో తెలంగాణ అక్రమ మద్యంతో పాటు  సారా విచ్చలవిడిగా కాస్తున్నారు.   ఏదో ఉన్నతాధికారులకు టార్గెట్‌లు చూపించాలి కాబట్టి దాడులు చేసి ఐదు, పది బాటిళ్లు పట్టుకున్నట్లు చూపిస్తున్నారు. వందల కేసుల తెలంగాణ మద్యం నిల్వలు ఉంచిన వారిని మాత్రం వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పొదిలి, కొనకనమిట్ల ప్రాంతంలో భారీగా తెలంగాణ మద్యం సరఫరా చేస్తున్న అక్రమార్కులను వదిలి షాపుల నుంచి నలుగురు మందు బాబులు కలిసి 10 క్వార్టర్‌లు తీసుకెళుతున్న వారిని పట్టుకొని అరెస్టులు చూపించడం ఎస్‌ఈబీ అధికారులకు పరిపాటిగా మారింది. కొనకనమిట్ల మండలంలో ప్రభుత్వ మద్యంతో పాటు  సారా సందు సందులో  గుప్పుమంటోంది. మండలంలో గొట్లగట్టు, చినమనగుండం, నాగంపల్లి, గాజులపల్లి, నాయుడిపేట, దాసర్లపల్లి, చినారికట్ల, పెదారికట్ల గ్రామాల్లో  సారా బట్టీలు వెలిశాయి. పొదిలి మండలంలో కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలతో పాటు బెల్టుషాపులు, మరికొన్ని గ్రామాల్లో సారా  కూడా దొరుకుతోంది. గొట్లగట్టు గ్రామంలో రెండు రోజులు హడావుడి చేసి ఇద్దరు వ్యక్తుల నుంచి 61 కేసుల గోవా మద్యాన్ని ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఒక్క గొట్లగట్టు, చినమనగుండం గ్రామాల్లోనే 10 మంది వ్యాపారులు, నలుగురు తెలంగాణ, గోవా మద్యం సరఫరా చేసే వ్యక్తులు ఉన్నారనే సమాచారం ఉంది. వీరిలో కొంత మంది  వ్యాపారులు దర్శి, దొనకొండ, తాళ్లూరు, ఒంగోలు, కనిగిరి, పామూరు, కందుకూరు ప్రాంతాలకు కూడా మద్యంను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. గొట్లగట్టు సెంటర్‌ నుంచి మద్యం అక్రమ వ్యాపారం నిర్వహించుకునేందుకు అధికారులకు నెల మామూళ్లు భారీగా ఇస్తున్నారని, అందుకే  అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని  ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.   గతంలో చినమనగుండంలో ఒక వ్యక్తికి  చెందిన కారులో 8 కేసుల మందు  దొరికింది. అయితే గ్రామం దాటేలోపు భేరసారాలు కుదుర్చుకొని కారును వదిలేసి కొంత మద్యంతో ఒకరిని చూపించడం అధికారుల పనితీరుకు నిదర్శనం.  


ఇసుక మాఫియాలోనూ అదేతీరు..   

మండలంలో ఇసుక మాఫియా రోజరోజుకూ రెచ్చిపోతోంది. రోజుకు వందల ట్రాక్టర్లు అక్రమ ఇసుక తరలిపోతున్నా అధికారులు మాత్రం కాసులకు కక్కుర్తిపడి అక్రమార్కులను వదిలేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక వ్యాపారులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఎస్‌ఈబీ అధికారులు మూడు నాలుగు టన్నుల ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని మమ అనిపిస్తున్నారు.  మండలంలో మూసి వాగు పరివాహక ప్రాంతాలైన తళమళ్ల, అన్నవరం, ఉప్పలపాడు, గోగినేనివారిపాలెం, ఏలూరు, సల్లూరు, ఈగలపాడు, కుంచేపల్లి, పాములపాడు, కాశీపురం, రాములవీడు, గ్రామాల్లో విచ్చలవిడిగా ఇసుక వ్యాపారం జరుగుతోంది. నిమ్మావరం, అన్నవరం, కొష్టాలపల్లి, కేశవబొట్లపాలెం గ్రామాల్లో ట్రాక్టర్లు రాత్రుల్లో ఎక్కువగా ఇసుక సరఫరా చేస్తున్నారు. ఈతంతు మొత్తం ఉన్నతాధికారులు ప్రతిరోజు అదే నదిపై ప్రయాణాలు చేస్తూ చూస్తున్నా ప్రశ్నించరు. రోజూ లక్షల్లో ఇసుక వ్యాపారం  చేస్తూ అధికారులకు భారీమొత్తంలో ముట్టజెప్పడంతో ఇసుక అక్రమ వ్యాపారులకు అడ్డు లేకుండా పోయింది.  జిల్లా అధికారులు స్పందించి  ముసి వాగు ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

 Updated Date - 2021-07-13T05:28:36+05:30 IST